Begin typing your search above and press return to search.

స్మార్ట్ వాతలు పెట్టుకుంటే కష్టమే

By:  Tupaki Desk   |   24 July 2019 2:30 PM GMT
స్మార్ట్ వాతలు పెట్టుకుంటే కష్టమే
X
బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా గ్యాప్ తర్వాత వచ్చిన మాస్ సినిమాగా ఇస్మార్ట్ శంకర్ ఆ అవకాశాన్ని ఫుల్ గా వాడుకుంది. మొదట నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ రీచ్ అయిపోయి బయ్యర్లను ఫుల్ హ్యాపీ చేసేసిన శంకర్ ఫస్ట్ వీక్ అయ్యాక ఇంకాస్త స్పష్టత ఇస్తాడు. కానీ సినిమా ప్రేమికులు మరో విషయంలో కొంత ఆందోళన పడక తప్పదు. ఎందుకంటే టాలీవుడ్ లో సాధారణంగా ఒక ఫార్ములాతో హిట్ కొడితే ఆ తర్వాత అదే మూసలో అందరూ అలాంటివే తీసేందుకు ట్రై చేస్తారు.

ఆర్ నారాయణమూర్తి ఎర్ర సైన్యం బ్లాక్ బస్టర్ అయినప్పుడు పెద్ద పెద్ద హీరోలు దర్శకులు ఆ జానర్ ట్రై చేసి కొందరు సక్సెస్ అయితే కొందరు చేతులు కాల్చుకున్నారు. పెళ్లి సందడి పుణ్యమా అని అదే టైపులో ఆ టైంలో ఎన్ని వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. సమరసింహారెడ్డి ఫ్యాక్షన్ సినిమాలకు ఊతం ఇచ్చినప్పుడు ఆ కథలను టచ్ చేయని స్టార్ లేరంటే అతిశయోక్తి కాదేమో

కానీ పైన చెప్పిన ఉదాహరణలకు ఇస్మార్ట్ శంకర్ కు చాలా తేడా ఉంది. అవన్నీ బలమైన కంటెంట్ తో ఇప్పటికీ రిఫరెన్స్ గా వాడుకునే సినిమా మేకింగ్ గ్రామర్ తో వచ్చినవి. సిల్వర్ జూబ్లీలు చూసినవి. కానీ ఇస్మార్ట్ శంకర్ కేసు వేరు. కథ వీక్ గా ఉన్నా రామ్ ఎనర్జీ పూరి ఊర మాస్ డైలాగులు ఇద్దరు హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శన వెరసి మాస్ ని థియేటర్ల వైపు లాగాయి.

ఈ మసాలా కూర్పు ప్రతి సినిమాకు జరిగే పని కాదు. అందులోనూ ఇతర దర్శకులు హీరోలు ఎవరైనా ట్రై చేసినా అదేదో సామెత చెప్పినట్టు పులిని చూసి వాత పెట్టుకున్న తరహాలో అవుతుంది. ఇంకొద్ది రోజులు ఆగి ఇస్మార్ట్ శంకర్ ప్రభంజనం ఎక్కడిదాకా ఉంటుందో చూసి అప్పుడు ట్రెండ్ మీద ఓ అంచనాకు రావొచ్చు. అంతే తప్ప మాస్ పేరుతో ఏది తీసినా చెల్లిపోతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే