Begin typing your search above and press return to search.

సినిమా టికెట్ ధరల వ్యవహారం ఓ కొలిక్కి రానుందా..?

By:  Tupaki Desk   |   29 Dec 2021 2:30 PM GMT
సినిమా టికెట్ ధరల వ్యవహారం ఓ కొలిక్కి రానుందా..?
X
ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టికెట్‌ ధరల వ్యవహారం మరియు థియేటర్ల మూసివేత అంశాలు చర్చనీయంగా మారాయి. టికెట్‌ ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని సినీ ప్రముఖులు కోరుతుండగా.. ప్రజల సంక్షేమం కోసమే సినిమా టికెట్ రేట్లు నియంత్రిస్తున్నామని నాయకులు చెబుతున్నారు. అయితే త్వరలోనే ఈ వ్యవహారం ఓ కొలిక్కి రానుందని ఏపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ఏపీలోని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సినిమా టికెట్ల అంశం మీద సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నానితో భేటీ అయ్యారు. స్లాబుల వైజ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రేట్లలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. సినిమా టికెట్ల ధరలు పెంచాలనే ప్రతిపాదనను మంత్రి ముందు ఉంచారు. దీని గురించి సవివరంగా తెలియజేస్తూ అభ్యర్థన లేఖను సమర్పించారు.

కార్పొరేషన్లలోని ఏసీ థియేటర్లలో టికెట్ ధర గరిష్టంగా రూ.150 - కనిష్టంగా రూ. 50లు.. నాన్‌ ఏసీలో అప్పర్ క్లాస్ లో రూ. 100 - లోయర్‌ క్లాస్‌ లో రూ.40 ఉండాలని డిస్ట్రిబ్యూటర్లు కోరారని తెలుస్తోంది. అలాగే ఇతర ప్రాంతాల్లోని ఏసీ థియేటర్లలో గరిష్టంగా రూ.100 - కనిష్టంగా రూ.40.. నాన్‌ ఏసీలో అత్యధికంగా రూ. 80 - కనిష్టంగా రూ.30 ఉండేలా చూడాలని విన్నవించారు.

ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఛైర్మన్‌ గా వ్యవహరించనున్న ఈ కమిటీలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ గోయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సినిమా టికెట్ ధరల సమస్యలపై ఈ కమిటీ కూలంకషంగా చర్చించి ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.

టికెట్ రేట్లకు సంబంధించి ఈ కమిటీ తొలి సమావేశం ఎప్పుడు ఉంటుందో చూడాలి. మొదటి మీటింగ్ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే మరొక సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కమిటీ అందించిన నివేదికను సినిమాటోగ్రఫీ మంత్రి పరిశీలించిన తర్వాత ప్రభుత్వం జీవో జారీ చేసే అవకాశం ఉంది.

ప్రజల మీద భారం పడకుండా.. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లను సంతృప్తి పరిచేలా ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను నిర్ణయించనుందని టాక్ వినిపిస్తోంది. కాకపోతే ఈ ప్రక్రియ అంతా జనవరి మొదటి వారంలోనే వచ్చేస్తే.. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కాబోయే సినిమాకు ఉపయోగపడుతుంది.

పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న 'RRR' 'రాధే శ్యామ్' వంటి సినిమాలు.. ఏపీలో ప్రస్తుతమున్న ధరతో భారీ వసూళ్లు సాధించడం కష్టమే. అందుకే ఈ సినిమాలు విడుదల అయ్యేలోపే సినిమా టికెట్ల వ్యవహారం ఓ కొలిక్కి రావాలని అందరూ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మూతపడిన సినిమా థియేటర్లన్నిటినీ తెరిచే విధంగా ఎగ్జిబిటర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ప్రభుత్వం దీనిపై వీలైనంత త్వరగా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తుందేమో చూడాలి.