'జవాన్'.. ఆస్కార్ రేంజ్ సీన్ ఉందా?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన 'జవాన్' చిత్రం ఆస్కార్‌కు వెళ్లాలని ఆశిస్తున్నట్లు తన మనసులోని కోరికను బయటపెట్టారు
By: Tupaki Desk | 19 Sep 2023 6:22 AM GMT'జవాన్' చిత్రంతో గ్రాండ్‌గా బాలీవుడ్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు కోలీవుడ్ దర్శకుడు అట్లీ. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు అందుకుంటూ రూ. 1000 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడీ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ వరకు తీసుకెళ్లాలని డైరెక్టర్ అట్లీ ఆశ పడుతున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన 'జవాన్' చిత్రం ఆస్కార్‌కు వెళ్లాలని ఆశిస్తున్నట్లు తన మనసులోని కోరికను బయటపెట్టారు. షారుక్తోనూ ఈ విషయమై మాట్లాడాతానని అన్నాడు. అయితే ఓ సినిమా భారీ స్థాయిలో హిట్ అందుకుంటే.. అఫ్ కోర్స్ ఏ దర్శకుడైన ఇలా ఆలోచించడం మాములే.. కాబట్టి.. అట్లీ కూడా ఆస్కార్ కల కనడంలో తప్పేమీ లేదు.. కానీ తన జవాన్ సినిమాకు ఆ స్థాయికి వెళ్లే అర్హత ఉందా లేదా? అనేది ముందుగా ఆలోచించుకోవాలి.
ఎందుకంటే 'జవాన్' ఓ పక్కా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రం సొసైటీలోని తప్పులను ఎత్తి చూపిస్తూ, వాటిని సరిద్దిదే ఓ సాధరణ వ్యక్తి ఎమోషనల్ జర్నీగా సాగుతుంది. సామాజిక, రాజకీయ అంశాలను నొక్కి చెబుతూ ఒక నార్మల్ పక్కా కమర్షియల్‌గా తీర్చిదిద్దారు.
ఈ కథలో కొత్తదనం కూడా లేదు. కొన్ని దక్షిణాది సినిమాల కలయికే జవాన్ అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. మరి ఇలాంటి అట్లీ ఆస్కార్ అభ్యర్థనను షారుక్ పరిగణిస్తారా? ఒకవేళ పరిగణించినా ఈ సినిమాకు ఆ రేంజ్ సత్తా లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఇకపోతే ఆస్కార్ అవార్డును.. ప్రపంచ చలన చిత్ర రంగంలోనే అత్యున్నత ప్రతిష్టాత్మక అవార్డుగా అంటుంటారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రతిఒక్కరూ దీని ఒక్కసారైనా అందుకోవాలని కలలు కంటారు. అయితే దర్శకధీరుడు రాజమౌళి.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తన ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా ఆస్కార్ కలను సాకారం చేశారు. మన చిత్రాలు కూడా అకాడెమీ అవార్డులను ముద్దాడొచ్చనే భరోసాను ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అట్లీ జవాన్ ఆస్కార్ స్టేట్మెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గామారింది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.