Begin typing your search above and press return to search.

బాలయ్యతో గొడవ గురించి జూ.ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

నిజానికి బాబాయ్ - అబ్బాయ్ ఇద్దరూ గతంలో అనేక సందర్భాల్లో ఒకరి మీద ఒకరికున్న అనుబంధాన్ని చాటుకున్నారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 4:43 PM GMT
బాలయ్యతో గొడవ గురించి జూ.ఎన్టీఆర్ ఏమన్నాడంటే?
X

నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ నందమూరి ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే బాలయ్య, తారక్ ల మధ్య విభేదాలు ఉన్నాయంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో వారి మధ్య దూరం బాగా పెరిగిందనే రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కారణాలు ఏవైనా ఈ మధ్యకాలంలో బాబాయ్ - అబ్బాయ్ కలిసి ఒకే వేదికను పంచుకోకపోవడం కూడా ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో గతంలో బాబాయ్ తో విభేదాల గురించి ఎన్టీఆర్ మాట్లాడిన ఓ ఓల్డ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

'నాన్నకు ప్రేమతో' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, జగపతిబాబు కలిసి యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూ చేసారు. ఈ సందర్భంగా బాలకృష్ణతో గ్యాప్ రావడం గురించి తాను అడిగితే తారక్ ఏమన్నాడు అనేది జగపతిబాబు వివరించారు. ''అసలు బాలయ్యది మీది ఏంటి ఇష్యూ అని నేను తారక్ ని అడిగాను. అది కరెక్ట్ కాదు కదా.. కలిసుంటే బాగుంటుంది కదా అనే జెన్యూన్ ఫీలింగ్ తోనే అడిగాను. దానికి ఎన్టీఆర్ క్లియర్ గా నాకు ఒకటే చెప్పాడు. 'నాకేంటి ఆయనతో ప్రాబ్లమ్ బాబు. నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. అసలు ప్రాబ్లం ఏంటి అనేది నాక్కూడా తెలీదు. ఆయన మా నాన్నకు బ్రదర్. నాకు తండ్రి లాంటి వారు. అలాంటిది ఆయనతో నాకేం గొడవ ఉంటుంది. నేనెందుకు మనసులో పెట్టుకుంటాను. ఎప్పటికైనా నేను ఏ విషయంలోనైనా ఓపెన్‌గానే ఉంటాను' అని తారక్ నాతో అన్నాడు'' అని జగపతిబాబు తెలిపారు.

బాలయ్య గురించి జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మాట కూడా ఎక్కువగా మాట్లాడలేదని, ఇది అందరికీ తెలియాలనే చెప్తున్నానని జగపతి బాబు అన్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న తారక్ నవ్వుతూ సైలెంట్ గా జగపతిబాబు చెప్పే మాటలు వింటూ ఉన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబాయ్ తో అబ్బాయ్ కి ఎలాంటి సమస్య లేదనే దానికి ఇదే ఉదాహరణ అని నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బాలకృష్ణను తారక్ తన మనసులో తండ్రి స్థానంలో ఉంచారని, అలాంటిది ఆయనతో గొడవలు ఉన్నాయని అనుకోవడం పొరపాటు అవుతుందని మరికొందరు అంటున్నారు.

నిజానికి బాబాయ్ - అబ్బాయ్ ఇద్దరూ గతంలో అనేక సందర్భాల్లో ఒకరి మీద ఒకరికున్న అనుబంధాన్ని చాటుకున్నారు. అయితే టీడీపీ అధిష్టానం ఎన్టీఆర్ ని దూరం పెడుతూ రావడం.. ఎన్టీఆర్ కూడా రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయేమో అనే అనుమానాలు రేకెత్తాయి. తారక్ పొలిటికల్ ఎంట్రీపై అప్పట్లో బాలయ్య మాట్లాడుతూ "ఎన్టీఆర్ కు భవిష్యత్తు చాలా ఉంది. ఫుల్ టైం రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం. వృత్తిని వదులుకుని రాజకీయాల్లోకి రమ్మని అడగలేం కదా. నేను సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చాను. నాన్నగారు కూడా ముఖ్యమంత్రిగా ఉంటూనే సినిమాలు చేశారు" అని అన్నారు. మరో సందర్భంలో ఎన్టీఆర్ ఎంట్రీ టీడీపీకి ప్లస్ అవ్వచ్చు. మైనస్ అవ్వచ్చు. ప్లస్ అయ్యి మైనస్ అవ్వొచ్చు. మైనస్ అయ్యి ప్లస్ అవ్వొచ్చు అంటూ వ్యాఖ్యానించారు.

అప్పటి నుంచి ఏదొక సందర్భంలో వీరి మధ్య గ్యాప్ వచ్చిందేమో అనే అనుమాలు రేకెత్తేలా వ్యవహరిస్తూ వచ్చారు. నందమూరి ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్స్ లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కనిపించడం తగ్గిపోయింది. ఈ ఏడాది జనవరిలో సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్‌ వద్ద తారక్ ఫ్లెక్సీలను తొలగించడం వివాదంగా మారింది. బాలయ్య చెబితేనే ఫ్లెక్సీలు తొలగించారనే ప్రచారం జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాములో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళకపోవడం బాలకృష్ణకు ఆగ్రహం తెప్పించినట్లు వార్తలు వచ్చాయి.

అలానే చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై ఎన్టీఆర్‌ స్పందించక పోవడంపై బాలకృష్ణ డోండ్‌ కేర్ అని కామెంట్స్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా నడిచింది. ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలకు తారక్ వెళ్ళకపోవడం, బాలయ్య 50 వసంతాల సినీ సన్మాన కార్యక్రమంలో కనిపించకపోవడం వంటివి బాబాయ్ - అబ్బాయ్ ల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా నందమూరి ఫ్యామిలీ అంతా కలిసే ఉండాలని కోరుకుంటున్నారు.