సల్మాన్‌తో అట్లీ సినిమా ఆగిపోయిందా?
మురుగదాస్ తర్వాత సల్మాన్ మరో బ్లాక్ బస్టర్ దర్శకుడు అట్లీతో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
By: Tupaki Desk | 20 Feb 2025 10:30 AM GMTకేవలం ఐదు సినిమాలతో 1000 కోట్ల క్లబ్ దర్శకుడిగా నిరూపించాడు అట్లీ. దళపతి విజయ్‌తో వరుస సినిమాలను రూపొందించి బ్లాక్ బస్టర్లు అందుకున్న అట్లీ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ తో 1000 కోట్ల క్లబ్ సినిమాని అందించాడు. షారూఖ్- అట్లీ కాంబినేషన్ లోని జవాన్ సంచలన విజయం సాధించాక, అతడి దృష్టి సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్ వంటి పెద్ద స్టార్లపైనే ఉంది.
మురుగదాస్ తర్వాత సల్మాన్ మరో బ్లాక్ బస్టర్ దర్శకుడు అట్లీతో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఫక్తు కమర్షియల్ ఫార్ములాతో మాస్ లో మ్యాసివ్ హిట్స్ అందించగల అట్లీని సల్మాన్ బలంగా నమ్ముతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా(ఏ 6 వర్కింగ్ టైటిల్) కి స్క్రిప్టు సిద్ధమైంది. కాస్టింగ్ ఎంపికలు సాగుతున్నాయి. ఇంతలోనే ఈ చిత్రం రకరకాల కారణాలతో ఆగిపోయిందని ప్రచారమవుతోంది. నిజానికి ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు తమిళ ఇండస్ట్రీ దిగ్గజ హీరోలైన రజనీకాంత్ లేదా కమల్ హాసన్ కీలక పాత్రను పోషించాలని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భావిస్తోంది. దీనికోసం ఏకంగా 500 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తోందని కథనాలొచ్చాయి. బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ తో కోలీవుడ్ స్టార్ హీరోని కలపడం ద్వారా పాన్ ఇండియాలో సంచలన విజయం సాధించాలన్నదే సన్ పిక్చర్స్ ప్లాన్. కానీ రజనీ, కమల్ హాసన్ కాల్షీట్లను దక్కించుకోవడం అంత సులువు కాదు. ఆ ఇద్దరితో చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిలిపేస్తోందని కథనాలొస్తున్నాయి.
తాజాగా అందిన సమాచారం మేరకు.. రజనీ లేదా కమల్ హాసన్ తో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆ పాత్రను రీడిజైన్ చేసి విల్ స్మిత్ లాంటి హాలీవుడ్ హీరోని బరిలో దించాలని అట్లీ భావిస్తున్నాడు. విల్ స్మిత్ ని సంప్రదించేందుకు సల్మాన్ ఖాన్ తనవంతు సహకారం అందించాడు. ఇటీవల మంతనాలు సాగించారు. విల్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని సోర్స్ చెబుతోంది. ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు సల్మాన్ చేయాల్సినదంతా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా ప్రాజెక్ట్ నిలిచిపోలేదని కూడా తెలుస్తోంది. అయితే దక్షిణాది స్టార్‌లు లేని అంతర్జాతీయ చిత్రం నిర్మించేందుకు సన్ పిక్చర్స్ ఇష్టపడలేదు.. దాంతో అట్లీ రీవర్క్ చేస్తున్నాడని కూడా గుసగుసలు వినిపించాయి.
ప్రస్తతం అట్లీ - సల్మాన్ చర్చలు కొనసాగిస్తున్నారు. సన్ పిక్చర్స్‌తో అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. రెండు పవర్ హౌస్‌లు కలిసి ఈ సినిమా చేయాలని కోరుకుంటున్నాయి. మార్చి చివరి నాటికి సల్మాన్‌తో A6 ఉంటుందా లేదా? అన్నదానిపై పూర్తి క్లారిటీ వస్తుంది. షారూఖ్ కి బ్లాక్ బస్టర్ అందించిన అట్లీపై సల్మాన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందువల్ల ఈ ప్రాజెక్ట్ రద్దు కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం.. ఒక దక్షిణాది అగ్ర హీరో నటిస్తాడా? లేక హాలీవుడ్ స్టార్ విల్ స్మత్ ని నటింపజేస్తారా?