Begin typing your search above and press return to search.

చివరి కోరిక తీరకుండానే.. నర్సింగ్ భార్య ఎమోషన్

By:  Tupaki Desk   |   17 Jan 2021 4:30 PM GMT
చివరి కోరిక తీరకుండానే.. నర్సింగ్ భార్య ఎమోషన్
X
గత ఏడాది ఎవరికీ కలిసి రాలేదు. సినీ పరిశ్రమ మాత్రం రెండు విధాలుగా నష్టపోయింది. ఆర్థిక నష్టాలు ఒకటైతే.. అమూల్యమైన నటులను కోల్పోవడం మరొకటి. శాశ్వతంగా కన్నుమూసిన వారిలో ఎంతో అద్భుతమైన నటులు ఉన్నారు. వారిలో ఒకరు నర్సింగ్ యాదవ్. ఏడాది చివర్లో దూరమైన ఆయన.. తనదైన విలనిజాన్ని, కామెడీని ఏకకాలంలో పండించారు. నర్సింగ్ యాదవ్ గురించి తెలియని ఎన్నో విషయాలను ఆయన సతీమణి చిత్ర మీడియాతో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

'మాది 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు'. కానీ పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి. నా కోసం మూడేళ్లు ఎదురుచూశాడు. చివరకు ఇంట్లో వాళ్లందరినీ ఒప్పించాడు. ఆ తర్వాత అందరి సమక్షంలోనే పెళ్లి జరిగింది. నర్సింగ్ ది చిన్న పిల్లాడి మనస్తత్వం. ఎవరేం చెప్పినా నమ్మేస్తారు. ఆయనలో నాకు నచ్చింది అదే నమ్మకం. మా ఇద్దరి మధ్య ఉన్న నమ్మకాన్ని సజీవంగా ఉంచాడు.

నేను లేకపోతే ఆయనకు రోజు గడవదు. 'చిత్రా.. చిత్రా..' అంటూ రోజుకు లక్షసార్లు పిలిచేవాడు. నేనంటే నర్సింగ్‌కు పంచ ప్రాణాలు. అలా.. ప్రతీ చిన్న పనికీ పిలుస్తుండటంతో విసుగొచ్చేది. కానీ.. అందులోని ప్రేమ వెంటనే అర్థమయ్యేది. ఎప్పుడూ నీ జపమే చేస్తాడని ఆడపడుచులు ఆటపట్టించేవారు.

నర్సింగ్ ఎప్పుడూ కూడా ఒక మాట చెబుతుండేవాడు. నేను మంచాన పడొద్దు. నటిస్తూనే తుది శ్వాస విడవాలి అనేవాడు. ఆఖరి రోజుల్లో కూడా నటించాలని ఎంతో తాపత్రయపడ్డాడు. ఆరోగ్యం నయమైతే నటించాలని ఎంతో ఆశపడ్డాడు.

కానీ.. కుదరలేదు. మళ్లీ నటించాలన్న కోరిక తీరకుండా వెళ్లిపోయాడు. అదే నాకు ఎక్కువగా బాధేస్తోంది. ఆయనకు నటనపై ఉన్న ప్రేమ అలాంటిది. రామ్ గోపాల్ వర్మను గురువులా, చిరంజీవిని ప్రాణంలా నర్సింగ్ ఆరాధిస్తాడు' అని చెప్పుకొచ్చారు చిత్ర.