ఐమాక్స్ టాప్-10 లిస్ట్.. ఆడియెన్స్ టేస్టే మారింది
నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర ఉండే ప్రసాద్స్ ఐమాక్స్ అంటే నగరంలో తెలియనివారు ఎవరూ ఉండరు.
By: Tupaki Desk | 2 Jan 2024 4:53 AM GMTహైదరాబాద్ లో సినిమా థియేటర్లకు కొదవ లేదు. నగర వ్యాప్తంగా ఎన్నో థియేటర్లు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్ లు చాలా ఉన్నాయి. పీవీఆర్, ఐనాక్స్ లాంటి థియేటర్లు చాలా ఉండగా.. హైదరాబాద్‌లో ప్రసాద్స్ ఐమాక్స్ మాత్రం ఫుల్ పాపులర్. నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర ఉండే ప్రసాద్స్ ఐమాక్స్ అంటే నగరంలో తెలియనివారు ఎవరూ ఉండరు.
అంతలా ఈ ఐమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హైదరాబాద్ లో ఎన్ని థియేటర్స్ ఉన్నా ఎప్పట్నుంచో ఉన్న మల్టీప్లెక్స్ కావడంతో ఇక్కడ సినిమా చూసేందుకు సినీ ప్రియులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ప్రసాద్ ఐమాక్స్ టీమ్ 2023లో టికెట్ల అమ్మకాల పరంగా టాప్-10 చిత్రాల లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఆ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రసాద్ ఐమాక్స్ టీమ్ విడుదల చేసిన లిస్ట్ లో టాప్ ప్లేస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ నిలిచింది. ఇది బాగానే ఉంది కానీ సెకెండ్ ప్లేస్ లో ఉన్న సినిమా కోసమే ఇప్పుడు చర్చంతా. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్‌హైమర్ మూవీ సెకెండ్ ప్లేస్ లో నిలిచింది. అణుబాంబును కనిపెట్టిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
మూడు, నాలుగు స్థానాల్లో బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, రణ్ బీర్ కపూర్ ల జవాన్, యానిమల్ చిత్రాలు నిలిచాయి. హైదరాబాద్ ప్రేక్షకులు వాటి తెలుగు డబ్బింగ్ వెర్షన్ కంటే ఒరిజినల్ హిందీ వెర్షన్‌ను ఎక్కువగా చూశారు. ఆ తర్వాత స్థానాల్లో ఆదిపురుష్, దసరా, మిషన్ ఇంపాజిబుల్, విరూపాక్ష, జైలర్, హాయ్ నాన్న చిత్రాలు ఉన్నాయి.
అయితే ఈ టాప్-10 లిస్ట్ లో సలార్ మినహా మొదటి నాలుగు స్థానాల్లో మూడు వేరే భాషా చిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ మూవీ ఓపన్ హైమర్ తెలుగు హిట్ చిత్రాలను వెనక్కి నెట్టి మరీ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. దీని ప్రకారం చూస్తే.. ఇప్పుడు సినీ ప్రియుల మైండ్ సెట్ మారినట్లు మరోసారి నిరూపితమైంది. సినిమా కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా బ్రహ్మరథం పడుతున్నారు.
ఇక సినీపండితులు.. ఈ లిస్ట్ పై స్పందిస్తున్నారు. తెలుగు చిత్రనిర్మాతలు తమ సినిమా నిర్మాణ స్థాయిని మరింత పెంచాలని సూచిస్తున్నారు. మరొక అడుగు ముందుకు వేయాలని చెబుతున్నారు. హైదరాబాద్ ప్రేక్షకులను అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కంటెంట్ ను అందించాలని అంటున్నారు. సినీ నిర్మాణ ప్రమాణాలను పెంచుకోవాలని పిలుపునిస్తున్నారు.