Begin typing your search above and press return to search.

970 స్క్రీన్ల‌లో.. 500 స్క్రీన్లు తెలుగు రాష్ట్రాల్లో..

By:  Tupaki Desk   |   8 Feb 2019 4:13 AM GMT
970 స్క్రీన్ల‌లో.. 500 స్క్రీన్లు తెలుగు రాష్ట్రాల్లో..
X
దివంగ‌త ముఖ్య‌మంత్రి - డా.వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితంలో పాద‌యాత్ర ఘ‌ట్టాల్ని `యాత్ర` పేరుతో వెండితెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. మ‌మ్ముట్టి - సుహాసిని మ‌ణిర‌త్నం - జ‌గ‌పతిబాబు - అన‌సూయ‌ - నాగినీడు త‌దిత‌రులు తారాగ‌ణం. `ఆనందో బ్ర‌హ్మ` ఫేం మ‌హి.వి.రాఘ‌వ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విజ‌య్ చిల్లా - శ‌శిదేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాపై ఇప్ప‌టికే జ‌నాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నిన్న‌టి మిడ్ నైట్ నుంచి `యాత్ర` ప్రివ్యూల‌కు సంబంధించిన‌ కోలాహాలం నెల‌కొంది.

ఎంతో ఉత్కంఠ న‌డుమ‌.. నేడు ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 970 స్క్రీన్ల‌లో రిలీజైంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్ల‌లో రిలీజ్ చేయ‌గా - ఓవ‌ర్సీస్ లో 180 స్క్రీన్ల‌లో రిలీజైంది. వైయ‌స్సార్ పాద యాత్ర దాదాపు 68 రోజులు సాగితే - యాధృచ్ఛికంగా అన్ని రోజుల్లో (68 రోజులు) ఈ సినిమాని పూర్తి చేసి మ‌హి.వి.రాఘ‌వ్ రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఇది రాజ‌కీయాల‌కు సంబంధించిన సినిమా కాదు. కేవ‌లం రాజ‌కీయ నాయ‌కుడి క‌థ‌. ఒక మ‌నిషి ఉద్విగ్న‌మైన క‌థతో తెర‌కెక్కించామ‌ని మ‌హి.వి.రాఘ‌వ్ తెలిపారు. దీనిని ఫ్యాన్స్ కోణంలో కాకుండా మామూలుగా చూడాల‌ని అన్నారు.

ఒక పేదోడి జీవితంలో.. రైతు జీవితంలో క‌ష్టాలు క‌న్నీళ్లు తెలుసుకునే ప్ర‌య‌త్నంలో పాద‌యాత్ర చేసిన ఒక నాయ‌కుడి క‌థాంశ‌మిది. ``నీళ్ళుంటే క‌రెంటు వుండ‌దు.. క‌రెంటు వుంటే నీళ్ళుండ‌వు..రెండూ ఉండి పంట చేతికొస్తే స‌రైన ధ‌ర వుండ‌దు. అంద‌రూ రైతే రాజంటారు.. స‌రైన కూడు గూడు గుడ్డ నీడ లేని ఈ రాచ‌రికం మాకొద్ద‌య్య‌.. మ‌మ్మ‌ల్ని రాజులుగా కాదు క‌నీసం రైతులుగా బ్ర‌త‌క‌నివ్వండి చాలు..`` రైతు ఎదురు చూపుల వేళ‌..``నేను విన్నాను నేను వున్నాను`` అన్న పిలుపు పేద రైతు లో ఆశ‌లు నింపుతుంది. ``నాయ‌కుడిగా మ‌న‌కు ఏం కావాలో తెలుసుకున్నాము. కాని... జ‌నానికి ఏం కావాలో తెలుసుకొలేక‌పోయాము`` అంటూ అదిష్టానాన్ని సైతం లెక్క‌చేయ‌ని క‌రుడు గ‌ట్టిన నాయ‌కుడి క‌థ ఇది. రాజ‌శేఖ‌రుడి పాద యాత్ర ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడు. అందుకే నేడు థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంటుందా.. ? అన్న ఉత్కంఠ కేవ‌లం రాజ‌శేఖ‌ర్ రెడ్డి- వైయ‌స్ జ‌గ‌న్ అభిమానుల్లోనే కాదు.. ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కులు, సామాన్య ప్ర‌జ‌ల్లోనూ ఉంది. అందుకు త‌గ్గ‌ట్టే థియేట‌ర్ల వ‌ద్ద కోలాహాలం నెల‌కొంది. సినిమా రిజ‌ల్ట్ కి సంబంధించిన రిపోర్ట్.. రివ్యూలు మ‌రి కాసేప‌ట్లో...