Begin typing your search above and press return to search.

'లైగర్' వివాదంలో ఇండస్ట్రీ పెద్దలు కలుగజేసుకోరా..?

By:  Tupaki Desk   |   31 Oct 2022 10:30 AM GMT
లైగర్ వివాదంలో ఇండస్ట్రీ పెద్దలు కలుగజేసుకోరా..?
X
'సినిమా' అనేది కొన్ని కోట్లతో కూడుకున్న వ్యాపారం. ఈ వ్యవహారంలో ఎందరి జీవితాలనో పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది. సినిమా హిట్టై లాభాలు వస్తే అందరూ బాగానే ఉంటారు కానీ.. అదే ప్లాప్ అయితే మాత్రం ఆ సినిమాతో సంబంధమున్న అందరి జీవితాలు తలక్రిందులయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే పూరీ జగన్నాథ్ లాంటి సీరియర్ డైరెక్టర్ 'సినిమా అనేది ఒక గ్యాంబ్లింగ్' అని పేర్కొన్నారు.

టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా 'లైగర్' వివాదం హాట్ టాపిక్ గా నడుస్తోంది. పూరీ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. దీంతో అందరూ తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ దర్శకుడు కొంత మేర వెనక్కి తిరిగి ఇవ్వడానికి అంగీకరించారు. అయితే ఈ నష్టాల పరిహారం ఇప్పుడు వివాదంగా మారి ఎన్నో ఇబ్బందికరమైన మలుపులు తీసుకుంటోంది.

డబ్బులు రావడం ఆలస్యం అవడంతోనో.. పూరీ జగన్నాథ్ స్పందించకపోవడం వల్లనో తెలియదు కానీ.. 'లైగర్' బయ్యర్లు ఎగ్జిబిటర్స్ తో కలిసి డైరెక్టర్ ఇంటి వద్ద ధర్నా చేయాలని నిర్ణయించుకోవడం వివాదానికి దారి తీసింది. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ పూరీ మాట్లాడిన వాయిస్ మెసేజ్ బయటకు రావడం.. ఈ క్రమంలో తనను బెదిరిస్తున్నారని పూరీ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

మామూలుగా సినిమాల బిజినెస్ వ్యవహారాలు బయటకు రావు. వ్యాపారమంతా చాలా గుట్టుగా సాగిపోతుంది. ఎప్పుడో ఏదైనా వివాదం తలెత్తితేనే అలాంటివి బయటకు వస్తుంటాయి. ఇప్పుడు 'లైగర్' విషయంలో పూరీకి డిస్ట్రిబ్యూటర్లు మరియు ఫైనాన్షియర్స్ మధ్య గొడవ రచ్చ కెక్కటంతో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఘటనల వల్ల సాధారణ ప్రేక్షకుల్లో సినీ ఇండస్ట్రీ అంటే చులకన భావం ఏర్పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో పూరీ జగన్నాథ్ రూపొందించిన 'నేనింతే' విషయంలోనూ ఇలాంటి వివాదమే చెలరేగింది. కాకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్ళలేదు. నష్టపరిహారం కోసం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం ఛాంబర్ ముందు టెంట్లు వేసి ధర్నాకు చేయడంతో.. ఎంతో కొంత సెటిల్ చేయడంతో ఆ వివాదం సర్దుమణిగింది. ఆ తర్వాత కొన్ని సినిమాల విషయంలో ఇలానే నష్టపరిహారం కోసం గొడవలు జరిగాయి కానీ.. అప్పట్లో సోషల్ మీడియా విస్తృతంగా లేకపోవడంతో ఎవరికీ పెద్దగా తెలియలేదు.

ఇటీవల 'ఆచార్య' సినిమా పరాజయంతో నష్టపోయిన వారంతా పరిహారం కోసం దర్శక నిర్మాతలను ఆశ్రయించారు. ఈ క్రమంలో డైరెక్టర్ కొరటాల శివ ఆఫీస్ వద్ద ఒక రాత్రి అంతా ధర్నా చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు 'లైగర్' సెటిల్మెంట్ విషయంలో రోజుకో మలుపు తిరుగుతుండటంతో.. ఏం జరుగుతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. గుట్టు చప్పుడు కాకుండా తేల్చుకోవాల్సిన విషయాన్ని రోడ్డు మీదకు తీసుకురావడంతో.. ఈ వ్యవహారంలో ఇండస్ట్రీ పెద్దలు కలుగజేసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలాంటి వివాదాల కారణంగా మొత్తం సినిమా పరిశ్రమ ప్రతిష్టను దిగజార్చుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ మరియు బయ్యర్లను పిలిపించి విషయం తేల్చేందుకు కొంతమంది ఇండస్ట్రీ పెద్దలను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివాదం మరింత ముదరకముందే చర్చలు జరిపి.. దీనికి పరిష్కారం చూపించాలని భావిస్తున్నారట. రాబోయే రోజుల్లో ఎవరూ సినిమా బిజినెస్ వెనుక విషయాలు బయటకు రాకుండా చూడాలని ఆలోచిస్తున్నారట. మరి 'లైగర్' సెటిల్మెంట్ వ్యవహారానికి ఏ విధంగా ఎండ్ కార్డ్ వేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.