Begin typing your search above and press return to search.

త‌ట్టుకోలేక సూసైడ్ చేసుకోవాల‌నుకుంద‌ట‌!

By:  Tupaki Desk   |   14 July 2019 5:04 AM GMT
త‌ట్టుకోలేక సూసైడ్ చేసుకోవాల‌నుకుంద‌ట‌!
X
ఒక్క సినిమాతో జాతీయ‌.. అంత‌ర్జాతీయ గుర్తింపు.. పేరు ప్ర‌ఖ్యాతులు.. బోలెడ‌న్ని అవ‌కాశాలు.. అవార్డులు వ‌చ్చి ప‌డితే ఎవ‌రైనా ఏం చేస్తారు? అంద‌రికంటే భిన్నం దంగ‌ల్ న‌టి జైరా వ‌సీం. ప‌న్నెండేళ్ల వ‌య‌సులో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి టీనేజ్ నిండ‌ని వేళ‌లోనే సినిమాల‌కు గుడ్ బై చెప్పి షాకిచ్చింది. మ‌తం పేరుతో పెట్టిన ఇబ్బందులు కావొచ్చు.. మాన‌సిక సంఘ‌ర్ష‌ణ కావొచ్చు.. ఆమె సినిమాల నుంచి ఎగ్జిట్ అవుతున్న‌ట్లుగా చేసిన ప్ర‌క‌ట‌న పెను సంచ‌ల‌నంగా మారింది.

త‌న‌ను తాను స‌మాధాన‌ప‌ర్చుకోలేక‌పోతున్నాన‌ని.. ఎంత మార్చుకున్న‌ప్ప‌టికి.. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఇమ‌డ‌లేన‌న్న విష‌యం త‌న‌కు బాగా అర్థ‌మైంద‌న్న ఆమె.. మతం పేరుతో ఎంతో బాధ పెట్టార‌ని.. ఎన్నో ర‌కాలుగా విమ‌ర్శించార‌న్నారు. అలాంటి బాధ‌ల్ని త‌ట్టుకోలేక సినిమాల‌కు గుడ్ బై నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పిందీ టీనేజ‌ర్. తాజాగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌రిన్ని షాకింగ్ అంశాల్ని వెల్ల‌డించింది.

త‌న‌ను చుట్టుముట్టిన విమ‌ర్శ‌ల‌తో తాను తీవ్ర‌మైన డిప్రెష‌న్ కు లోన‌య్యాన‌ని.. ఒక ద‌శ‌లో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని కూడా అనుకున్న‌ట్లు చెప్పారు. నాలుగైదేళ్ల క్రితం కూడా డిప్రెష‌న్ కు లోనయ్యాన‌ని.. సినిమా రంగంలోకి వ‌చ్చిన నాటి నుంచి బెదిరింపుల బాధ ప‌డిన‌ట్లు చెప్పారు. తాను ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నించి తాను ఫెయిల్ అయిన‌ట్లు చెప్పారు.

మాన‌సిక ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు రోజూ ఐదు యాంటీ డిప్రెష‌న్ మెడిసిన్స్ తీసుకోవాల్సి వ‌చ్చేద‌ని.. ఒక్కోసారి విప‌రీత‌మైన బాధ‌తో రాత్రిళ్లు కూడా ఆసుప‌త్రికి వెళ్లాల్సి వ‌చ్చేద‌న్నారు. కొన్ని వారాల పాటు స‌రిగా నిద్ర పోయేదాన్ని కాద‌ని.. మ‌రికొన్ని రోజులు విప‌రీతంగా నిద్ర‌పోయేదాన్ని అంటూ త‌న ప‌రిస్థితిని చెప్పుకొచ్చారు.

ఇలా త‌న ఆరోగ్యం పాడైంద‌ని.. ఒక్కోసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకునేదాన‌న్ని.. మ‌రోసారి ఏమీ తినాల‌నిపించేది కాద‌న్నారు. కొన్ని రోజుల పాటు భోజ‌నం చేయ‌కుండా ప‌స్తులు ఉండ‌టంతో ఒంటినొప్పులు.. శ‌రీరం వాచిపోయేద‌ని.. ఆ బాధ‌లు భ‌రించటం త‌న వ‌ల్ల అయ్యేదే కాద‌న్నారు.

ఇంత చిన్న వ‌య‌సులో ఇంత డిప్రెష‌న్ కి లోనుకావ‌ట‌మా అని వైద్యులు సైతం విస్మ‌యాన్ని వ్య‌క్తం చేసే వార‌ని.. త‌న ప‌న్నెండో ఏట నుంచే డిప్రెష‌న్ తో బాధ ప‌డుతున్నాన‌ని.. మామూలుగా పాతికేళ్లు దాటిన వారే దీని బారిన ప‌డ‌తార‌ని.. దుర‌దృష్ట‌వ‌శాత్తు తాను చిన్న వ‌య‌సులోనే దీని కుంగుబాటు బారిన ప‌డిన‌ట్లుగా చెప్పారు. ఇదంతా విన్న‌ప్పుడు చిన్న వ‌య‌సులోనే జైరా ఇన్ని క‌ష్టాలు ప‌డిందా? అనిపించ‌కమాన‌దు.