ప్రభాస్ చేయాల్సిన భారీ చిత్రం చివరికలా..!
వాటిలో కొన్ని సక్సెసైతే మెజారిటీ భాగం ఫెయిలయ్యాయి.
By: Tupaki Desk | 15 Nov 2024 11:30 PM GMTగడిచిన నాలుగైదేళ్లుగా బాహుబలి స్ఫూర్తితో చాలా సినిమాలు తెరకెక్కాయి. బాహుబలి ఫ్రాంఛైజీని కొట్టేలా భారీ పాన్ ఇండియన్ సినిమాలు తీయాలని చాలామంది దర్శకనిర్మాతలు కలలు కన్నారు. అయితే అతి భారీ బడ్జెట్లను సమకూర్చలేక తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. కొందరు బడ్జెట్లతో సవాళ్లను, ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేసారు. వాటిలో కొన్ని సక్సెసైతే మెజారిటీ భాగం ఫెయిలయ్యాయి. చాలా మంది తమ సినిమాలను ప్రారంభించి మిడిల్ డ్రాపయ్యారు.
ఇప్పుడు ఇదే కేటగిరీలో చేరిపోయింది- అశ్వత్థామ. పాన్ ఇండియా కేటగిరీలో రూపొందే ఈ చిత్రంలో ప్రభాస్ నటిస్తాడని కూడా ప్రచారం సాగింది. ప్రభాస్ లేదా రణబీర్ తో ఈ సినిమా తీస్తారని ప్రచారమైంది. కానీ చివరికి ఇది షాహిద్ కపూర్‌తో మొదలైంది. కన్నడ ఫిలింమేకర్ సచిన్ బి.రవి దర్శకత్వం వహిస్తున్నారు. భగ్నానీలకు చెందిన పూజా ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. దీనికోసం ఏకంగా 500 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేయాలని ముందే నిర్మాతలు ప్లాన్ చేసారు. కానీ అనుకున్నదొకటి.. అయినదొకటి.. ఈ సినిమాని ప్రణాళిక ప్రకారం.. పలు దేశాల్లో అత్యంత భారీగా తెరకెక్కించాల్సి ఉంది. దీంతో `అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్` ఊహించని జాప్యాన్ని ఎదుర్కొంది. మార్చిలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్‌లో భారీ ఉత్సాహంతో ప్రకటించిన ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటి అని ప్రకటించారు.
అమెజాన్ స్టూడియోస్ సహకారంతో వాషు భగ్నాని పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మించేందుకు భారీ బడ్జెట్లను సమకూర్చే ప్రయత్నం చేసినా ఆదిలోనే ఇబ్బంది ఎదురైంది. అశ్వత్థామ అంతర్జాతీయ ఫాంటసీ-యాక్షన్ చిత్రాలకు పోటీగా రూపొందించాలనే తపనతో ప్రారంభించారు. అయితే ఎనిమిది నెలల తర్వాత అంతకంతకు పెరుగుతున్న భారీ బడ్జెట్, లాజిస్టికల్ సవాళ్ల కారణంగా ఈ సినిమాని నిలిపేశారని ప్రఖ్యాత మిడ్ -డే తన కథనంలో పేర్కొంది.
అశ్వత్థామ ప్రీ-ప్రొడక్షన్ దశలోనే అదుపు తప్పిన బడ్జెట్ గురించ చర్చ మొదలైంది. ఖర్చులు వేగంగా పెరగడంతో నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. ఈ ప్రాజెక్ట్ స్థాయి చాలా పెద్దది. అంతర్జాతీయ ఫాంటసీ-యాక్షన్ చిత్రాలకు పోటీగా ఏదైనా సృష్టించాలనే ఆలోచన వారి మైండ్ లో ఉంది. అశ్వత్థామను పలు దేశాల్లో చిత్రీకరించాల్సి ఉంది. కానీ అంతర్జాతీయ ప్రదేశాలలో లాజిస్టిక్స్ కోఆర్డినేషన్ మొదలు కాగానే, బడ్జెట్‌లో పూర్తి చేయడం తీవ్రమైన సవాల్ గా మారుతుందని స్పష్టమైంది. ఈ సవాళ్లతో పాటు పూజా ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారడం ఒత్తిడిని పెంచింది. ఇది నిర్మాణ ప్రక్రియను మరింత క్లిష్టతరం చేసింది. బడ్జెట్, లాజిస్టికల్ సంక్లిష్టతల కారణంగా సినిమాని నిలిపివేశారని మిడ్ డే తాజా కథనంలో వెల్లడించింది. ప్రస్తుతం షాహిద్ కపూర్ దర్శకుడు విశాల్ భరద్వాజ్‌తో చేయబోయే ప్రాజెక్ట్‌పై దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది.
ఇటీవలే కల్కి 2898 ఏడిలో అశ్వత్థామ పాత్ర దేశవ్యాప్తంగా ప్రజల్ని మెప్పించింది. ఇప్పుడు అదే పాత్రను పూర్తి స్థాయిలో తెరపై చూపించాలనే ప్రయత్నమే ఇది. మహాభారతంలోని మరణం లేని యోధుడు అశ్వత్థామ కథకు.. సమకాలీన అంశాలను మిళితం చేసి రూపొందించాలని ప్లాన్ చేసారు. ప్రస్తుతం మారిన మార్కెట్ పరిస్థితులు కూడా భారీ బడ్జెట్ చిత్రాలకు అననుకూలంగా ఉన్నాయని కూడా కథనాలొస్తున్నాయి. గ్రీన్ మ్యాట్ లో విజువల్ గ్రాఫిక్స్ లో తీసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. బడ్జెట్ అదుపు తప్పే వీలుంది.. అందుకే దీనిని ఆపేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అశ్వత్థామ తిరిగి ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. అయితే ప్రాజెక్ట్ స్టాటస్ గురించి అమెజాన్ స్టూడియోస్- పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌లు ఇంకా అధికారిక ప్రకటనలు చేయవలసి ఉంది. నిర్మాత వాషు భగ్నాని ఈ విషయంపై ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.