Begin typing your search above and press return to search.

యంగ్ డైరెక్టర్ ఈసారి హిట్టు కొట్టకపోతే కష్టమే..!

By:  Tupaki Desk   |   18 Nov 2022 3:28 AM GMT
యంగ్ డైరెక్టర్ ఈసారి హిట్టు కొట్టకపోతే కష్టమే..!
X
సురేశ్ ప్రొడక్షన్స్ లో 'పిట్టగోడ' అనే సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన అనుదీప్ కేవీ.. మరో ఆఫర్ అందుకోడానికి చాలా కాలం పట్టింది. దాదాపు ఐదేళ్ల గ్యాప్ వచ్చినా, వైజయంతీ మూవీస్ వంటి పెద్ద బ్యానర్ లో సినిమా చేసే అవకాశం కొట్టేశాడు.

నాగ్ అశ్విన్ నిర్మాతగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జాతిరత్నాలు' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది 2021లో అతి పెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలవడంతో.. దర్శకుడి పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. బయట అతని వ్యవహార శైలితోనూ పాపులర్ అయ్యాడు.

'జాతిరత్నాలు' చిత్రంతో భారీ హిట్టు కొట్టడంతో.. టాలీవుడ్ లో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి అనుదీప్ కు అనేక ఆఫర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో 'ప్రిన్స్' వంటి తెలుగు తమిళ బైలింగ్విల్ మూవీ ప్లాన్ చేసుకున్నాడు.

సునీల్ నారంగ్ - సురేష్ బాబు వంటి అగ్ర నిర్మాతలు సంయుక్తంగా నిర్మించిన 'ప్రిన్స్' సినిమా.. దీపావళి స్పెషల్ గా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తమిళ్ లో అంతో ఇంతో కలెక్షన్స్ సాధించినా.. తెలుగులో మాత్రం తీవ్ర నిరాశ పరిచింది.

అంతకముందు అనుదీప్ కథ-స్క్రీన్ ప్లే అందించిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సినిమా ఫ్లాప్ అవ్వడం.. డైరెక్టర్ గా చేసిన 'ప్రిన్స్' చిత్రం పరాజయం పాలవ్వడంతో.. అతని రైటింగ్ మీదనే కాదు, దర్శకత్వ సామర్ధ్యాల మీద కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో అంతకముందు అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలందరూ ఇప్పుడు అనుదీప్ కేవీతో కలిసి సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటి వరకు అగ్ర నిర్మాణ సంస్థల్లోనే సినిమాలు చేసిన అనుదీప్.. ఇప్పటికే మరో మూడు పెద్ద బ్యానర్స్ కు కమిట్ అయ్యాడు. వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ లో 'జాతి రత్నాలు 2' మూవీ వుంటుందని అప్పట్లోనే మేకర్స్ ప్రకటించారు.

అలానే మైత్రీ మూవీ మేకర్స్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ కోసం సినిమాలు చేయాల్సి ఉందని ఓ ఇంటర్వూలో దర్శకుడు స్వయంగా వెల్లడించారు. అయితే ఇప్పుడు అనుదీప్ తదుపరి సినిమాపై క్లారిటీ రావడం లేదు.

ఇప్పటి వరకూ ఫ్లాప్ - హిట్టు - ఫ్లాప్ అనే విధంగా అనుదీప్ కెరీర్ సాగింది. దర్శకుడు మళ్ళీ అందరి దృష్టిని ఆకర్షించాలంటే.. ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు తను వేరే జోనర్స్ లో కూడా సినిమాలు చేయగలనని నిరూపించుకోవాలి. ఈ నేపథ్యంలో యంగ్ డైరెక్టర్ కు ఏ హీరో డేట్స్ ఇస్తాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.