Begin typing your search above and press return to search.

'యశోద' ఫస్ట్ గ్లింప్స్: ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో వస్తోన్న సమంత..!

By:  Tupaki Desk   |   5 May 2022 7:22 AM GMT
యశోద ఫస్ట్ గ్లింప్స్: ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో వస్తోన్న సమంత..!
X
దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన సమంత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''యశోద". ఇది ఆమెకు ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ ఆవిష్కరించారు.

ఈ వీడియోలో సమంత ఓ ఆసుపత్రిలో బెడ్ పై నుంచి సడన్ గా పైకి లేచి.. తనని తాను ఆశ్చర్యంగా చూసుకుంటోంది. ఆమె చేతికి ఏదో బ్యాండ్ ఉండటాన్ని గమనిస్తుంది. తను ఎక్కడ ఉందనే విషయం ఆమెకు తెలియడం లేదు. ఆ ప్రదేశమంతా ఆమెకు కొత్తగా కనిపిస్తోంది.

అక్కడి నుంచి నేరుగా నడుచుకుంటూ కిటికీ దగ్గరకు వెళ్లి బయట ఉన్న ఒక పావురాన్ని అందుకునే ప్రయత్నం చేసింది సామ్. కానీ వెంటనే ఆమెను ఓ ఊహాత్మక ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్లు ఈ గ్లిమ్స్ లో చూపించారు.

ఎలాంటి డైలాగ్స్ లేకుండా.. ఆకర్షణీయమైన విజువల్స్‌ మరియు థ్రిల్ కు గురి చేసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో కూడిన 'యశోద' ఫస్ట్ గ్లిమ్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇది సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ అని సూచిస్తోంది.

''యశోద'' చిత్రాన్ని దర్శకద్వయం హరి - హరీష్‌ తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. అశోక్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.

ఇందులో సమంతతో పాటుగా వరలక్ష్మి శరత్ కుమార్ - రావు రమేష్ - ఉన్ని ముకుందన్ - కల్పిక గణేష్ - సంపత్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'యశోద' సినిమాని 2022 ఆగస్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'జాను' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని 'పుష్ప' లో ఐటమ్ సాంగ్ తో ప్రేక్షకులను పలకరించింది సమంత. ఇటీవల విడుదలైన 'కణ్మణి రాంబో ఖతీజా' అనే డబ్బింగ్ మూవీ నిరాశపరిచింది. మరి 'యశోద' మూవీతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతుందేమో చూడాలి.