5 రూపాయలతో మొదలైన ప్రయాణం 87 వరకూ!
సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు సుపరిచితమే. నవ భారత్ ఫిలింస్ పై ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన లెజెండరీ ప్రొడ్యూసర్
By: Tupaki Desk | 20 Feb 2024 4:03 PM GMTసీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు సుపరిచితమే. నవ భారత్ ఫిలింస్ పై ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన లెజెండరీ ప్రొడ్యూసర్. బ్లాక్ అండ్ వైట్ కాలంలో పేరొందిన ప్రముఖ నిర్మాత ఆయన. నిర్మాతగా ఆయన తొలి సినిమా 'అగ్గిమీద గుగ్గిలం'. కాంతారావు..రాజశ్రీ జంటగా నటించిన చిత్రమిది. జి.విశ్వనాధం ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది.
ఆ తర్వాత నిర్మాతగా ఆయన ప్రయాణం సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. 'అపాయంలో ఉపా యం'..'ఉక్కు పిడుగు'..'గజదొంగ గంగన్న'..'మాతృదేవత'.. 'రైతు కుటుంబం'..'పాపం పసివాడు'..'ప్రేమ పుస్తకం' లాంటి ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించి నిర్మాతగా ప్రత్యేకమైన ముద్ర వేసారు. ఇక నిర్మాత రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అట్లూరి పూర్ణ చంద్రరావు కర్ణాటకలోని మడికెరీలో స్థిరపడ్డారు.
ప్రస్తుతం ఆయన అక్కడ హోటల్ బిజినెస్ రంగంలో కొనసాగుతున్నారు. అయితే ఆయన వారసత్వం ఇండస్ట్రీలో కొనసాగలేదు. పిల్లలు వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అట్లూరి నిర్మాతగా కెరీర్ ఆరంభంలో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. ఆవేంటో ఆయన మాటల్లోనే...'కెరియర్ ఆరంభంలో ఎదురైన కొన్ని పరిస్థితుల కారణంగా నేను సొంత బ్యానర్లో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. తొలిసారి నేను కాంతారావు హీరోగా 'అగ్గిమీద గుగ్గిలం' సినిమాతో నిర్మాతగా మారాను.
ఆ సినిమా తీయాలనుకున్న సమయానికి నా దగ్గర ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ ఐదు రూపాయలతో పూజా కార్యక్రమాలు చేసాను. చేతిలో డబ్బు లేదు. దీంతో చిత్రీకరణ ప్రారంభానికి ముందే దర్శకుడితో పాటు హీరో హీరోయిన్లను మిగతా నటీనటులు..సాంతికేతిక నిపుణుల్ని అందర్నీ దగ్గరకు పిలిచి 'మీకు ఇప్పుడు అడ్వాన్స్ గా ఏమీ ఇవ్వలేను. మీ పారితోషికాలు ఎంత అనేది ఒక కాగితంపై రాసి కవర్లో పెట్టి ఇవ్వండి.
సినిమా పూర్తయిన తరువాత మీకు డబ్బు ఇస్తాను. ఆ తరువాతనే రిలీజ్ చేసుకుంటాను అన్నాను . నా కండీషన కి వాళ్లు ఒప్పుకుని పనిచేసారు. ఇచ్చిన మా మాట ప్రకారం వారి పారితోషికాలు రిలీజ్ కి ముందే చెల్లించాను. ఆ తరువాత 9 భాషల్లో 87 సినిమాలను నిర్మించాను' అని అన్నారు.