Begin typing your search above and press return to search.

రాజమౌళి ఒక హీరోతో ఒకరి చరిత్రనే తీస్తే బాగుండేదేమో!

By:  Tupaki Desk   |   6 April 2022 8:45 AM GMT
రాజమౌళి ఒక హీరోతో ఒకరి చరిత్రనే తీస్తే బాగుండేదేమో!
X
తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సీనియర్స్ లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఆయా సినిమాలపై .. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. తన మనసులోని మాటను ముక్కుసూటిగా చెప్పేయడం ఆయనకి అలవాటు. తాజా ఇంటర్వ్యూలో ఆయన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను గురించి ప్రస్తావించారు. ఈ సినిమా టిక్కెట్ల ధరలు పెంచడం .. కథను ఎంచుకున్న విధానం గురించి ఆయన కాస్త అసహనాన్ని .. అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను తొలి రోజునే ఇంతమంది చూశారు .. ఇంత వసూలు చేసిందని చెబుతున్నారు. కానీ ఇక్కడి జనాభా మొత్తం 3 కోట్లమంది ఉన్నప్పుడే 'లవ కుశ' సినిమాను కోటి 75 లక్షల మంది చూశారు. 'ఆర్ ఆర్ ఆర్' టిక్కెట్ల రేటు భారీగా పెంచేసి అమ్మారు. సినిమాలో దమ్ములేదని తెలిసి .. వాళ్లకే నమ్మకం లేక .. హైప్ ఇచ్చేసి వీలైనంత మొత్తం రాబట్టాలనే ఆలోచన కరెక్ట్ కాదు. రేటు తక్కువ ఉన్నా అవే డబ్బులు వచ్చేవి .. కాకపోతే కాస్త ఆలస్యమయ్యేది.

కథను దాటిపోయి ఖర్చు చేస్తూ .. టిక్కెట్లు రేటు పెంచమనడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నిజానికి రాజమౌళి గొప్ప దర్శకుడు. ఆయన కొమరం భీమ్ కథ తీసినా, అల్లూరి సీతారామరాజు సినిమా తీసినా ఇంతే సక్సెస్ అయ్యేది. అలా కాకుండా ఇద్దరి పాత్రలను కలిపేసి ఒక సినిమా తీయడం కరెక్ట్ కాదు.

చరిత్ర తెలియని వాళ్లు అల్లూరి .. కొమరం కలిసి ఆడుకున్నారేమోనని అనుకునే అవకాశం ఉంది. ఈ ఇద్దరి చరిత్రలు కొంతలో కొంత అందరికీ తెలుసు. అలాంటి ఒక చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నించకూడదు. ఒకరి చరిత్రనే తీసుకుని ఒక హీరోతోనే చేసి ఉంటే ఇంతకన్నా ఎక్కువ డబ్బులు వచ్చేవి.

రాజమౌళి గారు ఒక సినిమా మొదలుపెట్టారంటే ఒక్క నిమిషం కూడా వేస్టు చేయరు. ఆ సినిమా రిలీజ్ అయ్యేవరకూ 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు. రాజమౌళి ఒక చోట మాట్లాడుతూ .. ఒక్క ఫ్రేమ్ కూడా వేస్టు కాకుండా తీస్తానని చెప్పారు.

ఆలా చేసినప్పుడు ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది? ఇంత కాలం ఎందుకు పడుతుంది? పాన్ ఇండియా అయిపోయిందని చెప్పేసి హీరోలు పారితోషికం పెంచేసుకుంటూ పోయారు. ఆ తరువాత సినిమా నుంచి కూడా వాళ్లు అదే పారితోషికం కంటిన్యూ చేస్తారు. ఆ ప్రభావం టిక్కెట్ల రేటుపై పడుతోంది. హీరోలు తమ అభిమానులను గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది" అని చెప్పుకొచ్చారు.