Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ షూటింగ్ పై కార్మికుల బంద్ ఎఫెక్ట్

By:  Tupaki Desk   |   22 Jun 2022 4:30 AM GMT
స‌ల్మాన్ షూటింగ్ పై కార్మికుల బంద్ ఎఫెక్ట్
X
నిర్మాత‌లతో కార్మిక ఫెడ‌రేష‌న్ విభేధాల గురించి తెలిసిందే. వేత‌న స‌వ‌రణ కోరుతూ 24 శాఖల కార్మికులు చాలా కాలంగా పోరాటం సాగిస్తూనే ఉన్నా నిర్మాత‌లు భ‌త్యాల పెంపు విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తూనే ఉన్నారు. తమ క‌ష్టాల్ని వేద‌న‌ను కార్మికులు పట్టించుకోవాల‌నేది నిర్మాత‌ల వెర్ష‌న్. క‌రోనా క్రైసిస్ కంటే ముందు 2018లో తెలుగు సినీకార్మికుల బంద్ భ‌త్యం గురించే సాగింది. అప్ప‌ట్లో కొన్ని డిమాండ్ల‌కు ఓకే చెప్పి బంద్ ని ఆప‌గ‌లిగారు. కానీ ఈసారి అలా త‌గ్గేది లేదు! అంటూ కార్మికులు మెరుపు స‌మ్మెకు దిగడంతో స‌న్నివేశం వేడెక్కింది.

నిజానికి ఇటు కార్మికుల స‌న్నివేశం కానీ నిర్మాత‌ల స‌న్నివేశం కానీ ఏమంత బాలేద‌ని అంద‌రికీ తెలుసు. ఇరువైపులా స‌మ‌స్య‌లున్నాయి. క‌ష్టాలు క‌న్నీళ్లు ఉన్నాయి. క‌రోనా క్రైసిస్ అనంత‌రం పెరిగిన ధ‌ర‌ల‌తో క‌నీస బ‌తుకును వెల్ల‌దీయ‌లేని స‌న్నివేశం కార్మికుల‌కు ఉంది. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశాన్నంటుతుండ‌డంతో చాలీ చాల‌ని భ‌త్యాలతో బ‌తుకు భారంగా న‌డుస్తోంది. కుటుంబ జీవ‌నం స‌మ‌స్యాత్మ‌కంగానే ఉంది.

అందుకే ఇప్పుడు బంద్ కి ఉప‌క్ర‌మిస్తున్నార‌న్న స‌మాచారం స్ప‌ష్టంగా ఉంది. అయితే నిర్మాత‌ల ప‌రిస్థితి గొప్ప‌గా ఉందా? అంటే అదీ చెప్ప‌లేం. క‌రోనా క్రైసిస్ వ‌ల్ల సినీప‌రిశ్ర‌మ‌కు నిర్మాత‌ల‌కు కోలుకోలేని దెబ్బ ప‌డింది. సినిమాలు స‌కాలంలో రిలీజ్ కాలేదు. షూటింగులు కూడా స‌కాలంలో పూర్త‌వ్వ‌క‌పోవ‌డంతో అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లించ‌లేని ధైన్యం క‌నిపిస్తోంది. తామొక‌టి ఆశిస్తే క‌రోనా ఇంకొక‌లా క‌క్ష తీర్చుకుంది. దీంతో నిర్మాత‌లు కూడా మింగ‌లేక క‌క్క‌లేక అన్న చందంగానే మిగిలారు. ఇలాంట‌ప్పుడు కార్మికులు స్ట్రైక్ అంటూ కుంగ‌దీస్తే ప‌రిశ్ర‌మ ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించ‌గ‌లం.

ఇక కార్మికులు కానీ మెరుపు స‌మ్మె చేస్తే గ‌నుక ఆల్ట‌ర్నేట్ ఏం ఉంది? అంటే చెన్నై సహా ఇరుగు పొరుగుపై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. కానీ ఈ బంద్ వ‌ల్ల అంద‌రికీ న‌ష్ట‌మే. ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డం వ‌ల్ల ముప్పు త‌ప్ప‌దు. కార్మికుల‌కు తిండి ఉండ‌దు.. నిర్మాత‌ల‌కు ప‌ని ఉండ‌దు. సినిమాలు తీసే వాళ్ల‌కు అద‌న‌పు వ్య‌యం త‌ప్ప‌దు.

ఇక తెలుగు సినిమాల సంగ‌తేమో కానీ.. హైద‌రాబాద్ ని న‌మ్ముకుని తన భారీ సినిమా షూటింగు చేస్తున్న సల్మాన్ ఖాన్ కి బిగ్ పంచ్ ప‌డ‌నుంద‌ని చెబుతున్నారు. మూవీ షూటింగ్ ని అర్థాంత‌రంగా ఆపేయాల్సి ఉంటుంద‌నేది ఫిలింన‌గ‌ర్ టాక్. స‌ల్మాన్ భాయ్ సెట్స్ లో రోజుకు 2000 నుంచి 3000 మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు డ్యాన్స‌ర్లు హైద‌రాబాద్ లో షూటింగులో పాల్గొంటున్నారు. వీళ్లంద‌రికీ కూడా పంచ్ ప‌డిపోతుంది. ప్ర‌స్తుతం నిర్మాత‌ల గిల్డ్ స‌మావేశం జ‌రుగుతోంది. నిర్మాత‌ల ప్ర‌క‌ట‌న‌ను బ‌ట్టి బంద్ పై కార్మికుల నిర్ణ‌యం ఉంటుంది. స‌మ‌స్య పెర‌గ‌కుండా ఇరువ‌ర్గాలు క‌లిసి మాట్లాడుకుని ప‌రిష్క‌రించుకుంటాయ‌నే ఆశిద్దాం.