బెజవాడ నీటమునక.. కల్కి నిర్మాత అతి పెద్ద ప్రకటన..
వరదలతో బెజవాడ నీట మునిగిన సంగతి తెలిసిందే. ప్రజల అష్టకష్టాలను టీవీల్లో చూస్తున్నవారు ఆశ్చర్యపోతున్నారు.
By: Tupaki Desk | 2 Sep 2024 5:12 PM GMTవరదలతో బెజవాడ నీట మునిగిన సంగతి తెలిసిందే. ప్రజల అష్టకష్టాలను టీవీల్లో చూస్తున్నవారు ఆశ్చర్యపోతున్నారు. విజయవాడ బెల్ట్ కి ఇంత పెద్ద వరద ముప్పు ఎన్నడూ ఊహించనిది. దాదాపు 50 ఏళ్లలోనే అతి పెద్ద వరద పోటెత్తడంతో నగరం నీట మునిగింది. ఈ వరదల ప్రభావానికి దాదాపు 40శాతం పైగా ప్రజలు ప్రభావితం అయ్యారు. వారికి పెద్ద కష్టం వచ్చింది. తిండి బట్టలు ఉండటానికి గూడు అవసరం పడింది. ఇల్లు వాకిలి పల్లె పట్నం అన్నీ నీట మునగడంతో వారి కష్టాలను తీర్చేందుకు ఇప్పుడు ఆపత్కాల నిధి అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టింది. ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలతో ప్రజలను రక్షించే కార్యక్రమాలను సీఎం వీక్షిస్తున్నారు.
ఇంతలోనే టాలీవుడ్ నుంచి ఒక పెద్ద ప్రకటన. తెలుగు చిత్రసీమ అగ్ర నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వనిదత్ రూ.25,000,00/- లక్షల విరాళాన్ని ప్రకటించారు. దీనిని సీఎం ఆపత్కాల నిధికి జమ చేస్తున్నామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలకు మద్దతుగా AP ముఖ్యమంత్రి సహాయనిధికి వైజయంతి మూవీస్ ఈ విరాళాన్ని అందిస్తోందని ప్రకటించారు. వరద బాధితులకు సహాయంగా ఈ విరాళాన్ని అందిస్తున్నామని వెల్లడించింది. ఈ రాష్ట్రం మనకు చాలా ఇచ్చింది. కష్టకాలంలో తిరిగి ఇవ్వడం మన బాధ్యత.. అని కూడా స్పెషల్ నోట్ లో వైజయంతి వెల్లడించింది. టాలీవుడ్ నుంచి ఇది పెద్ద ప్రకటన. ఇకపైనా మరిన్ని ఘనమైన ప్రకటనలను తెలుగు చిత్రసీమ నుంచి ఆశించవచ్చు.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ దశాబ్ధాల చరిత్ర గురించి తెలుగు ప్రజలకు తెలుసు. ఐదు దశాబ్ధాల సుదీర్ఘ చరిత్ర ఈ సంస్థకు ఉంది. బ్లాక్ బస్టర్లు నిర్మించిన ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థగా వైజయంతి కి ఇమేజ్ ఉంది. కొన్ని పరాజయాలు ఉన్నా, తిరిగి ఈ సంస్థ కంబ్యాక్ అయిన తీరు ఆసక్తికరం. మహానటి, కల్కి 2989 ఏడి వంటి బ్లాక్ బస్టర్లతో వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. అశ్వనిదత్ నిర్మించిన కల్కి 2989 ఏడి చిత్రం భారీ లాభాలను అందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం టాలీవుడ్ నుంచి మరో 1000 కోట్ల క్లబ్ సినిమాగా రికార్డులకెక్కింది.
ఇటీవల వైజయంతి అధినేత అశ్వనిదత్ వరుసగా పాన్ ఇండియా సినిమాల నిర్మాణంలో తలమునకలుగా ఉన్నారు. కల్కి సీక్వెల్ ని నిర్మించేందుకు దత్ ఉత్సాహంగా ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే అశ్వనిదత్ కి ప్రత్యక్షంగానే రాజకీయాలతో సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తున్నారన్న సమాచారం ఉంది.