రాజమౌళికి పోటీనా?.. ఇది మరీ టూ మచ్ గా లేదూ..!
అయితే ఇప్పుడిప్పుడే ఆయన రికార్డులు బ్రేక్ చేయడానికి మరికొందరు డైరెక్టర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో అట్లీ కూడా ఉన్నారు.
By: Tupaki Desk | 21 Dec 2024 3:15 AM GMTవెండితెర మీద విజువల్ వండర్స్ క్రియేట్ చేసే దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. తెలుగు సినిమాకి పాన్ ఇండియా మార్కెట్ ను ఓపెన్ చేయడమే కాదు, ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లిన దర్శకుడాయన. వందేళ్ల భారతీయ చిత్ర పరిశ్రమకు కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టారు. రెండుసార్లు 1000 కోట్ల క్లబ్ లో చేరిన డైరెక్టర్ గా నిలిచారు. మాస్టర్ స్టోరీ టెల్లర్, దర్శక ధీరుడు అనిపించుకున్న జక్కన్న.. రికార్డుల పరంగా ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆయన రికార్డులు బ్రేక్ చేయడానికి మరికొందరు డైరెక్టర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో అట్లీ కూడా ఉన్నారు.
కోలీవుడ్ డైరెక్టర్ 'రాజా రాణి', 'పోలీసోడు', 'అదిరింది', 'విజిల్' వంటి తమిళ సినిమాలతో మంచి విజయాలు సాధించారు. ఇక గతేడాది బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో తెరకెక్కించిన 'జవాన్' మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల వరకూ రాబట్టింది. దీంతో అతని నెక్స్ట్ మూవీపై అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఏడాది దాటిపోయినా అట్లీ తదుపరి ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఎలాంటి సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు? ఏ బిగ్ హీరోతో చేస్తారు? అనేది తెలియలేదు. కానీ ఎప్పుడొచ్చినా తన నెక్ట్స్ మూవీ అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఉంటుందని చెబుతున్నారు. ఇక అప్పటి నుంచి అట్లీ ఈసారి రాజమౌళికి ఛాలెంజ్ విసిరే సినిమాతో రాబోతున్నట్లు తమిళ తంబీలు హడావిడి చేయడం మొదలుపెట్టేసారు.
అట్లీ తన నెక్స్ట్ మూవీని పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేదా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ హీరోలతో సినిమా ఉంటుందని చాలా కాలంగా ఇండస్ట్రీల్లో టాక్ నడిచింది. కానీ వారిద్దరూ ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. దీంతో ఏ హీరోతో చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి స్టార్ క్యాస్టింగ్ తో పాటుగా హాలీవుడ్ టెక్నిషియన్స్ ని తమిళ దర్శకుడు తన సినిమాలో భాగం చేయబోతున్నారని అంటున్నారు. ఈ సినిమాతో రాజమౌళి రికార్డులు కూడా బ్రేక్ అయిపోతాయని తమిళ సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి రాజమౌళిని బీట్ చేయడానికి, ఆయన రికార్డులను బ్రేక్ చేయడానికి గత ఏడేళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 'కేజీఎఫ్ 2' సినిమాతో ప్రశాంత్ నీల్.. 'పఠాన్' మూవీతో సిద్దార్థ్ ఆనంద్.. 'కల్కి 2898 ఏడీ'తో టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరారు కానీ, 'బాహుబలి 2' రికార్డ్స్ కు దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు. 'జవాన్' సినిమాతో అట్లీ కూడా అధిగమించలేకపోయారు. చైనా వసూళ్లతో కలుపుకొని నితీష్ కుమార్ 'దంగల్' తో క్రాస్ చేసారు కానీ.. డొమెస్టిక్ మార్కెట్ లో టచ్ చేయలేకపోయారు. లేటెస్టుగా 'పుష్ప 2' సినిమాతో డైరెక్టర్ సుకుమార్ 1500 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఇది ఎక్కడిదాకా వెళ్తుందనేది చూడాలి.
ఒకవేళ సుకుమార్ లేదా అట్లీ లాంటి దర్శకులు ఇప్పుడు రాజమౌళి రికార్డులను బీట్ చేసినా.. ఆయన క్రేజ్ ను అందుకోవడం ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాదని అభిమానులు అంటున్నారు. డైరెక్టర్ గా జక్కన్న తనకంటూ సొంతంగా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన పేరు మీదుగానే సినిమాకి టికెట్లు అమ్ముడయ్యే పరిస్థితి ఉంది. కానీ ఆ విషయంలో మిగతా దర్శకులు ఎవరూ కూడా సక్సెస్ అవ్వలేదు. RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి ఓ గ్లోబ్ ట్రాటింగ్ సినిమా చేయబోతున్నారు. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. పాన్ ఇంటర్నేషనల్ లెవల్ లో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో రాజమౌళి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే రాజమౌళితో కంపేరిజన్స్ సరికాదని, ఆయన్ని అందుకోడానికి ఇతర దర్శకులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలని ఫ్యాన్స్ అంటున్నారు.