గేమ్ ఛేంజర్ : అరుగు మీద కుసుంటే పలకరించావేంది ఓ దొర..!
తాజాగా మరో సాంగ్‌ను సైలెంట్‌గా విడుదల చేశారు. అరుగు మీద.. అంటూ సాగే పాటను గేమ్ ఛేంజర్ యూనిట్ సభ్యులు విడుదల చేశారు.
By: Tupaki Desk | 7 Jan 2025 10:07 AM GMTరామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌పై ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింతగా పెరిగాయి. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సినిమాలోని పాటలకే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లుగా చెబుతున్న దిల్ రాజు అంచనాలు మరింతగా పెంచారు. ఇప్పటికే విడుదలైన పాటలు మెగా ఫ్యాన్స్‌ని అలరిస్తూ ఉన్నాయి. తాజాగా మరో సాంగ్‌ను సైలెంట్‌గా విడుదల చేశారు. అరుగు మీద.. అంటూ సాగే పాటను గేమ్ ఛేంజర్ యూనిట్ సభ్యులు విడుదల చేశారు. రామ్ చరణ్, అంజలిపై ఈ పాట ఉండబోతుంది. కేవలం ఆడియోను మాత్రమే విడుదల చేశారు. పాటలో విజువల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం రహస్యంగా ఉంచారు.
తమన్ సంగీతం అందించగా, తమన్, రోషిని ఆలపించారు. కాసర్ల శ్యామ్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించడం విశేషం. రోషిని వాయిస్ ఈ పాటను ప్రత్యేకంగా నిలిపింది. ఆమె వాయిస్ పాటకు మరింతగా అందం చేకూర్చినట్లు అయ్యింది. అలికి పూసిన అరుగు మీద కలికి సుందరినై కుసుంటే పలకరించావేంది ఓ దొర…. సిలక ముక్కు చిన్ని నా దొర… అంటూ సాగిన ఈ పాట సినిమాలో ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ తండ్రి గెటప్‌లో చూసి ఇప్పటికే ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ అయ్యారు. ఇక అంజలి ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలో కనిపించబోతుంది, ఆమె నటనకు జాతీయ అవార్డ్ ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్ల్యాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఈ పాట రానుంది. రామ్ చరణ్, అంజలి మధ్య సాగే ఈ సాంగ్ చిత్రీకరణ కోసం శంకర్ కాస్త ఎక్కువ రోజులు తీసుకున్నారని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అన్ని పాటల మాదిరిగానే ఈ పాటకు భారీ సెట్స్ వేయించి శంకర్ రూపొందించి ఉంటారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంజలి ఎలాంటి పాత్రలో అయినా ఈజీగా ఒదిగి పోతుంది. అందుకే ఈ సినిమాలోనూ ఆమె పాత్ర గురించి, ఆ పాట గురించి సంక్రాంతి తర్వాత ప్రముఖంగా మాట్లాడుకుంటారు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్రైలర్ విడుదల తర్వాత గేమ్ ఛేంజర్ స్థాయి అమాంతం పెరిగింది. నార్త్ ఇండియాలో సినిమాకు ఇప్పటి వరకు పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత కచ్చితంగా మంచి స్పందన దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్‌ను ఈ సినిమా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ పాన్ ఇండియా రేంజ్‌లో ఏ స్థాయిలో ఓపెనింగ్ వసూళ్లు నమోదు అవుతాయి అనేది చూడాలి. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సౌత్ స్టార్ దర్శకుడు కమ్ నటుడు ఎస్ జే సూర్య విలన్‌గా నటించాడు.