Begin typing your search above and press return to search.

'భీమ్లా' ను హిందీలో రిలీజ్ చేసే సాహసం చేస్తారా..?

By:  Tupaki Desk   |   2 Sep 2022 4:02 AM GMT
భీమ్లా ను హిందీలో రిలీజ్ చేసే సాహసం చేస్తారా..?
X
పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. వివిధ కారణాలతో చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోయింది.

నిజానికి 'భీమ్లా నాయక్' చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇటీవల కాలంలో సౌత్ చిత్రాలు నార్త్ లో సత్తా చాటుతున్న నేపథ్యంలో పవన్ సినిమాని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయాలని భావించారు.

పీకే ఫ్యాన్స్ సైతం భీమ్లా ను బాలీవుడ్ లోకి తీసుకెళ్లాలని పట్టుబట్టారు. నిర్మాతలు కూడా హిందీ రిలీజ్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అయితే తెలుగులో విడుదలైన ఈ సినిమా హిందీలో రిలీజ్ కాలేదు. దీనికి కారణం డబ్ వర్సన్ కు లీగల్ సమస్యలు తలెత్తడమే.

'అయ్యప్పనుమ్ కోశియుమ్' చిత్రానికి రీమేక్ గా ''భీమ్లా నాయక్'' తెరకెక్కిందనే సంగతి తెలిసిందే. అయితే మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా తెలుగు హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ తీసుకుంటే.. హిందీ రైట్స్ ను బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం సొంతం చేసుకున్నారు.

ఏకే రీమేక్ రైట్స్ తమ వద్ద ఉన్న కారణంగా.. దాని రీమేక్ ను హిందీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడంపై జాన్ అబ్రహాం టీమ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద కోర్టుకు వెళ్లారు. అయితే ఈ కేసులో 'భీమ్లా' మేకర్స్ కు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

'బీమ్లా నాయక్' హిందీ వెర్షన్ ను రిలీజ్ చేసుకోడానికి లైన్ క్లియర్ అయినట్లుగా పేర్కొంటున్నారు. మరి ఇన్ని నెలల తర్వాత ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తారా లేదా? ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.

కారణాలు ఏవైనా తెలుగులో భీమ్లా నాయక్ ఆశించిన వసూళ్లను సాధించలేకపోయింది. అలాంటి చిత్రాన్ని మేకర్స్ హిందీలో రిలీజ్ చేసే సాహసం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇకపోతే 'సర్దార్ గబ్బర్ సింగ్' తో బాలీవుడ్ లో నిరాశపరిచిన పవన్.. ఈసారి తానేంటో హిందీ మార్కెట్ లో చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

'భీమ్లా నాయక్' చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. ఇందులో రానా దగ్గుబాటి - నిత్య మీనన్ - సంయుక్త మీనన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.