విఠలాచార్య సినిమాలా 'అవతార్- 3'
అవతార్ ఫ్రాంఛైజీలో అవతార్ 1, అవతార్ 2 విడుదలై బిలియన్ డాలర్ వసూళ్లతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 March 2025 2:00 AM ISTఅవతార్ ఫ్రాంఛైజీలో అవతార్ 1, అవతార్ 2 విడుదలై బిలియన్ డాలర్ వసూళ్లతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అవతార్ తో పోలిస్తే అవతార్ 2 ఆశించినంత వసూలు చేయకపోయినా, కలెక్షన్ల పరంగా కొదవేమీ లేదు. ఇప్పుడు అవతార్ 3 ఎప్పుడు విడుదలవుతుందా? అంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వేచి చూస్తున్నారు.
దర్శకనిర్మాత జేమ్స్ కామెరూన్ తాజాగా అవతార్ 3 గురించి కొత్త అప్ డేట్ అందించారు. `అవతార్: ఫైర్ అండ్ యాష్`(అవతార్ 3) రన్ టైమ్ చాలా సుదీర్ఘంగా ఉంటుందని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న అవతార్ 3 రన్ టైమ్ రెండో భాగం కంటే ఎక్కువగా ఉంటుందని ధృవీకరించారు. అవతార్: ఫైర్ అండ్ యాష్ 3 గంటల 12 ని.ల రన్‌టైమ్ ఉన్న `అవతార్: ది వే ఆఫ్ వాటర్` కంటే ఎక్కువ నిడివి ఉంటుందని జేమ్స్ కామెరూన్ ధృవీకరించారు. దీనిని బట్టి ఇది కచ్ఛితంగా మూడున్నర గంటల నిడివితో వస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఎంపైర్ మ్యాగజైన్‌తో కామెరూన్ మాట్లాడుతూ- మూడవ భాగాన్ని పొడిగించాలనే నిర్ణయం క్రియేటర్ల సమాలోచనల కారణంగా జరిగిందని పేర్కొన్నారు. అవతార్ 2 ప్రథమార్థంతో కనెక్ట్ చేసే కొన్ని అంశాలకు సంబంధించి మాకు చాలా గొప్ప ఆలోచనలను జత చేసాము. నిడివి పెరగడానికి కారణమిదేనని కామెరూన్ తెలిపారు. నిడివి ఎక్కువ ఉన్నా సినిమా స్లోగా సాగదు. సినిమా బుల్లెట్ రైలు లాగా కదులుతుంది. కానీ పాత్రలకు తగినంత స్పేస్ కావాలి. అందుకే పార్ట్ 3 నిజానికి రెండో భాగం కంటే కొంచెం పొడవుగా ఉంటుంది! అని అన్నారు.
కామెరాన్ - రిక్ జాఫాతో కలిసి స్క్రిప్ట్ రాసిన అమండా సిల్వర్ `ఫైర్ అండ్ యాష్` అనేది `ది వే ఆఫ్ వాటర్` నుండి కనెక్టయిన పాత్రలతో ఒక ప్రత్యేక చిత్రం అని పేర్కొంది. ఎందుకంటే కథ కేవలం యాక్షన్, విజువలైజేషన్ ని మించి ఉంటుంది. సినిమాలో పాత్రలను మరింత లోతుగా తెరపై చూపడానికి స్పేస్ అవసరమని రచయిత అన్నారు. ఈ చిత్రం అవతార్ విశ్వానికి కొత్త అంశాలను పరిచయం చేస్తూ పాత్ర ప్రయాణాలను మరింత అభివృద్ధి చేస్తుందని కామెరాన్ కూడా అంగీకరించారు. ఒకప్పుడు తెలుగు సినిమా క్లాసిక్ డే దర్శకదిగ్గజం విఠలాచార్య సుదీర్ఘ నిడివి ఉన్న సినిమాలను తీసేవారు. ఆయన సినిమాలు సుమారు 2గంటల 45 నిమిషాలు ఉండేవి. ఇప్పుడు కామెరూన్ అంతకుమించిన నిడివితో సినిమాలు తీస్తున్నారు.
ఆగస్టు 2024లో `డిస్నీ D23 ఎక్స్‌పో` సందర్భంగా జేమ్స్ కామెరాన్ ఈ చిత్రం టైటిల్ ని ప్రకటించారు. కాన్సెప్ట్ ఆర్ట్‌ను ప్రదర్శించాడు. సామ్ వర్తింగ్టన్, జోయ్ సల్డానా జేక్ సల్లీ - నెయ్టిరి పాత్రలను తిరిగి పోషిస్తారు. అవతార్ 3 కథేంటో ఇప్పటివరకూ కామెరూన్ చెప్పనే లేదు. కానీ ఇది ఎగ్జయిట్ చేస్తుందని ప్రతిసారీ చెబుతున్నారు. అవతార్ 4, అవతార్ 5 సినిమాలు ఉన్నాయని కూడా ధృవీకరించాడు. తాను పూర్తిగా ఈ ప్రాజెక్టులకు అంకితమయ్యానని, బలవంతం చేస్తేనే ఆపేస్తానని పేర్కొన్నాడు.