Begin typing your search above and press return to search.

పెట్రోల్ ధ‌ర‌ల పెంపుద‌ల‌పై సినీ హీరో ఆగ్ర‌హం.. వైర‌ల్ అవుతున్న ట్వీట్‌

By:  Tupaki Desk   |   13 July 2021 9:30 AM GMT
పెట్రోల్ ధ‌ర‌ల పెంపుద‌ల‌పై సినీ హీరో ఆగ్ర‌హం.. వైర‌ల్ అవుతున్న ట్వీట్‌
X
ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న అతిపెద్ద స‌మ‌స్య‌లో పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డం ఒక‌టి. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో 70 రూపాయ‌ల్లో ఉన్న లీట‌రు పెట్రోల్‌ ధ‌ర‌లు.. 2014లో బీజేపీ స‌ర్కారు అధికారంలోకి రాగానే వేగంగా పెర‌గ‌డం మొద‌లు పెట్టాయి. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న ధ‌ర‌ల పెంపు నిర్ణ‌యాన్ని కంపెనీల‌కే అప్ప‌గిస్తూ.. బీజేపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో.. ఆయిల్ కంపెనీలు ఇష్టారీతిన ధ‌ర‌లు పెంచుకుంటూ పోతున్నాయి.

ప్ర‌స్తుతం.. తెలుగు రాష్ట్రాల్లో లీట‌రు పెట్రోల్ ధ‌ర‌ సెంచ‌రీ దాటేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో లీట‌రు పెట్రోలు ధ‌ర‌ 106 రూపాయ‌లుగా ఉంది. తెలంగాణ‌లో 104 రూపాయ‌లుగా ఉంది. దాదాపు దేశ‌వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. గ‌రిష్టంగా లీట‌ర్ పెట్రోలు ధ‌ర రాజ‌స్థాన్ లో 114 రూపాయ‌ల‌ను తాకింది. ఇంత‌కు జ‌రుగుతున్నా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో మండిప‌డుతున్నారు. తాజాగా.. తెలుగు సినీ న‌టుడు నిఖిల్ సిద్ధార్థ్ కూడా పెట్రోల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఈ మేర‌కు ట్విట‌ర్ లో ఒక పోస్టు పెట్టారు.

చెట్టెక్కిన పెట్రోల్ పంపుల ఫొటోను జ‌త చేశారు. ఇందులో వాహ‌న‌దారుడు కింద ఉండి అందుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. దీన్ని షేర్ చేసిన నిఖిల్‌.. ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. ‘‘అసలేం జరుగుతోందిఝ 35 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌.. ఇప్పుడు బంకుల‌లో ఉండే పంపుల వ‌ద్ద 100 రూపాయ‌లు దాటేసింది. ఇంధ‌న ధ‌ర‌ల‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధించే ట్యాక్స్ ల‌ను వెంట‌నే ర‌ద్దు చేయాలి. ఇలా నిత్యం ధ‌ర‌లు పెరిగిపోవ‌డం కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్న‌ ప్ర‌తి ఒక్క‌రి త‌ర‌పున నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను’’ అని నిఖిల్ రాశారు. ప్రస్తుతం హీరో నిఖిల్ ట్వీట్ వైరల్ గా మారింది. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

నిజానికి.. ఒక్క రూపాయి డీజిల్, పెట్రోల్‌ ధ‌ర పెరిగిందంటే.. అది ఆయిల్ మీద మాత్ర‌మే పెరిగిన‌ట్టు కాదు. కూర‌గాయ‌లు, బియ్యం, పాలు, వంట నూనె ఇలా.. అన్ని నిత్యావ‌స‌ర స‌రుకుల మీద కూడా పుడుతుంది. వీటిని ర‌వాణా చేసేది వాహ‌నాల్లోనే కాబ‌ట్టి.. పెట్రో ధ‌ర‌లు పెరిగాయ‌ని వారు అనివార్యంగా రేట్లు పెంచేస్తారు. వారు పెంచారు కాబ‌ట్టి.. నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను అమ్మేవారు సైతం పెంచేస్తారు. అంతిమంగా.. వాటిని కొనే జ‌నం జేబుల్లోంచే అంద‌రూ డ‌బ్బులు లాగేస్తారు.

దీనంత‌టికీ.. కేందం, రాష్ట్రాలు వేస్తున్న అద‌న‌పు ప‌న్నులే కార‌ణం అంటే న‌మ్ముతారా? ఈ ప‌న్నులు లేకుంటే.. ఇప్పుడు దేశంలో లీట‌రు పెట్రోలు కేవ‌లం 40 రూపాయ‌లకు దొరుకుతుంది. డీజిల్ 42 రూపాయ‌ల‌కు ల‌భిస్తుంది. మ‌రి, 100 రూపాయ‌లు ఎందుకు వ‌సూలు చేస్తున్నారు? అన్న‌ప్పుడు.. రాష్ట్రాలు, కేంద్ర ప్ర‌భుత్వం ప‌న్నులు వేసి, త‌మ ఖ‌జానా నింపుకుంటున్నాయి. జూన్ 11 నాటి ధ‌ర‌లు చూస్తే.. విదేశాల నుంచి వ‌చ్చిన‌ పెట్రోల్ మూల ధ‌ర కేవ‌లం 40.90 రూపాయ‌లు. డీజిల్ 42.80 రూపాయ‌లు. దీనికి కేంద్ర ప్ర‌భుత్వం వేసే ప‌న్నులు చూస్తే గుండెలు అదిరిపోతాయి. లీట‌రు పెట్రోల్ పై ఏకంగా 32.90 రూపాయ‌లు, డీజిల్ 31.80 రూపాయ‌లు ప‌న్ను వేసి అన్యాయంగా లాగేస్తోంది. ఇటు రాష్ట్రాలు తామేమీ త‌క్కువ తిన‌లేదంటున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో లీట‌ర్ పెట్రోలుపై 29.34, డీజిల్ పై 22.26 రూపాయ‌లు ప‌న్నువేసి వ‌సూలు చేస్తోంది. తెలంగాణ‌లో ఇంత‌క‌న్నా రెండు రూపాయ‌లు త‌క్కువ‌. పెట్రోల్ పై 27.31, డీజిల్ పై 20.82 రూపాయ‌లు ప‌న్నుగా వ‌సూలు చేస్తోంది.

ఇవ‌న్నీ క‌లుపుకొని ఏపీలో లీట‌రు పెట్రోలు ధ‌ర 106.96 రూపాయ‌లుగా ఉంది. డీజిల్ ధ‌ర 99.46 రూపాయ‌లుగా ఉంది. తెలంగాణ‌లో లీట‌రు పెట్రోలు రూ.104.93, డీజిల్ 98.02 రూపాయ‌లుగా ఉంది. అంటే.. మొత్తం పెట్రోలు ధ‌ర‌లో దాదాపు 60 శాతం డ‌బ్బులు ప‌న్నుల రూపంలోనే మింగేస్తున్నాయి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు. ఇంత‌గా జ‌నం జేబులు గుల్ల చేస్తూ.. త‌మ‌కేమీ తెలియ‌దు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ప్రభుత్వాలు ఇకనైనా స్పందించకపోతే.. ప్రజల నుంచి ఆగ్ర‌హ జ్వాలలు మ‌రింత‌గా వెల్లువెత్తే అవ‌కాశం క‌నిపిస్తోంది.