Begin typing your search above and press return to search.

మెట్రోల్లో కుర్ర‌బ్యూటీ తెలివైన పెట్టుబ‌డులు

By:  Tupaki Desk   |   23 Nov 2019 11:04 AM GMT
మెట్రోల్లో కుర్ర‌బ్యూటీ తెలివైన పెట్టుబ‌డులు
X
సంపాదించడం ఒకెత్తు అనుకుంటే.. దాచుకోవ‌డం ఇంకో ఎత్తు. రెండిటిలో ఏది స‌రిగా లేక‌పోయినా అంతే సంగ‌తి. సినిమాల్లో సంపాదించిన ప్ర‌తి రూపాయిని శోభ‌న్ బాబు అయితే రియ‌ల్ ఎస్టేట్ లో పెట్టేవారు. విశ్వంలో భూమి ఒక వంతు అయితే.. స‌ముద్రాలు మూడొంతులు ఉన్నాయి. జ‌నం మూడొంతులు పెరుగుతున్నారు. అందుక‌ని భూమిపై పెట్టుబ‌డి పెట్టాల‌ని శోభ‌న్ బాబు చెబుతుండేవారు. ఆయ‌న స‌ల‌హాతోనే న‌టుడు ముర‌ళీ మోహ‌న్ భూముల‌పైనా.. రియ‌ల్ వెంచ‌ర్ల‌పైన వంద‌ల వేల కోట్లు పెట్టార‌ని చెబుతుంటారు.

ఇక పెద్ద‌ల అనుభ‌వాల్ని నేటిత‌రం నాయిక‌లు బాగానే వంట ప‌ట్టించుకున్నారు. సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ సైతం రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులు పెట్టార‌ని చెబుతుంటారు. స్వీటీ అనుష్క ప‌లు రియ‌ల్ వెంచ‌ర్లు.. అపార్ట్ మెంట్ల‌పై పెట్టుబ‌డులు పెట్టారు. చాలామంది యువ‌త‌రం నాయిక‌లు దీనిని ఫాలో చేశారు. ఇప్పుడు వీళ్లంద‌రి కంటే భిన్నంగా ఆలోచిస్తోంది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఇటీవ‌ల త‌న సంపాదన అంతా ఫిట్ నెస్ జిమ్ ల వ్యాపారంలో పెడుతున్న ఈ అమ్మ‌డు కొంత తెలివిగా మెట్రోల్లో ఇల్లు కొనేందుకు కేటాయిస్తోంద‌ట‌.

ఇప్ప‌టికే హైద‌రాబాద్- వైజాగ్ లాంటి చోట్ల ఎఫ్ 45 పేరుతో ఫిట్నెస్ జిమ్ములు ప్రారంభించిన ర‌కుల్ ఈ వ్యాపారంలో స‌క్సెసైంది. దీనిని అటు క్లీన్ సిటీ బెంగ‌ళూరుకు విస్త‌రించే ఆలోచ‌న‌లో ఉంద‌ట‌. బెంగ‌ళూరు న‌గ‌రంలో ఫిట్ నెస్ - ఆరోగ్యానికి సంబంధించిన ఏ వ్యాపారం అయినా స‌క్సెస‌వుతుంది. అందుకే అక్క‌డ జిమ్ములు ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తోంద‌ట‌. ప‌నిలోప‌నిగా ఈ భామ బెంగ‌ళూరులో ఓ అపార్ట్ మెంట్ కూడా కొనుక్కుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్- ముంబై లాంటి మెట్రోల్లో ర‌కుల్ కి సొంతంగా అపార్ట్ మెంట్లు ఉన్నాయి. బెంగ‌ళూరు.. చెన్న‌య్ లాంటి చోట్లా సొంతంగా వ్యాపార అభివృద్ధి కోసం ప్లాన్ చేస్తోంది. ఆ క్ర‌మంలోనే సొంతంగా అపార్ట్ మెంట్లు కొనుక్కుంటోంద‌ట‌. ఇక బెంగ‌ళూరు అపార్ట్ మెంట్ కోసం ఏకంగా రూ.6కోట్లు పెట్టుబ‌డిగా పెట్టింద‌ట‌. దీపం ఉండ‌గానే స‌ర్ధేయ‌డం ఎలానో ఈ అమ్మ‌డిని చూసి న‌వ‌త‌రం నాయిక‌లు నేర్చుకోవాల్సిందే మ‌రి.