Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'జాంబి రెడ్డి'

By:  Tupaki Desk   |   5 Feb 2021 8:18 AM GMT
మూవీ రివ్యూ: జాంబి రెడ్డి
X
చిత్రం : ‘జాంబి రెడ్డి’

నటీనటులు: తేజ సజ్జా-ఆనంది-దక్ష నగార్కర్-ఆర్జే హేమంత్-కిరీటి-ఆర్జే హేమంత్-పృథ్వీ-జబర్దస్త్ శీను-వినయ్ వర్మ-అన్నపూర్ణ-హర్షవర్ధన్ తదితరులు
సంగీతం: మార్క్ కె.రాబిన్
ఛాయాగ్రహణం: అనీత్
నిర్మాత: రాజ్ శేఖఱ్ వర్మ
రచన-దర్శకత్వం: ప్రశాంత్ వర్మ

తెలుగులో తొలి జాంబీ సినిమాగా ‘జాంబి రెడ్డి’కి మంచి ప్రచారమే లభించింది. ‘అ!’, ‘కల్కి’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన చిత్రమిది. హీరోగా మారిన బాల నటుడు తేజ సజ్జా ఇందులో ప్రధాన పాత్రలో నటించాడు. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జాంబి రెడ్డి’ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

మారియో (తేజ సజ్జా) ఓ గేమ్ డిజైనర్. మరో ముగ్గురు మిత్రులతో కలిసి అతను డిజైన్ చేసిన గేమ్ చాలా తక్కువ సమయంలో బాగా పాపులర్ అవుతుంది. కానీ అంతలోనే గేమ్ లో బగ్స్ వల్ల రేటింగ్స్ పడిపోతుంటాయి. దాన్ని సరి చేయాల్సిన మారియో స్నేహితుడు కళ్యాణ్ (ఆర్జే హేమంత్) అప్పటికప్పుడు ఓ అమ్మాయి నచ్చేసి కర్నూలులో పెళ్లికి రెడీ అయిపోతాడు. గేమ్ లో బగ్స్ క్లియర్ చేయకుంటే అన్ని రోజులు పడ్డ కష్టమంతా వృథా అయిపోతుందని మిగతా ఇద్దరు స్నేహితుల్ని తీసుకుని కర్నూలుకు బయల్దేరతాడు మారియో. ఐతే ఫ్యాక్షన్ కుటుంబంలో అమ్మాయిని చేసుకోబోతున్న కళ్యాణ్ కు ప్రాణ హాని ఉందని గ్రహించిన మారియో అతణ్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ లోపు ఆ ఊరిలో అనూహ్యమైన ఘటనలు జరుగుతాయి. ఊరు మొత్తం జాంబీల మయం అవుతుంది. ఇంతకీ కర్నూలు ప్రాంతంలోకి జాంబీలు రావడానికి కారణమేంటి.. వాటి నుంచి మారియో ఎలా తప్పించుకున్నాడు.. తన స్నేహితుడితో పాటు ఆ ఊరిని ఎలా కాపాడాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

విలన్ ఇంట్లో ఓవైపు కొందరు కత్తులు నూరుతుంటారు. ఇంకోవైపు మరికొందరు బాంబులు చుడుతుంటారు. మొత్తంగా ఫ్యాక్షనిస్టు అయిన విలన్ ఇంట్లో పదుల సంఖ్యలో గూండాలుంటారు. మంచాన పడ్డ తన తండ్రి గురించి తక్కువ చేసి మాట్లాడాడని విలన్ అప్పుడే ఓ డాక్టర్ రెండు చేతులూ నరికి రక్తంతో తడిసిన బట్టలతో అక్కడికి వస్తాడు. గేమ్ లు డిజైన్ చేసుకునే హీరో ఆ కాంపౌండ్లోకి అడుగు పెడితే అతను పగోడి తాలూకా అని తెలిసి తనతో పాటు వెంట ఉన్న ఇద్దరు మిత్రుల్ని చంపేయమని విలన్ ఆదేశిస్తాడు. కత్తులు.. బాంబులు పట్టుకుని విలన్ గ్యాంగ్ అంతా హీరో మీదికి లగెత్తుతారు. కట్ చేస్తే హీరో నిమిషాల్లో వాళ్లందరినీ మట్టికరిపించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ తతంగం అంతా జరుగుతున్నంతసేపూ హీరో పక్కనున్న ఫ్రెండు గేమ్ లో మునిగిపోయి ఉంటుంది. హీరో పెద్ద ఫైట్ చేసి బయటికి వచ్చాక రాయలసీమ అంటే కత్తులు.. బాంబులు అంటారు మరి ఇక్కడంతా ఏమీ లేవు.. బోరింగ్ గా ఉందేంటి అంటుందామె. అవాక్కవడం హీరో వంతవుతుంది. ముందు సీన్లో అంతటి కర్కోటకుడైన విలన్ ఇంట్లో బక్క హీరో చేసిన విన్యాసాలకు రోమాలు నిక్కబొడుచుకుంటే.. ఆ తర్వాత అతడి పక్కనున్న అమ్మాయి వేసిన జోక్ కు పగలబడి నవ్వేసుకుంటే.. ‘జాంబి రెడ్డి’ని తెగ ఎంజాయ్ చేసేయొచ్చు. లేదంటే మాత్రం చాలా కష్టం.

రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని విపరీతంగా గ్లోరిఫై చేసి ఒకప్పుడు సీరియస్ సినిమాలు తీశారు టాలీవుడ్ దర్శకులు. ఆ తరహా సినిమాలు మొహం మొత్తేశాక ఆ నేపథ్యాన్ని కామెడీ కోసం వాడేసుకున్నారు తర్వాతి దర్శకులు. ఐతే అలా కూడా సీమ ఫ్యాక్షన్ విసుగెత్తించేసి అందరూ పక్కన పెట్టేశాక.. ఇప్పుడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ నేపథ్యానికి జాంబీలను జోడించి ప్రేక్షకులకు కొత్తగా ఏదో చూపించాలని ట్రై చేశాడు. ఐతే ఫ్యాక్షనిజంతో ముడిపడ్డ సన్నివేశాలను కొంచెం సీరియస్ గా మొదలుపెట్టి ఆ తర్వాత సిల్లీగా మార్చేసిన ప్రశాంత్.. జాంబీ కాన్సెప్ట్ ను సైతం ప్రేక్షకులు ఏమాత్రం సీరియస్ గా తీసుకోలేని విధంగా డీల్ చేయడం ‘జాంబి రెడ్డి’కి ప్రతికూలంగా మారింది. ఏదో చల్తా అన్నట్లుగా కథాకథనాలు నడిచిపోతుంటాయి కానీ.. ఎక్కడా కూడా ప్రేక్షకులు వాటిలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశమే ఇవ్వలేదు దర్శకుడు. సినిమా ఆద్యంతం అవసరం లేని హడావుడితో గోల గోలగా సాగుతూ ప్రేక్షకులు ఒక రకమైన అలజడికి గురి చేస్తూ సాగుతుంది ‘జాంబి రెడ్డి’. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్లు పేలాయి తప్ప.. ఓవరాల్ గా ‘జాంబి రెడ్డి’ ప్రత్యేకమైన అనుభూతిని మాత్రం ఇవ్వదు.

ఇప్పటిదాకా తెలుగులో పూర్తి స్థాయి జాంబీ సినిమా రాలేదు. ప్రశాంత్ ఆ దిశగా ఓ ప్రయోగం చేశాడు. ఇది మంచి విషయమే. అయితే ఈ జాంబీ కాన్సెప్ట్ మన ప్రేక్షకులకు ఆశ్చర్యపోయి చూసేలా మాత్రం ‘జాంబి రెడ్డి’ లేదు. కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసే క్రమంలో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా జాంబీలు వచ్చారనడం లాజికల్ గా అనిపించదు. .జాంబీ కాన్సెప్టే లాజికల్ కాదు కాబట్టి సర్దుకుపోవచ్చు అనుకుందాం. కానీ జాంబీలు మిగతా మనుషుల్ని ఎటాక్ చేయడం, ఆ తర్వాత పరిణామాలన్నింటినీ కూడా ప్రశాంత్ కేవలం కామెడీ కోసమే వాడుకోవడం వల్ల ఎక్కడా ఈ కాన్సెప్ట్ ను సీరియస్ గా తీసుకునే.. ప్రేక్షకులు భయపడే పరిస్థితి ఉండదు. ఈ క్రమంలో వచ్చే కామెడీ సన్నివేశాలు మాత్రం బాగానే పేలాయి. ‘జాంబి రెడ్డి’లో హైలైట్ గా చెప్పుకోవాల్సినవి అవే. జబర్దస్త్ ఫేమ్ గెటప్ శీను.. ఆర్జే హేమంత్.. మరి కొందరు పాత్రధారులతో ప్రశాంత్ జాంబీ సన్నివేశాలతో బాగానే నవ్వించాడు.

ఆ తర్వాత మళ్లీ కథలో సీరియస్నెస్ తీసుకురావడానికి దర్శకుడు ప్రయత్నించాడు కానీ.. అదంతా మొక్కుబడి వ్యవహారంలా అనిపిస్తుంది. కరోనాకు మందు కనుక్కునే సైంటిస్ట్.. అతడి చుట్టూ ఉన్న సెటప్ అంతా కూడా మరీ సిల్లీగా అనిపిస్తుంది. ‘జాంబి రెడ్డి’ పూర్తిగా తేలిపోయింది సంబంధిత సన్నివేశాల్లోనే. చివర్లో జాంబీలకు విరుగుడు మందు విషయంలో దేవుడితోనూ ముడిపెట్టే ప్రయత్నం జరిగింది కానీ.. ప్రేక్షకులకు అదేమంత ఎక్కదు. ముగింపులో కొన్ని చమక్కులతో ప్రశాంత్ తన ప్రతిభను చాటాడు కానీ.. సినిమాలో ముందు నుంచి ఇలాంటి మెరుపులుంటే బాగుండేదనిపిస్తుంది. క్రికెట్ మీద మోజుతో రఘుబాబు ముఖంతో ఉన్న వ్యక్తి బంతి బదులు బాంబు పట్టుకోగా అది పేలి పృథ్వీలా మారిపోయినట్లుగా ఒక కామెడీ సీన్ పెట్టారిందులో. ‘జాంబి రెడ్డి’ ఎంత నాన్ సీరియస్ గా ఉంటుందో చెప్పడానికిదో ఉదాహరణ. లాజిక్కులతో సంబంధం లేకుండా ఇలాంటి ఓవర్ ద టాప్ కామెడీ సీన్లతో సర్దుకుపోతామంటే ‘జాంబి రెడ్డి’పై ఓ లుక్కేయొచ్చు. అంతే తప్ప జాంబి కాన్సెప్ట్.. ఏదో కొత్తగా ఉంటుందని అంచనాలు పెట్టుకుంటే నిరాశ తప్పదు.

నటీనటులు:

తేజ సజ్జా బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన కుర్రాడు. ఆ అనుభవంతో వచ్చిన ఈజ్ అతడిలో కనిపిస్తుంది. అతను కొత్త కుర్రాడిలా అనిపించడు. చాలా ఈజీగా మారియో పాత్రను చేసుకుపోయాడు. ఆ పాత్రకు సూట్ అయ్యాడు కూడా. లుక్స్ పరంగా అతడికి యావరేజ్ మార్కులు పడతాయి. పెర్ఫామెన్స్ పరంగా అతడికి ఈ పాత్ర పెద్దగా పరీక్ష ఏమీ పెట్టలేదు. హీరోయిన్ ఆనంది చూడ్డానికి చక్కగా అనిపిస్తుంది. నటన కూడా ఆకట్టుకుంటుంది. దక్ష నగార్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదు. ఆమె పాత్రను తేల్చేశారు సినిమాలో. గ్లామర్ పరంగా ఆమె ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ ఫేమ్ గెటప్ శీనుకు సినిమాలో చెప్పుకోదగ్గ పాత్ర దక్కింది. అతను బాగానే నవ్వించాడు. ఆర్జే హేమంత్.. పృథ్వీ కూడా కొంత నవ్వించారు. వినయ్ వర్మ ఓకే. విలన్ పాత్రలో నటించిన నటుడు పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

సాంకేతికంగా ‘జాంబి రెడ్డి’ బాగానే అనిపిస్తుంది. మార్క్ కె.రాబిన్ స్వర పరిచిన పాటల్లో ‘గో కరోనా’ ఆకట్టుకుంటుంది.. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాల్లో మరీ లౌడ్ గా అనిపించినప్పటికీ.. ఓవరాల్ గా సినిమాకు ఆకర్షణగానే చెప్పొచ్చు. అనీత్ ఛాయాగ్రహణం బాగుంది. చిన్న సినిమా అయినా పెద్ద చిత్రం స్థాయి ఔట్ పుట్ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. జాంబీల మేకప్.. సెటప్ ఎబ్బెట్టుగా అనిపించకుండా చేయడంలో చిత్ర బృందం పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. నిర్మాత అభినందనీయుడు. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ విషయానికొస్తే.. అతను ప్రతిసారీ ఏదో కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాడు. అతడి ఐడియాలు బాగుంటున్నాయి. ట్రెండీగానూ అనిపిస్తాయి. కానీ నరేషన్ మాత్రం కుదురుగా అనిపించదు. హడావుడి.. గందరగోళం ఎక్కువైపోయి ప్రేక్షకుల ఫీలింగ్ మారిపోతోంది. ప్రేక్షకులను నవ్వించాలనుకోవడం ఓకే కానీ.. కాస్తయినా సీరియస్నెస్ లేకుండా ‘జాంబి రెడ్డి’ని డీల్ చేయడంతో అది ప్రేక్షకులను అనుకున్నంతగా మెప్పించలేకపోయింది.

చివరగా: జాంబి రెడ్డి.. సో సో కామెడీ

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre