Begin typing your search above and press return to search.

అతిథి : వెబ్ సెరీస్ రివ్యూ

రాజా వర్ధన్ రవి వర్మ అలియాస్ రవి వర్మ (వేణు) ఒంటరిగా పెద్ద బంగ్లాలో కేవలం తన భార్యతో కలిసి ఉంటాడు. అనుకోకుండా ఒక నైట్ మాయ (అవంతిక) వర్షం కారణంగా అతని ఇంట్లోకి వెళ్తుంది.

By:  Tupaki Desk   |   19 Sep 2023 11:49 AM GMT
అతిథి : వెబ్ సెరీస్ రివ్యూ
X

ఒకప్పుడు హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించిన వేణు ఈమధ్య మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చినా ఆశించినంత సక్సెస్ అందుకోలేదు. రీ ఎంట్రీలో సినిమాలే కాదు వెబ్ సీరీస్ కూడా చేయాలని ఫిక్స్ అయ్యాడు వేణు. అందులో భాగంగానే డిస్నీ హాట్ స్టార్ లో అతిధి వెబ్ సీరీస్ చేశారు. ట్రైలర్ తో సీరీస్ హార్రర్ అప్పీల్ తెచ్చుకుంది. నేడు రిలీజైన ఈ వెబ్ సీరీస్ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

రాజా వర్ధన్ రవి వర్మ అలియాస్ రవి వర్మ (వేణు) ఒంటరిగా పెద్ద బంగ్లాలో కేవలం తన భార్యతో కలిసి ఉంటాడు. అనుకోకుండా ఒక నైట్ మాయ (అవంతిక) వర్షం కారణంగా అతని ఇంట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత యూట్యూబర్ సవారి (వెంకటేష్) కూడా ఆ ఇంట్లోకి వెళ్తాడు. అంతకుముందే అక్కడ దెయ్యాల మిట్ట అనే ప్లేస్ గురించి తెలుసుకున్న సవారి. ఘోస్ట్ హంటర్ వీడియోస్ చేసే యూట్యూబర్ గా తన ప్రయత్నం చేయగా నిజంగానే తనకు దెయ్యం కనబడటంతో రవి వర్మ ఇంటికి వస్తాడు. రవి వర్మ ఇంట్లో మాయ, సవారి ఏం చేశారు. వీరిద్దరేనా ఇంకా ఎవరైనా ఆ ఇంట్లోకి వచ్చారా. భార్యతో ఒంటరిగా ఉంటున్న రవి వర్మ గతం ఏంటి..? అసలు ఆయన ఎవరు..? అక్కడ అతని దగ్గరే ఉన్న దెయ్యాల మిట్ట గురించి అతనికి తెలియదా అసలు రవి వర్మ ఎవరు అన్నది వెబ్ సీరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

కథనం విశ్లేషణ :

ఒక పెద్ద బంగ్లా దానికి కాపలాగా ఒక మనిషి. అందులోకి అనుకోకుండా కొందరు వ్యక్తులు రావడం అక్కడ జరిగే వింతలు విశేషాలను చూసి కొంత కామెడీ కొంత సస్పెన్స్ హార్రర్ ఎఫెక్ట్స్ తో చూపించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. ఇలాంటి కథలు వెబ్ సీరీస్ గా తీయాలంటే మాత్రం కొద్దిగా ఆలోచించాలి. అతిధి వెబ్ సీరీస్ కూడా దాదాపు పైన చెప్పిన భూత్ బంగ్లా కథల్లాంటి కథతోనే తెరకెక్కించారు

అతిధి వెబ్ సీరీస్ ఆరు ఎపిసోడ్ లు ఒక్కొక్కటి 30 నిమిషాల నిడివితో అంటే దాదాపు 3 గంటల రన్ టైం తో వచ్చింది. సినిమాగా తీయాలనుకుని వెబ్ సీరీస్ గా వదిలారో ఏమో కానీ ఈ వెబ్ సీరీస్ ఎపిసోడ్ ఎపిసోడ్ మధ్య కంటిన్యుటీ జర్క్ అనిపిస్తుంది. జరుగుతున్న కథని మధ్యలోనే ఆపి మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలన్నట్టుగా ఎడిట్ చేశారు.

ఇక వెబ్ సీరీస్ ఆరు ఎపిసోడ్స్ అయితే మొదటి 3 ఎపిసోడ్స్ చాలా స్లోగా నడిచినట్టు అనిపిస్తాయి. మధ్యలో వెంకటేష్ కామెడీ అక్కడక్కడ పర్వాలేదు అనిపించినా ఎప్పుడైతే ఫోర్త్ ఎపిసోడ్ మొదలవుతుందో అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. నాల్గవ ఎపిసోడ్, ఐదో ఎపిసోడ్ రెండు అతిధి వెబ్ సీరీస్ కు ఆయువుపట్టు లాంటివి. ఈ ఎపిసోడ్స్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇక ఫైనల్ ఎపిసోడ్ కూడా రాజులు వెన్నుపోటు అంటూ రొటీన్ కథే చెప్పాడు. అయితే క్లైమాక్స్ లో రాజుల ఫ్లాష్ బ్యాక్ ముగిశాక రవి వర్మ చెప్పే డైలాగులు ఆడియన్స్ ని ఆలోచింపచేస్తాయి.

కథనంలో నెమ్మదనం అనిపించింది. ఓపెనింగ్ సీన్ తోనే హైప్ పెంచిన డైరెక్టర్ అలా సీరీస్ మొత్తం ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అవ్వలేదు. పాత్రలు పాత్రధారులు అంతా కూడా వెబ్ సీరీస్ కు తగినట్టుగా చేశారు. వేణుకి ఈ సీరీస్ మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. సీరీస్ మొత్తం వేణు చాలా సెటిల్డ్ గా అతని పాత్రకు న్యాయం చేశాడు. వేణు నుంచి ఇలాంటి సీరీస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. వెబ్ సీరీస్ మొత్తం ఒక బంగ్లా లోనే కానిచ్చేశారు. 3 గంటలు ఒకే లొకేషన్ అయినా కూడా ఆడియన్స్ కు బాగానే అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో మెయిన్ లీడ్ చెప్పే కామ క్రోధ లోభ మద మోహ మాశ్చర్యాల డైలాగ్ ఆడియన్స్ ను టచ్ చేస్తుంది. అతిధి కథను కొనసాగించే అవకాశం ఉందని అతిధి ఆరో ఎపిసోడ్ లో ముగింపు ముందు ఒక హింట్ ఇస్తారు మేకర్స్.

నటీనటులు :

రాజా రవి వర్మ పాత్రలో వేణు మెప్పించారు. ముఖ్యంగా బ్లాక్ డ్రెస్ లో సెటిల్డ్ పఫార్మెన్స్ లో వేణు అదరగొట్టారు. కథ ఎక్కడో మొదలై ఎక్కడో ఎండ్ అవుతుంది. అసలు సూత్రధారి తనే అన్నది చివర వరకు గానీ తెలియదు. ఇలాంటి పాత్రలో వేణుని చూడటం మొదటిసారి అందుకే ఆడియన్స్ అంతా కూడా వేణు ని ఇలా చూసి ఎంటర్టైన్ అవుతున్నారు. ఇక అవంతిక మాయ పాత్రలో మెప్పించింది. ఈ క్యారెక్టర్ కు కావాల్సిన పెద్ద కళ్ళతో ఆమె మెప్పించింది. రవివర్మ, వెంకటేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. వెంకటేష్ కామెడీ ప్రయత్నించాడు కానీ అక్కడక్కడ మాత్రమే వర్క్ అవుట్ అయ్యింది. అదితి గౌతం కనిపించినంత సేపు తన పరిధి మేరకు నటించి మెప్పించింది. మిగతా పాత్రదారులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం :

ఈ వెబ్ సీరీస్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. షూటింగ్ మొత్తం దాదాపుగా బంగ్లాలోనే కాబట్టి ఎక్కువ కలర్స్ కాకుండా ఉన్నంతలో బాగా తీశాడు కెమెరా మెన్. ఇక మ్యూజిక్ కూడా బాగానే అనిపిస్తుంది. థ్రిల్లర్ జోనర్ సినిమాలకు మ్యూజిక్ కూడా సహకరిస్తుంది. అతిధికి మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ముందు హర్రర్ జోనర్ గా మొదలై క్రైం థ్రిల్లర్ గా టర్న్ తీసుకుని రివెంజ్ గా మారి ఫైనల్ గా ముగింపు ఇచ్చాడు డైరెక్టర్. భరత్ వై జి దర్శకత్వం మెప్పించేలా ఉంది. అయితే మొదటి 3 ఎపిసోడ్స్ లో కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సీరీస్ ను ప్రెజెంట్ చేశారు. సినిమాలో ఆయన భాగమవడం ఆయన హ్యాండ్ కూడా సీరీస్ కు హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.

చివరగా :

అతిధి.. వేణు వరల్డ్.. కొంత బోరింగ్.. కొంత ఎంటర్టైనింగ్..!