మూవీ రివ్యూ : అష్ట దిగ్బంధనం
By: Tupaki Desk | 23 Sep 2023 11:09 AM GMT'అష్ట దిగ్బంధనం' మూవీ రివ్యూ
నటీనటులు: సూర్య భరత్ చంద్ర-విశిక కోట-మహేష్ రావుల్-విశ్వేందర్ రెడ్డి-రంజిత నారాయణ్ కురుప్-రోష్ని రజాక్ తదితరులు
సంగీతం: జాక్సన్ విజయన్
ఛాయాగ్రహణం: బాబు కొల్లాబత్తుల
నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్
రచన-దర్శకత్వం: బాబా పీఆర్
పేరున్న సినిమాలేవీ లేక బాక్సాఫీస్ వెలవెలబోతున్న ఈ వారాంతంలో వచ్చిన చిన్న చిత్రాల్లో 'అష్ట దిగ్బంధనం' ఒకటి. సూర్యభరత్ చంద్ర-విశిక కోట జంటగా బాబీ పీఆర్ రూపొందించిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
గౌతమ్ (సూర్యభరత్ చంద్ర) అధునాతన లాకర్లు తయారు చేసే కంపెనీలో డిజైనర్ గా పని చేస్తుంటాడు. అతడి భార్య ప్రియ (విశిక కోట) ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగి. చిన్నప్పట్నుంచి అనాథలుగా పెరిగిన ఈ ఇద్దరూ.. బాగా డబ్బు సంపాదించి సెటిలయ్యాక పిల్లల్ని కనాలని అనుకుంటారు. అంతలో ప్రియకు బ్రెయిన్ ట్యూమర్ అని తెలుస్తుంది. ఆమె చికిత్సకు కోటి రూపాయలు అవసరం అవుతాయి. గౌతమ్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఒక దొంగతనం ఆఫర్ వస్తుంది. ఓ బ్యాంకు నుంచి 50 కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చేసుకున్న ఒక గ్యాంగ్ గౌతమ్ సాయం కోరుతుంది. ముందు తటపటాయించినా తర్వాత దొంగతనానికి అంగీకరిస్తాడు గౌతమ్. మరి అనుకున్న ప్రకారం గౌతమ్ అండ్ గ్యాంగ్ ఆ దొంగతనాన్ని పూర్తి చేసిందా.. ఆ తర్వాత అతడికి ఎదురైన పరిణామాలు ఏంటి అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
తెలుగులో 'పోకిరి'.. హిందీలో 'రేస్' లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాక చాలామంది ఫిలిం మేకర్లపై ఆ ప్రభావం బాగా పడింది. వారికి 'ట్విస్టు' పిచ్చి పట్టుకుంది. కథలో వీలైనన్ని ఎక్కువ ట్విస్టులు పెట్టడం.. తద్వాారా ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ చేసి వారి మనసులు గెలవడం ఒక సక్సెస్ ఫార్ములాగా భావిస్తున్నారు. ఐతే ఈ క్రమంలో లాజిక్ ను పూర్తిగా కొండెక్కించేస్తున్నారు. మిగతా కథ మీద కసరత్తు చేయకుండా.. లాజికల్ గా అనిపించని ట్విస్టులు ఎన్నుంటే ఏం లాభం? 'అష్టదిగ్బంధనం' ఈ కోవకు చెందిన సినిమానే. 'రేస్'లో మాదిరి.. ఒక్కో పాత్ర గురించి ముందు మనం ఏదో అనుకుంటే తర్వాత ఇంకేదో చూపించి.. షాకులివ్వడమే పనిగా పెట్టుకున్నాడు దర్శకుడు. ప్లాన్ వెనుక ప్లాన్.. దాని వెనుక ఇంకో ప్లాన్.. ఇలా ఈ కథలో ట్విస్టుల మీదే స్క్రీన్ ప్లేను నడిపించడానికి ప్రయత్నించాడు. కానీ ఈ ట్విస్టులు లాజికల్ గా అనిపించడం.. కథలో ఇంటెన్సిటీ లేకపోవడం.. సాధారణమైన టేకింగ్.. 'అష్టదిగ్బంధనం'ను సాధారణ సినిమాగా మార్చాయి.
ఒక బ్యాంకు నుంచి 50 కోట్లు కొట్టేయడం అంటే మాటలా? దాని కోసం ఎంత కసరత్తు జరగాలి. ఆ పని ఎంత పకడ్బందీగా జరగాలి. కానీ 'అష్టదిగ్బంధనం'లో విలన్ కు ఏదో సమస్య వచ్చిందని చిటికెలో బ్యాంక్ రాబరీ ప్లాన్ వేస్తాడు. కాసేపటికే దొంగతనం చేసే మనిషి రెడీ అయిపోతాడు. బయట నలుగురు సెక్యూరిటీ గార్డుల్ని కొట్టేసి.. ఈజీగా లోపలికి వెళ్లిపోవడం.. అంతే ఈజీగా లాకర్ తీసేసి డబ్బులు దోచేయడం.. ఆ తర్వాత ఈ 50 కోట్లు సరిపోవని విలన్ దగ్గరున్న వంద కోట్లు కూడా పట్టుకొచ్చేయడం.. ఇదంతా అల్లాటప్పా వ్యవహారం లాగా అనిపిస్తుందే తప్ప.. అందులో ఉండాల్సిన తీవ్రత లేదు. వివిధ పాత్రల్ని.. సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం సినిమాను ఏమాత్రం సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి కల్పిస్తుంది. షార్ట్ ఫిలిమ్స్ లో కూడా మంచి క్వాలిటీ కనిపిస్తున్న ఈ రోజుల్లో.. తెర మీద ఈ కథను ప్రెజెంట్ చేసిన తీరు పేలవంగా అనిపిస్తుంది.
కాకపోతే హీరో అసలు ఉద్దేశం బయటపడే దగ్గర్నుంచి కథలో కొన్ని మలుపులు ఆశ్చర్యపరుస్తాయి. ఒక్కో పాత్రకు సంబంధించి నిజ స్వరూపం బయటపెడుతూ.. కొత్త కొత్త ప్లాన్లు తెరపైకి రావడం కొంత ఆసక్తి రేకెత్తి రేకెత్తిస్తుంది. కానీ ట్విస్టుల విషయంలో దర్శకుడు లాజిక్ ను పూర్తిగా అటకెక్కించేశాడు. హీరో ఇంత పెద్ద దొంగతనం చేయడం వెనుక కారణం.. అతను-హీరోయిన్ కలిసి అందరినీ మోసం చేసే తీరు సిల్లీగా అనిపిస్తాయి. ద్వితీయార్ధం అంతా పూర్తిగా ట్విస్టుల మీదే నడపించాడు. కానీ ట్విస్టులు కొంత ఆశ్చర్యపరిచినా.. ఏమాత్రం కన్విన్సింగ్ గా లేని సన్నివేశాలు సినిమా స్థాయిని తగ్గించేస్తాయి. చాలా అపరిపక్వంగా సన్నివేశాలను డీల్ చేయడం నిరాశ పరుస్తుంది. అష్టదిగ్బంధనం అంటూ చివర్లో వచ్చే కాన్సెప్ట్ కూడా ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. కథలో ఎన్ని మలుపులున్నా సరే.. ఉత్కంఠగా మాత్రం అనిపించదు. అంతా హీరోకు అనుకూలంగా జరిగిపోవడంతో టెన్షన్ క్రియేట్ కాదు. పతాక సన్నివేశాలు కూడా సాధారణంగా అనిపిస్తాయి.
నటీనటులు:
హీరో సూర్య భరత్ చంద్ర పర్వాలేదు. అతడి నటన సోసోగా అనిపిస్తుంది. కొన్ని సీన్ల వరకు ఓకే అనిపించాడు. సూర్య వాయిస్ తన పాత్రకు అంతగా సూట్ కాలేదు. సీరియస్ సీన్లలో అతడి డైలాగ్ డెలివరీ తేలిపోయింది. హీరోయిన్ విశిక కోట చూడ్డానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది. నటన పరంగా కూడా ఆమె నుంచి మెరుపులేమీ లేవు. విలన్ పాత్రలో మహేష్ రావుల్ ఒక్కడు కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తాడు. కొన్ని చోట్ల అతడి నటన ఓవర్ అనిపించినా.. కొన్ని సీన్లలో బాగానే చేశాడు. పొలిటికల్ లీడర్ పాత్రలో విశ్వేందర్ రెడ్డి ఓకే. పోలీస్ పాత్రలో చేసిన నటుడు పర్వాలేదు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా 'అష్టదిగ్బంధనం'లో మెరుపులేమీ లేవు. జాక్సన్ విజయన్ పాటల్లో ఏదీ వినసొంపుగా లేదు. నేపథ్య సంగీతం కూడా సాదాసీదాగా అనిపిస్తుంది. బాబు కొల్లాబత్తుల ఛాయాగ్రహణం కూడా మామూలుగా సాగిపోయింది. సినిమాను పరిమిత బడ్జెట్లో తీసిన విషయం అర్థమైపోతుంది. బాబా పీఆర్ కేవలం ట్విస్టుల్ని నమ్ముకుని ఇష్టం వచ్చినట్లుగా కథను. పాత్రల్ని అనేక వంకర్లు తిప్పేశాడు. రైటింగ్ కాస్త పర్వాలేదు కానీ.. టేకింగ్ దగ్గర మాత్రం సాధారణంగా అనిపిస్తుంది.
చివరగా: అష్టదిగ్బంధనం.. ప్రేక్షకులే బందీలు
రేటింగ్ - 1.5/5