Begin typing your search above and press return to search.

చౌద‌రి ఫైరింగ్‌:స‌ద్దికూడు..విసిరేసిన విస్త‌రాకు!

By:  Tupaki Desk   |   26 July 2017 7:40 AM GMT
చౌద‌రి ఫైరింగ్‌:స‌ద్దికూడు..విసిరేసిన విస్త‌రాకు!
X
ఏదైనా అనుకోనిది జ‌రిగిన వెంట‌నే మెద‌డు మొద్ద‌బారుతుంది. ఆ త‌ర్వాత కాసేప‌టికి నొప్పి మొద‌ల‌వుతుంది. రోజులు గ‌డిచే కొద్దీ గాయాన్ని త‌ట్టుకోవ‌టం మొద‌ల‌వుతుంది. ఆ గాయం చేసిన డ్యామేజ్ ను అధిగ‌మించే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంటుంది. ఇది జీవితం. డ్ర‌గ్స్ విచార‌ణ విష‌యంలోనూ ఇదే సూత్రం ఇప్పుడు అప్లై అవుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

డ్ర‌గ్స్ భూతం అన్ని రంగాలతో పాటు టాలీవుడ్ లోనూ ఉంద‌ని.. ఈ మాయ‌దారి రాక్ష‌సిని క‌లిసి క‌ట్టుగా ఎదుర్కొంటామ‌ని.. ఈ భూతాన్ని త‌రిమి కొడ‌తామ‌ని కొద్ది రోజుల ముందు టాలీవుడ్ పెద్ద‌లు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెప్పారు. వారు ప్రెస్ మీట్ పెట్టే వేళ‌కు.. డ్ర‌గ్స్ విచార‌ణ ఇంత ఊపు మీద లేదు. ఆ మాట‌కు వ‌స్తే.. టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖుల‌కు దీన్లో సంబంధాలు ఉన్నాయ‌న్న మాట‌ను అటు అధికారులు.. ఇటు మీడియాలోనూ వ‌చ్చింది లేదు.

త‌ర్వాత జ‌రిగింది అంద‌రికి తెలిసిందే. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్న వివ‌రాలు.. ద‌ర్యాప్తులో భాగంగా వెల్ల‌డ‌వుతున్న స‌త్యాల‌తో పాటు.. తెర మీద‌కు వ‌చ్చిన‌.. రావాల్సిన పెద్ద‌త‌ల‌కాయ‌ల ముచ్చ‌ట్లు మీడియా మొత్తాన్ని ఆక్ర‌మించాయి. సినీ తార‌ల మీద ఉన్న ఆస‌క్తే త‌ప్పించి మ‌రేమీ కాద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఇదిలా ఉంటే.. త‌మ‌ను ఇబ్బంది పెట్టే అంశాలు పెద్ద ఎత్తున వార్త‌ల రూపంలో రావ‌టాన్ని సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన కొంద‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. మొద‌ట్లో ఈ విష‌యం మీద మాట్లాడ‌టానికి సంకోచించిన వారు సైతం ఇప్పుడు ఒక్కొక్క‌రుగా గ‌ళం విప్పుతున్నారు.

డ్ర‌గ్స్ విచార‌ణ విష‌యంలో సినీ ప‌రిశ్ర‌మ‌ను వెన‌కేసుకొస్తూ మాట్లాడుతున్న గ‌ళాలు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి మ‌రో గ‌ళం ప్రెస్ నోట్ రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది. నిర్మాత క‌మ్ ద‌ర్శ‌కుడు అయిన వైవీఎస్ చౌద‌రి ఒక ప్రెస్ నోట్‌ ను విడుద‌ల చేశారు. క‌వితాత్మ‌కంగా రాస్తూ.. విచార‌ణ విధానంపై.. మీడియా మీద నిప్పులు చెరిగారు. చౌద‌రి మాట‌ల మ‌ధ్య‌లో ఒక వ్యాక్యం చూసిన‌ప్పుడు సినీ ప్ర‌ముఖుల బాధ ఏమిటో స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి. ఇంత‌కీ ఆ మాట ఏమిటంటే.. "మేము అందరికీ కావాల్సినవాళ్ళం. మా అవసరాలకి మాత్రం అందరికీ కానివాళ్ళం"

ఈ మాట‌కు అర్థం ఏమిట‌న్న‌ది మేం చెప్పే బ‌దులు.. ఎవ‌రికి ఏం అనిపిస్తే అది అనుకుంటే మంచిది. ఇక‌.. ప్ర‌క‌ట‌న‌లో ఆయ‌న మాట‌ల్ని చూస్తే..

మా 'సినిమావాళ్ళవి' అద్దాలమేడ జీవితాలు..

మేము అడుక్కున్నా అతిశయమే, అడుక్కోకున్నా అతిశయమే,

మేము కొంచెం చేసినా 'అతి'శయమే, కొంచెమే చేసినా 'అతి'శయమే,

అస్సలు మేమేంచేసినా, చేయకున్నా ప్రతివాడి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే/స్పందిస్తూనే ఉంటాం.

ప్రతీ శుక్రవారం మా జీవనరేఖలు, జీవనసూత్రాలు, మా జీవితగమ్యాలు మారుతూనే ఉంటాయి. అలా ప్రతీ సంవత్సరంలో 52 సార్లు మార్పులకు, చేర్పులకు, కూర్పులకు అలవాటుపడ్డవాళ్ళం. ధైర్యసాహసాలను, కుట్రలూకుతంత్రాలను రచించగల/ప్రదర్శించగల కధానాయకులం - ప్రతినాయకులం. దానధర్మాలు - త్యాగాలు చేయగల మానవతావాదులం. మంచీ-చెడులు - గెలుపూ-ఓటమిలు - పొగడ్తలూ-ప్రశంసలు - నిందాపనిందలు మమ్మల్నెప్పుడూ వెంటాడే 'నీడ'లాంటి నేస్తాలు.

మేము అందరికీ కావాల్సినవాళ్ళం. మా అవసరాలకి మాత్రం అందరికీ కానివాళ్ళం. ఏ మాధ్యమాలకైనా.. ఏ విషయానికైనా మేమే అవసరం, మేమే ప్రధమలం. మేము 'అల'లాంటి వాళ్ళం. 'అల'లాగా నిశ్చింతగా నిశ్చలంగా బతకడం చేతకానివాళ్ళం. కానీ, 'అల'లాగా పడినా లేవగల సత్తా ఉన్నవాళ్ళం. మేము దేనినైనా స్వీకరించగలం, దేనినైనా భరించగలం. దేనికైనా వెనకాడని దమ్ముగలవాళ్ళం.

ఎంత మంది ఎన్ని అన్నా, అనుకున్నా 'కళ' పట్ల, 'కళాకారుల' పట్ల వ్యామోహాన్ని ఆపలేరు, 'కళాకారులు' లోని తృష్ణని తగ్గించలేరు. ప్రపంచం ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతుకుతుంది తప్ప, గతాన్ని గుర్తుకు తెచ్చుకునే ఓపికా ఉండదు, భవిష్యత్తు గురించి బెంగపడే తీరికా ఉండదు. కాలప్రవాహంలో ఇప్పడు సంచరిస్తున్న వార్తలన్నీ రేపటికి సద్దికూడు. ఎల్లుండికి విసిరేసిన విస్తరాకు. క్లుప్తంగా.. ఈ వర్తమానమంతా రేపటికి ఇంగువ కలిపిన కమ్మని పులిహోర (అతిశ‌యోక్తుల‌తో కూడిన వార్త‌లు).. ఎల్లుండికి అందరూ వదిలించుకుందామనే అశుద్ధం.

PS: ఇప్పుడు తెలుగు 'వెండితెర'పై కమ్మిన కారుమబ్బుల గురించి, నా ఈ గోడు మీ అందరికీ అర్ధమయ్యుంటుందని ఆశిస్తూ..

మీ
వైవిఎస్ చౌదరి.