Begin typing your search above and press return to search.

యంగ్ హీరో ఇక‌ ఓటీటీతో స‌రిపెట్టుకోవాల్సిందేనా?

By:  Tupaki Desk   |   2 Nov 2022 1:30 AM GMT
యంగ్ హీరో ఇక‌ ఓటీటీతో స‌రిపెట్టుకోవాల్సిందేనా?
X
`ఉయ్యాలా జంపాలా` సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు రాజ్ త‌రుణ్. ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేయ‌డానికి ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించిన రాజ్ త‌రుణ్ అనుకోకుండానే హీరో అయిపోయాడు. మలి ప్ర‌య‌త్నంలోనే `సినిమా చూపిస్తా మావా`తో బ్లాక్ బ‌స్ట‌ర్ ని ద‌క్కించుకుని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్సించాడు. కానీ `కుమారి 21 ఎఫ్‌` త‌రువాత నుంచి మ‌నోడి సుడి అడ్డం తిర‌గ‌డం మొద‌లు పెట్టింది. కిట్టు వున్నాడు జాగ్ర‌త్త వ‌ర‌కు రాజ్ త‌రుణ్ కెరీర్ సాఫీగానే సాగినా ఆ త‌రువాత నుంచి ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వ‌డం మొద‌లైంది.

ల‌వ‌ర్‌, ఇద్ద‌రి లోకం ఒక‌టే, ప‌వ‌ర్ ప్లే, అన్న‌పూర్ణ స్టూడియోస్ పై నిర్మించిన `అనుభ‌వించు రాజా`, ఈ ఏడాది చేసిన స్టాండ‌ప్ కామెడీ నేప‌థ్యంలో రూపొందిన `స్టాండ‌ప్ రాహుల్‌` రాజ్ త‌రుణ్ కు బ్యాక్ టు బ్యాక్ ప‌రాజ‌యాల్ని అందించాయి. దీంతో మార్కెట్ బాగా త‌గ్గిపోయిన రాజ్ త‌రుణ్ ఇప్ప‌డు ఓటీటీ బాట ప‌డుతున్నాడు. త‌న న‌టించిన ఎలాంటి సినిమా అయినా థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతూ వుండేది. కానీ ప‌రిస్థితి మారింది.

రాజ్ త‌రుణ్ మార్కెట్ స్థాయి ప‌డిపోవ‌డంతో రాజ్ త‌రుణ్ డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ లోకి ఎంట‌ర‌వుతున్నాడు. వెబ్ సిరీస్ ల బాట ప‌డుతున్నాడు. త‌ను న‌టించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ `ఆహా నా పెళ్లంట‌`. రాజేంద్ర ప్రసాద్ కెరీర్ ని మ‌లుపు తిప్పిన సినిమా టైటిల్ తో రాజ్ త‌రుణ్ తొలి వెబ్ డ్రామాకు శ్రీ‌కారం చుడుతూ ఓటీటీలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు. శివానీ రాజ‌శేఖ‌ర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు సంజీవ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఆమ‌ని, హ‌ర్ష‌వర్థ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనితో అయినా రాజ్ త‌రుణ్ కెరీర్ కొత్త మ‌లుపులు తిరుగుతుందో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ వ‌ర‌కు వేచి చూడాల్పిందే. ఇప్ప‌టికే చాలా మంది యంగ్ హీరోలు ఓటీటీ బాట ప‌డుతున్నారు. సుశాంత్ ఇటీవ‌ల `మా నీళ్ల ట్యాంక్‌` అంటూ తొలి వెబ్ సిరీస్ లో న‌టించిన విష‌యం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.