Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘యమన్’

By:  Tupaki Desk   |   25 Feb 2017 9:15 AM GMT
మూవీ రివ్యూ : ‘యమన్’
X
చిత్రం : ‘యమన్’

నటీనటులు: విజయ్ ఆంటోనీ - మియా జార్జ్ - త్యాగరాజన్ - అరుల్ జ్యోతి - సంగిలి మురుగన్ - చార్లీ తదితరులు
సంగీతం: విజయ్ ఆంటోనీ
ఛాయాగ్రహణం: జీవా శంకర్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జీవా శంకర్

‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగులో అనూహ్యమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ విజయ్ ఆంటోనీ. ‘బిచ్చగాడు’ తర్వాత వచ్చిన ‘బేతాళుడు’ నిరాశ పరిచినప్పటికి అతడి కొత్త సినిమా ‘యమన్’పై తెలుగు ప్రేక్షకుల్లోనూ బాగానే ఆసక్తి నెలకొంది. జీవా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అశోక చక్రవర్తి (విజయ్ ఆంటోనీ) చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి.. అనేక కష్టాలు పడి ఎదిగిన కుర్రాడు. అతడి తాతే అతణ్ని పెంచి పెద్ద చేస్తాడు. అలాంటి తాత అనారోగ్యం పాలవడంతో సర్జరీ చేయడానికి డబ్బుల కోసం తన ప్రమేయం లేని ఒక యాక్సిడెంట్ కేసును నెత్తిన వేసుకుని జైలుకు వెళ్తాడు అశోక్. ఈ కేసు వల్ల అతడి జీవితం మలుపు తిరుగుతుంది. జైలు నుంచి బయటికొచ్చాక డబ్బు.. ఉపాధి రెండూ దొరికినప్పటికీ ఇద్దరు రాజకీయ నాయకుల పోరు కారణంగా అశోక్ ఇబ్బంది పడతాడు. అన్ని సమస్యల నుంచి బయటపడటానికి రాజకీయాల్లోకి రావడమే సరైన మార్గం అని నిర్ణయించుకుంటాడు అశోక్. అప్పుడు అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి.. అశోక్ అనుకున్నది ఎలా సాధించాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘యమన్’ ఒక పొలిటికల్ థ్రిల్లర్. సామాన్యుడైన ఒక వ్యక్తి అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎలా ఎదిగాడు.. ఎలా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు.. ఈ క్రమంలో తన తండ్రిని చంపిన వాళ్లపై ఎలా పగతీర్చుకున్నాడన్న నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. రాజకీయ నాయకుల నేపథ్యాల్ని.. వారి మనస్తత్వాల్ని.. వారు వ్యవహారాలు నడిపే తీరును చక్కగా.. వాస్తవికంగా ‘యమన్’లో ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఐతే ఈ ‘పొలిటికల్ థ్రిల్లర్’లో పాలిటిక్స్ నేపథ్యంలో సాగే కథ ఆకట్టుకుంటుంది కానీ ఇది ఆసక్తికర ‘థ్రిల్లర్’ అయితే కాలేకపోయింది. కథనంలో ఆశించిన వేగం లేకపోవడం.. డ్రామా తప్ప పెద్దగా థ్రిల్ లేకపోవడంతో ‘యమన్’ ఓ స్థాయికి మించి ఎంటర్టైన్ చేయలేకపోయింది.

రాజకీయాల నేపథ్యంలో సినిమాలంటే చాలా వరకు జనరలైజ్ చేసేసి.. ఎగ్జాజరేట్ చేసి పైపైన సినిమాలు లాగించేస్తుంటారు తప్ప వాస్తవిక కోణంలో తీసే సినిమాలు తక్కువ. సామాన్యుడైన హీరోను పొలిటికల్ లీడర్ని చేయాలంటే చాలామంది దర్శకులు ఎలాంటి మార్గం ఎంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతనేమనుకుంటే అది జరిగిపోతుంది. అన్నీ అతడికి కలిసొచ్చేస్తాయి. చూస్తుండగానే ఎమ్మెల్యే.. మంత్రి.. ముఖ్యమంత్రి అయిపోతాడు. అలా కాకుండా ఒక సామాన్యుడు అనేక అడ్డంకుల్ని దాటుకుని.. వ్యూహాత్మకంగా అడుగులేస్తూ.. అంచెలంచెలుగా ఎదిగి ఎలా మంత్రి స్థాయికి చేరాడో రియలిస్టిగ్గా ‘యమన్’లో చూపించారు. ఇక్కడ కూడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోలేదని కాదు కానీ.. సాధ్యమైనంత వరకు వాస్తవికంగా ఉండేలా పాత్రల్ని.. కథను తీర్చిదిద్దాడు దర్శకుడు జీవా శంకర్.

‘యమన్’కు ప్రధాన ఆకర్షణ కథ.. పాత్రలే. ఇందులో ప్రతి పాత్రకూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. కథ ఎక్కడా పక్కదోవ పట్టకుండా ఒక పంథాలో సాగిపోతుంది. హీరోతో పాటుగా ఇందులోని పాత్రలన్నింటినీ బలంగా.. ఆసక్తికరంగా తీర్చిదిద్దుకున్నాడు జీవా శంకర్. హీరో పాత్ర పరిచయం దగ్గర్నుంచే ఆసక్తి రేకెత్తిస్తుంది. జైలు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. సినిమాపై ఆసక్తి పెంచుతాయి. ‘బిచ్చగాడు’తో బలమైన ముద్ర వేసిన విజయ్ ఆంటోనీ.. ఇందులో దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తూ.. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాడు. హీరో పాత్ర చిత్రణకు తోడు.. సాంకేతిక హంగులు కూడా చక్కగా కుదరడంతో ‘యమన్’ మంచి ఇంటెన్సిటీ ఉన్న సినిమాలా కనిపిస్తుంది.

ఐతే కథనంలో వేగం లేకపోవడమే ‘యమన్’కు పెద్ద ప్రతికూలత. కథా గమనానికి అడ్డం పడే పాటలు.. నెమ్మదిగా సాగే కథనం సినిమాకు మైనస్ అయ్యాయి. సినిమా ఆరంభమైన తీరు చూస్తే దీనికి ముందు తెలుగులోకి అనువాదమైన పొలిటికల్ థ్రిల్లర్ ‘ధర్మయోగి’ తరహాలో మలుపులు.. ఉత్కంఠ ఆశిస్తాం. కానీ ఇందులో అవి మిస్సయ్యాయి. కొన్ని సన్నివేశాలు చూస్తూ ఏదో జరిగిపోతుందని అనుకుంటాం కానీ.. అలా ఏమీ జరగదు. ద్వితీయార్ధంలో గాడి తప్పిన కథనం.. కొన్ని అనవసర సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. హీరోయిన్ ట్రాక్ కథకు ఏమంత అవసరం అనిపించదు. ఐతే ప్రి క్లైమాక్స్ నుంచి కథ మళ్లీ ట్రాక్ ఎక్కి ఆసక్తి రేకెత్తిస్తుంది. ముగింపు కూడా ఓకే అనిపిస్తుంది. ఓవరాల్ గా ‘యమన్’ సీరియస్.. రియలిస్టిక్ పొలిటికల్ డ్రామాలు ఇష్టపడే వాళ్లను మెప్పిస్తుంది. రెగ్యులర్ సినిమాల మధ్య కొంచెం భిన్నంగానూ అనిపిస్తుంది. ఐతే రెండున్నర గంటలకు పైగా నిడివితో నెమ్మదిగా సాగే ఈ పొలిటికల్ డ్రామాను ఆస్వాదించడానికి కొంచెం ఓపిక కూడా ఉండాలి.

నటీనటులు:

నేను మంచి నటుడిని కాదంటూనే విజయ్ ఆంటోనీ మరోసారి ఆకట్టుకున్నాడు. అశోక్ పాత్ర తాలూకు ఇంటెన్సిటీని అతను చూపించిన తీరు మెప్పిస్తుంది. సీరియస్ పాత్రలు చేయడంలో విజయ్ ప్రత్యేకత మరోసారి కనిపిస్తుంది. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఇక సినిమాలో హీరో తర్వాత అత్యంత కీలకమైన రెండు పాత్రల్లో నటించిన ఇద్దరూ మెప్పించారు. ఒకప్పటి విలన్ త్యాగరాజన్ పాత్ర.. ఆయన నటన సినిమాకు బలంగా నిలిచాయి. ఐతే ఆయనకు డబ్బింగ్ సరిగా కుదర్లేదు. ఇంకా బెటర్ వాయిస్ ఎంచుకోవాల్సింది. మినిస్టర్ పాత్రలో కనిపించిన నటుడు కూడా చక్కగా చేశాడు. అతను కళ్లతోనే హావభావాలు పలికించాడు. హీరోయిన్ మియా జార్జ్ పాత్ర పరిమితం. ఆమె పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

విజయ్ ఆంటోనీ నటుడిగానే కాదు.. సంగీత దర్శకుడిగానూ ‘యమన్’కు పెద్ద బలంగా నిలిచారు. కొన్ని మామూలు సన్నివేశాల్ని కూడా నేపథ్య సంగీతంతో అతను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాల్లో.. కీలకమైన సీన్స్ వచ్చినపుడు.. ముఖ్యంగా జైల్లో హీరో తిరగబడే సీన్లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు మాత్రం సినిమాకు ఏ రకంగానూ పనికి రాలేదు. దర్శకుడు జీవా శంకరే ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడు కూడా. తన కథకు ఎలాంటి విజువల్స్ అవసరమో బాగా తెలుసు కాబట్టి అందుకు తగ్గట్లే కెమెరా పనితనం చూపించాడతను. కథకు తగ్గ మూడ్ క్రియేట్ చేయడంలో కెమెరా కూడా కీలక పాత్ర పోషించింది. రచయితగా.. దర్శకుడిగా కూడా జీవా శంకర్ తన ప్రతిభను చాటుకున్నాడు. ఐతే కథలో ఇంకొన్ని మలుపులు ఉండి.. కథనంలో వేగం ఉండి.. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్ గా చేసి ఉంటే.. ‘యమన్’ రేంజే వేరుగా ఉండేది. కానీ ఈ లోపాల వల్ల జస్ట్ ఓకే అనిపిస్తుంది.

చివరగా: యమన్.. కంటెంట్ ఉంది కానీ..!

రేటింగ్- 2.75/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre