Begin typing your search above and press return to search.

ఆ ద‌శ‌లో చ‌నిపోవాల‌నుకున్నా:జైరా వ‌సీం

By:  Tupaki Desk   |   11 May 2018 11:34 AM GMT
ఆ ద‌శ‌లో చ‌నిపోవాల‌నుకున్నా:జైరా వ‌సీం
X
ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న ఓ మాన‌సిక వ్య‌ధ డిప్రెష‌న్. మ‌నిషికి తెలియ‌కుండానే మాన‌సికంగా కుంగిపోయేలా చేసే డిప్రెష‌న్ బారిన ప‌డి సామాన్యుల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా కుంగిపోయారు. కొంద‌రు డిప్రెషన్ ను జ‌యించి సాధార‌ణ స్థితికి వ‌చ్చి జీవితంలో ముందుకు సాగుతోంటే....మ‌రికొంద‌రు డిప్రెష‌న్ ఊబిలో కూరుకుపోయి బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ్డారు. బాలీవుడ్ సెల‌బ్రిటీలు దీపికా ప‌డుకొనే, అనుష్క శ‌ర్మ‌, క‌ర‌ణ్ జొహ‌ర్, టైగ‌ర్ ష్రాఫ్ లు గ‌తంలో డిప్రెష‌న్ బారిన ప‌డి ప్ర‌స్తుతం సాధార‌ణ జీవితం గ‌డుపుతున్నారు. తాను కూడా డిప్రెష‌న్ బారిన ప‌డి తీవ్ర ఇబ్బందులు ప‌డ్డాన‌ని మ‌రో బాలీవుడ్ న‌టి వెల్ల‌డించింది. డిప్రెష‌న్ వ‌ల్ల ఓ ద‌శ‌లో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని భావించాన‌ని దంగ‌ల్ ఫేం జైరా వ‌సీం....త‌న ఫేస్ బుక్ ఖాతాలో వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం జైరా పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

డిప్రెష‌న్ కు వ‌య‌సుతో ప‌నిలేద‌ని జైరా తెలిపింది. చిన్నపిల్లవైన నీకు డిప్రెష‌న్ ఏమిట‌ని చాలా మంది అన్నార‌ని, ఆ స‌మస్య ఉంద‌ని త‌న‌కు తెలీద‌ని చెప్పింది. రాత్రుళ్లు హ‌ఠాత్తుగా మెల‌కువ వ‌చ్చేద‌ని, నిద్ర‌ప‌ట్ట‌క ఏడుపొచ్చేదని తెలిపింది. కోపం,అసహనంతో అధికంగా తిని లావెక్కాన‌ని చెప్పింది. చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాన‌ని తెలిపింది. తానే క‌రెక్ట‌ని, అమ్మానాన్నలు, డాక్టర్లు చెప్పేవి ప‌నికిమాలిన విష‌యాల‌ని అనిపించేద‌ని తెలిపింది. 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులో కూడా డిప్రెష‌న్ బారిన ప‌డే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది. తాను 12 ఏళ్ల వ‌యసులో డిప్రెష‌న్ కు గుర‌య్యాన‌ని, నాలుగేళ్ల చికిత్స తర్వాత కోలుకున్నాన‌ని చెప్పింది. కొన్నాళ్లపాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నానని, రాబోయే పవిత్ర రంజాన్‌ మాసం అందుకు స‌రైన స‌మ‌య‌మ‌ని చెప్పింది. ఆ క‌ష్ట స‌మ‌యంలో త‌న‌కు అండ‌గా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ ధన్య‌వాదాలు చెప్ప‌డం త‌క్కువేన‌ని జైరా తెలిపింది.