Begin typing your search above and press return to search.

మ‌హేష్ కోసం కొత్త‌గా ట్రై చేస్తే బాగుండ‌బ్బా?

By:  Tupaki Desk   |   25 July 2022 1:30 PM GMT
మ‌హేష్ కోసం కొత్త‌గా ట్రై చేస్తే బాగుండ‌బ్బా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఆఫ్రిక‌న్ అడ‌వుల నేప‌థ్యంలో హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక సినిమాపై నెల‌కొంటున్న అంచ‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌హేష్ క‌టౌట్ కి త‌గ్గ కంటెంట్ ప‌డితే ఆ సినిమా నెక్స్ట్ లెవ‌ల్లో ఉంటుంది.

పాన్ ఇండియాని దాటి పాన్ వ‌ర‌ల్డ్ రీచ్ అయ్యే రేంజ్ మ‌హేష్ ది. అందుకే యూనిక్ గా..యూనివర్శ‌ల్ అప్పీల్ ఉన్న చీక‌టి ఖండం నేప‌థ్యాన్ని ఎంపిక చేసుకున్నారు. విజ‌యేంద్ర ప్రసాద్ ర‌చ‌న‌లో సిద్ద‌మ‌వుతోన్న క‌థ ప‌రంగా చూసుకోవాల్సిన ప‌నిలేదు. సాంకేతికంగానూ జ‌క్క‌న్న సినిమాని అదే స్థాయిలో హైలైట్ చేస్తారు. దానికి సంబంధించిన రాజ‌మౌళి వ‌ద్ద ప‌ర్మ‌నెంట్ టీమ్ అనేది ఒక‌టుంది.

దాదాపు ఆయ‌న తెర‌కెక్కించే సినిమాల‌కు అదే టెక్నిక‌ల్ టీమ్ ప‌ని చేస్తుంది. అవ‌స‌రం మేర మాత్ర‌మే విదేశీ సాంకేతిక నిపుణుల్ని దిగుమ‌తి చేసుకుంటారు. ఇక ఈ సినిమాకి యాధావిధిగా సంగీతాన్ని ఎం.ఎం కీర‌వాణీ అందిస్తారు. అందులో ఎలాంటి మార్పు ఉండ‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌క్క‌న్న తెర‌కెక్కించిన ప్ర‌తీ సినిమాకి ఆయ‌నే సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే.

మ్యూజిక‌ల్ గా ఆ చిత్రాలు మంచి స‌క్సెస్ అయ్యాయి. అయితే నేప‌థ్య సంగీత ప‌రంగా గ‌త రెండు పాన్ ఇండియా చిత్రాలు 'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' అంత ఇంపాక్ట్ గా అనిపించ‌లేద‌ని ఓ విమ‌ర్శ చాలా కాలంగానే వినిపిస్తుంది.

'కేజీఎఫ్' రేంజ్ లో ఓ బెంచ్ మార్క్ సౌండింగ్ లేద‌ని అభిప్రాయాలు తెర‌పైకి వ‌చ్చాయి. ఆర్ ఆర్ లో యూనిక్ నెస్ ఎక్క‌డా క‌నిపించ‌లేద‌ని.. కొత్త వాళ్ల‌తో నేప‌థ్య సంగీతాన్ని ప్ర‌య‌త్నిస్తే బాగుండేద‌ని ఆనాడే తెర‌పైకి వ‌చ్చింది.

అయితే వాటిని జ‌క్క‌న్న ఏమాత్రం ప‌ట్టించుకున్న‌ది లేదు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం యధావిధిగా ముందుకెళ్లిపోయారు. అయితే మ‌హేష్ ప్రాజెక్ట్ విష‌యంలో మాత్రం ఆర్ ఆర్ ప‌రంగానైనా కొన్ని ర‌కాల మార్పులు తీసుకొస్తే బాగుంటుంద‌ని అభిమానులు అభిప్రాయ‌పడున్నారు. రెహ‌మాన్.. ర‌వి బ‌స‌రూర్..అమిత్ త్రివేది..సంచిత్ బాల్ హ‌రా లాంటి వాళ్లు అయితే ది బెస్ట్ ఇవ్వ‌డానికి ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. మరి జ‌క్క‌న్న మ‌న‌సులో ఏముందో.