Begin typing your search above and press return to search.

యుట్యూబ్ వ్యూస్ టికెట్స్ గా ఎందుకు మారవు?

By:  Tupaki Desk   |   11 Aug 2018 2:30 PM GMT
యుట్యూబ్ వ్యూస్ టికెట్స్ గా ఎందుకు మారవు?
X
టాపిక్ లోకి వెళ్లే ముందు ఓ సిటీ మెయిన్ సెంటర్ ని తీసుకుందాం. అక్కడో నాలుగు రోడ్ల కూడలి. నిత్యం రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. అటు వెళ్లే వాళ్లకు స్పష్టంగా కనిపించేలా సినిమాలకు సంబంధించిన పెద్ద పోస్టర్లు బ్యానర్లు అక్కడ కట్టారు. రోజుకో లక్ష దాకా వాటిని చూస్తున్నారు. నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకంటూ దాని మీద ఒక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. బయటికి చెప్పినా చెప్పకపోయినా అది నిజం. ఇప్పుడు పది రోజులకు గాను పది లక్షల మంది ఆ పోస్టర్లు చూసారు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళందరూ సినిమాకు వస్తారా. ఒకవేళ పోస్టర్లు చూసిన ప్రతి ఒక్కరు థియేటర్ కు వచ్చేస్తే ఇంకేముంది ఏ సినిమాకైనా కలెక్షన్స్ వర్షం ఖాయం. కానీ అలా జరగదు కదా. మా పోస్టర్ ఇన్ని లక్షల మంది చూసారు కాబట్టి ఆదరణ ఉంది అని చెప్పుకోవడం కామెడీగా ఉంటుంది కదూ. అచ్చంగా యూట్యూబ్ వ్యూస్ వ్యవహారం కూడా అచ్చం ఇలాగే మారిపోతోంది.

డిజిటల్ వ్యూస్ పేరు చెప్పి మా ఫస్ట్ లుక్ ని టీజర్ ని ట్రైలర్ ని ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల ప్రేక్షకులు చూస్తున్నారు అబ్బో మాది సూపర్ హిట్టు బంపర్ హిట్టు అని ఊదరగొడుతున్న బ్యాచ్ రోజుకొకటి తయారవుతోంది. అసలు ఎందుకు అన్ని వ్యూస్ వచ్చాయి అనేది అర్థం చేసుకోకపోతే పైన చెప్పిన ఉదాహరణలో కామెడీనే ఇక్కడ వర్తిస్తుంది. అసలు అన్ని వ్యూస్ వస్తున్నాయా లేదా అనేది పక్కన పెడితే ఆలా చూసినవాళ్లు ఓ పది శాతం సినిమా హాల్ కు వచ్చినా చాలు ఏ నిర్మాతా రూపాయి నష్టపోడు. కానీ వాస్తవం వేరుగా ఉందన్న సంగతి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఫేక్ పబ్లిసిటీ తో సినిమాలో అసలు కంటెంట్ కంటే ఇలాంటి హంగామా మీదే నిర్మాతలు దృష్టి పెడుతున్న పోకడ ఈ మధ్య ఎక్కువవుతోంది.

దీనికి తోడు ఫాన్స్ అత్యుత్సాహం వల్ల వ్యూస్ ని పట్టుకుని తమ హీరో చరిత్రలో ఎవరూ సాధించలేని ఘనత సాధించినట్టు చెప్పుకోవడం సోషల్ మీడియాలో వెర్బల్ వార్ కు దారి తీస్తోంది. ఏ సినిమాకు అయినా పబ్లిసిటీ అవసరమే. కానీ అది అతిశయోక్తిగా ఉండకూడదు. నెలకో రెండు వందలు ఖర్చు పెట్టుకుంటే రోజుకో జిబి డేటా ఫ్రీగా ఇస్తున్న జమానాలో జనం పొద్దుపోక వీడియోలు ట్రైలర్ లు చూడటం సహజం. వాటినే పట్టుకుని మా సినిమా అదుర్స్ బెదుర్స్ అటు చెప్పుకోవడం రాను రాను నవ్వులాటగా మారే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండాలి మరి.