Begin typing your search above and press return to search.

'ఆచార్య' స్టోరీపై మరో కాపీ మరక...!

By:  Tupaki Desk   |   26 Aug 2020 4:00 PM GMT
ఆచార్య స్టోరీపై మరో కాపీ మరక...!
X
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ''ఆచార్య''. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిరంజన్ రెడ్డి - కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల 'ఆచార్య' మూవీ ఫస్ట్‌ లుక్, మరియు మోషన్ పోస్టర్‌ చిత్ర యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఈ సినిమాపై రోజుకొక వివాదం చెలరేగుతోంది. ఇప్పటికే 'ఆచార్య' మోషన్ పోస్టర్‌ నేపథ్యం తన కథ నుంచి కాపీ చేసారంటూ కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత ఆరోపించారు. 'పుణ్యభూమి' అనే టైటిల్‌ తో 2006లో తాను ఓ కథను రచయితల సంఘంలో రిజిస్ట్రేషన్ చేయించానని.. ఆచార్య మోషన్ పోస్టర్‌ లో 'ధర్మస్థలి' అనే ఎపిసోడ్‌ తన స్క్రిప్ట్‌ నుంచి తీసుకునన్నారని అనిల్ కృష్ణ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా 'ఆచార్య' సినిమా కథ నాదే అంటూ రాజేష్ మండూరి అనే రచయిత సుదీర్ఘమైన ప్రెస్ నోట్‌ ను విడుదల చేశాడు. బీ. గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాజేష్ మండూరి.. తాను రాసుకున్న కథని అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే గొట్టిపాటి రవి సహకారంతో రెండేళ్ల క్రితం మైత్రీ మూవీ మేకర్స్ వారికి వినిపించానని చెప్పుకొచ్చాడు. ముందుగా ఈ స్టోరీ లైన్ రవి కుమార్ కి చెప్పానని.. కంప్లీట్ స్టోరీని మైత్రీ మూవీ మేకర్స్ కో ప్రొడ్యూసర్ చెర్రీకి వినిపించానని పేర్కొన్నాడు. ఈ స్టోరీ పెద్ద ఫిలిం మేకర్స్ చేయాల్సిందని.. ఈ కథను ఇవ్వమని చెర్రీ అడిగితే తాను నిరాకరించినట్లుగా రాజేష్ వెల్లడించారు. ఇది నేనే డైరెక్ట్ చేస్తానని చెప్పి వచ్చేసానని.. ఆ తర్వాత వారి నుంచి కాల్ రాలేదని చెప్పాడు.

అయితే కొరటాల శివ చిరంజీవితో అదే స్టోరీ లైన్ తో సినిమా చేస్తున్నాడని తెలిసి షాక్ అయ్యానని అన్నాడు. మైత్రీ మూవీస్ చెర్రీ ద్వారా ఈ కథ కొరటాల శివకి చేరి ఉంటుందని ఆరోపించాడు. అంతేకాకుండా ఈ స్టోరీని ఓ తమిళ్ ప్రొడ్యూసర్ కి చెప్పానని.. నందమూరి బాలకృష్ణతో చేసే విధంగా వారిని కన్విన్స్ కూడా చేసానని చెప్పుకొచ్చాడు. దీనిపై ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని సంప్రదిస్తే లీగల్ గా వెళ్ళమని సూచించారని చెప్పాడు. అంతేకాకుండా దీనిపై పరుచూరి గోపాలకృష్ణని కూడా కలిశానని.. తెలుగు రచయితల సంఘానికి కంప్లైంట్ చేసానని.. కానీ వారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ లీగల్ గా వెళ్లాలని లెటర్ ఇచ్చారని పేర్కొన్నాడు.

చిరంజీవిని కలిస్తే న్యాయం జరుగుతుందని ఆశపడ్డానని.. కానీ ఆయనను కలవడానికి వీలు పడటం లేదని.. రామ్‌ చరణ్‌ గారు చిరంజీవి గారు నాకు సాయం చేయాలని కోరుకుంటున్నాని రాజేష్‌ మండూరి అన్నారు. ఇప్పుడు రాజేష్ ఆరోపిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ 'ఆచార్య' ని నిర్మించడం లేదు. అలాంటిది దీనిపై 'ఆచార్య' టీమ్ స్పదిస్తుందా లేదా అనేది చూడాలి. గతంలో కొరటాల శివ తెరకెక్కించిన 'శ్రీమంతుడు' మూవీకి కూడా కాపీ మరకలు అంటాయి. మరి ఇప్పుడు 'ఆచార్య' వివాదంపై కొరటాల శివ స్పందిస్తారేమో చూడాలి.