రష్మిక వైపు.. ఇంకా ఎందరో..
గత రెండు రోజుల నుంచి రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 7 Nov 2023 2:30 PM GMTగత రెండు రోజుల నుంచి రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ డీప్ ఫేక్ వీడియోపై ముందుగా బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ రియాక్ట్ అయ్యారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి వేరొక మోడల్ వీడియోని రష్మిక మందన లుక్ లోకి మార్చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అమితాబచ్చన్ ఆ వీడియోపై కామెంట్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. దీనిపై కేంద్ర సమాచార మంత్రి కూడా స్పందించారు. ఆ వీడియో క్రియేట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. హీరోయిన్ రష్మిక కూడా స్పందించి ఈ టెక్నాలజీ చూస్తుంటే భయం వేస్తోందని, చదుకునే రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉండేదో తలుచుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందని పేర్కొంది.
భవిష్యత్తులో మహిళలు, ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుందేమోనని అన్నారు. ఇక ఈ వీడియోపై టాలీవుడ్ సెలబ్రిటీ లైన నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్ కూడా రియాక్ట్ అయ్యి ఈ ఫేక్ వీడియోలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలని కోరారు.
చిన్మయి శ్రీపాద, ప్రియా సర్కార్, ఆయుష్ జైన్, అనురాగ్ మీనా, కవితా కల్వకుంట్ల కూడా ఈ డీప్ ఫేక్ వీడియోపై స్పందించి రష్మికకి మద్దతుగా నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ఈ డీప్ ఫేక్ వీడియో విషయంలో మద్దతు లభిస్తోంది. కచ్చితంగా ఇలాంటివి జరగకుండా AI టెక్నాలజీపై నియంత్రణ ఉండాలని సోషల్ మీడియాలో కూడా డిమాండ్ చేస్తున్నారు.
అలాగే ఒరిజినల్ వీడియోలో ఉన్న మోడల్ కూడా రియాక్ట్ అయ్యి డీప్ ఫేక్ లో రష్మిక మందన లుక్ లోకి మార్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కచ్చితంగా దీనిపై నియంత్రణ ఉండాలని, ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తానికి సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉండటంతో బాధితురాలిగా ఉన్న రష్మికకి కూడా స్టార్స్ నుంచి మద్దతు లభిస్తోంది.