సైఫ్ ఖాన్‌పై కత్తి దాడి..షాక్‌లో ఎన్టీఆర్
ఈ బుధవారం తెల్లవారుఝామున బాంద్రాలోని తన ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన దుండగుడు సైఫ్ ఖాన్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడని మీడియాలో కథనాలొచ్చాయి.
By: Tupaki Desk | 16 Jan 2025 5:50 AM GMTప్రభాస్ తో 'ఆదిపురుష్'.. ఎన్టీఆర్ తో 'దేవర' చిత్రాల్లో నటించారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. ఈ బుధవారం తెల్లవారుఝామున బాంద్రాలోని తన ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన దుండగుడు సైఫ్ ఖాన్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడని మీడియాలో కథనాలొచ్చాయి. సైఫ్ పై అతడు విచక్షణా రహితంగా దాడి చేయడంతో పలుచోట్ల లోతైన గాయాలయ్యాయి. సైఫ్ శస్త్రచికత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతానికి సైఫ్ సురక్షితంగానే ఉన్నాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
తాజాగా తన దేవర సహనటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి గురించి విన్న దేవర కోస్టార్ ఎన్టీఆర్ షాక్ కి గురయ్యానని అన్నారు. ఘటనపై ఆందోళన వ్యక్తం చేసారు. ''సైఫ్ సర్ పై జరిగిన దాడి గురించి విని షాక్ అయ్యాను .. బాధపడ్డాను. సైఫ్ సర్ త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యవంతుడు కావాలని కోరుకుంటున్నాను ..ప్రార్థిస్తున్నాను'' అని ఎన్టీఆర్ ఎక్స్ లో రాసారు.
గుర్తు తెలియని దుండగుడి దాడిలో సైఫ్‌పై అనేక కత్తిపోట్లు పడ్డాయి. వాటిలో రెండు లోతైనవి. వెన్నెముకకు దగ్గరగా ప్రమాదకర గాయమైందని తెలుస్తోంది. లీలావతి ఆస్పత్రి న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే నేతృత్వంలోని వైద్యుల బృందం అతడి గాయాలకు శస్త్రచికిత్స చేస్తోంది. ముంబై పోలీసులు ఈ కేసును చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు, దొంగలకు సహాయం చేసిన వారి గురించి ఆరాలు తీస్తున్నారు.
తన 'ఓంకార' సినిమా చూసి తారక్ జీ, శివ సర్ 'దేవర'లో అవకాశం ఇచ్చారని భావిస్తున్నానని గతంలో సైఫ్ ఖాన్ దేవర ప్రచార సభలో అన్నారు. ఎన్టీఆర్, కొరటాలపై తన ప్రేమాభిమానాలను చాటుకున్నాడు. సైఫ్ తదుపరి జైదీప్ అహ్లవత్ తో పాటు 'జ్యువెల్ థీఫ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది త్వరలో విడుదల కానుంది.