Begin typing your search above and press return to search.

యాత్ర VS మహానాయకుడు - ఎవరు విజేత

By:  Tupaki Desk   |   27 Feb 2019 11:52 AM GMT
యాత్ర VS మహానాయకుడు - ఎవరు విజేత
X
ఒకే నెలలో ఇద్దరు రాజకీయ దిగ్గజాలను ఆధారంగా చేసుకున్న సినిమాలు వస్తున్నప్పుడు ప్రేక్షకుల్లో ఒకరకమైన ఉత్సుకత కలగడం సహజం. అందులోనూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన దివంగత నాయకులు కావడంతో పొలిటికల్ సర్కిల్స్ లో కూడా వీటి మీద పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు కళ్ళ ముందు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కథానాయకుడు ప్రభావం ఎంత ఉంది అన్నది పక్కన పెడితే మహానాయకుడిని ప్రేక్షకులు తిరస్కరించారన్నది వసూళ్ళ రూపంలో చూస్తూనే ఉన్నాం.

దానికి తోడు టిడిపి వర్గాలు ఉచిత టికెట్లు పంచి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు డ్యామేజ్ ని ఇంకా పెంచుతున్నాయే తప్ప టాక్ ని పాజిటివ్ గా మార్చలేకపోతున్నాయి. బాలయ్య కెరీర్ లోనే ఇది పెద్ద డిజాస్టర్ గా మిగిలిందని ట్రేడ్ సైతం ఒప్పేసుకుంటున్న మాట.

ఇక యాత్ర విషయానికి వస్తే ఇదీ అద్బుతాలు చేసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టలేదు. కాని మొదటి రోజుతో మొదలైన పాజిటివ్ టాక్ ఎక్కడా డ్రాప్ కాలేదు. మమ్ముట్టికి ఇక్కడ మార్కెట్ లేని దృష్ట్యా కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చరిష్మా మీదే జనం రావడం మొదలుపెట్టారు. సినిమా చూసిన వారెవరినీ నిరాశ పరచక పోవడంతో నిర్మాతలతో పాటు బయ్యర్లకూ ఇది సేఫ్ వెంచర్ గా మిగిలింది

మహానాయకుడు బాగుందా లేదా అనే టాపిక్ ని పక్కన పెడితే యాభై కోట్లకు పైగా కథానాయకుడు ఇచ్చిన నష్టాలను కొంతైనా భర్తీ చేయాలనే ఒత్తిడితో బరిలో దిగింది. అయితే కనీస అంచనాలు అందుకునే విషయం కూడా లేకపోవడంతో మార్నింగ్ షోల నుంచే జనం పలుచన కావడం మొదలైంది. పైగా మొదటిభాగానికి వచ్చిన పాజిటివ్ రివ్యూస్ లో సగం కూడా సీక్వెల్ తెచ్చుకోలేకపోయింది.

కాని యాత్ర విషయంలో జరిగింది వేరు. జనం ఎమోషనల్ గా యాత్రలో కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యారు. ఫలితంగా నిరాశ చెందే అవకాశాలు తక్కువగా కనిపించాయి. సో నెగటివ్ అనే ప్రస్తావనే రాకుండా మంచి సినిమా అనే పేరైతే తెచ్చుకుంది. ఇక్కడ ఎవరి మీద ఎవరు గెలిచారు అనే ప్రశ్నకు సమాధానం మనకు మనం చెప్పుకోవడం కన్నా వచ్చిన వసూళ్లు మొదటి రోజు జనం వెలిబుచ్చిన అభిప్రాయాలు చూస్తే తీర్పు స్పష్టంగా విన్పిస్తుంది కనిపిస్తుంది.