Begin typing your search above and press return to search.

'సార్' యంగ్ డైరెక్ట‌ర్ ని గ‌ట్టెక్కిస్తాడా?

By:  Tupaki Desk   |   13 Feb 2023 5:00 PM GMT
సార్ యంగ్ డైరెక్ట‌ర్ ని గ‌ట్టెక్కిస్తాడా?
X
గ‌త కొంత కాలంగా మ‌న హీరోలంతా పాన్ ఇండియా సినిమాల వెంట ప‌రుగులు తీస్తుంటే తమిళ హీరోలు మాత్రం మ‌న టాలీవుడ్ డైరెక్ట‌ర్ల వెంట ప‌డ‌తున్నారు. ఒకేసార‌ని బై లింగ్వ‌ల్ అంటూ త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో సినిమాలు చేస్తూ రెండు రాష్ట్రాల్లో త‌మ మార్కెట్ ని విస్త‌రించుకునే ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే ద‌ళ‌ప‌తి విజ‌య్ వంటి స్టార్స్ తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో క‌లిసి భారీ సినిమాలు చేసిన విష‌యం తెలిసిందే. ఇదే పంథాలో మ‌రో త‌మిళ హీరో శివ కార్తీకేయ‌న్ కూడా త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో 'ప్రిన్స్‌' మూవీ చేశాడు.

'జాతిర‌త్నాలు' ఫేమ్ అనుదీప్ కె.వి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో విడుద‌లైన ఈ మూవీ రెండు భాష‌ల్లోనూ ఫ్లాప్ అనిపించుకుని అనుదీప్ కు గ‌ట్టి షాకిచ్చింది. ఇక ఇదే త‌ర‌హాలో ద‌ళ‌ప‌లి విజ‌య్ న‌టించిన 'వారీసు' త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుని తెలుగులో 'వార‌సుడు'గా విడుద‌లై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. కానీ తమిళంలో మాత్రం భారీ వ‌సూళ్ల‌తో పాటు బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకోవ‌డంతో వంశీ పైడిప‌ల్లి ఇక్క‌డ ఫెయిలైనా అక్క‌డ పాస‌య్యాడు.

ఇప్పుడు ఇదే త‌ర‌హాలో మ‌రో ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి త‌మిళ హీరో ధ‌నుష్ తో చేసిన మూవీ 'సార్‌'. త‌మిళంలో 'వాతి'గా రూపొందిన ఈపొందిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల కాబోతోంది. ఒకేసారి త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రిలీజ్ కానున్న ఈ మూవీపై యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు. రొటీన్ స్టోరీతో కాకుండా ఎడ్యుకేష‌న్ మాఫియా నేప‌థ్యంలో ఈ మూవీని ధ‌నుష్ మార్కు సినిమాగా తెర‌కెక్కించారు.

సందేశాన్ని జోడించి క‌మర్షియ‌ల్ అంశాల నేప‌థ్యంలో ఈ సినిమాని తెర‌కెక్కించారు. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇలాంటి క‌థ‌తో స‌క్సెస్ కొట్ట‌డం చాలా క‌ష్టం. పైగా ఈ మూవీ గ‌త కొన్ని నెల‌లుగా వరుస‌గా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. ఫైన‌ల్ గా ఫిబ్ర‌వ‌రి 17న రిలీజ్ కాబోతోంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగానే వున్నా సినిమాకు కావాల్సినంత బ‌జ్ లేక‌పోవ‌డం ప్ర‌ధాన మైన‌స్ గా మారింది. సినిమా రిలీజ్ కు మ‌రో నాలుగు రోజులు మాత్ర‌మే వుంది.

అప్ప‌టికి బ‌జ్ క్రియేట్ అయితేనే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తారు. అలా వ‌స్తే బొమ్మ బ్లాక్ బ‌స్ట‌రే. కానీ అది జ‌ర‌క్క‌పోతే మాత్రం చేదు అనుభ‌వం ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని ట్రేడ్ వ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్నాయి. ధ‌నుష్ సినిమాల‌కు తెలుగులో మంచి ఆద‌ర‌ణ వున్న విష‌యం తెలిపిందే.

అయితే 'సార్‌' విష‌యంలో మాత్రం పెద్ద‌గా బ‌జ్ క‌నిపించ‌క‌పోవ‌డం ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే బ‌ల‌మైన కంటెంట్ తో వ‌స్తున్న ధ‌నుష్ ఈ మూవీతో యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరిని గ‌ట్టెక్కిస్తాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.