'అవతార్- 3' కి పోటీగా ఇండియన్ స్టార్ బరిలోకి
అయితే ఈసారి క్రిస్మస్ బరిలోనే బాలీవుడ్ నుంచి పలు క్రేజీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
By: Tupaki Desk | 28 Jan 2025 12:30 PM GMTజేమ్స్ కామెరూన్ తెరకెక్కిస్తున్న 'అవతార్' ఫ్రాంఛైజీ నుంచి కొత్త సినిమా విడుదలవుతోంది అంటే, ప్రపంచం దృష్టి దానిపైనే ఉంటుంది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న ఫ్రాంఛైజీ ఇది. ముఖ్యంగా అవతార్ ఫ్రాంఛైజీ చిత్రాలకు భారతదేశంలోను భారీగా ఫాలోయింగ్ ఉంది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూసే ఫ్రాంఛైజీ ఇది. ఇక ఈ ఫ్రాంఛైజీ నుంచి అవతార్, అవతార్ 2 విడుదలై భారత దేశంలోను భారీ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కామెరూన్ మాట్లాడుతూ.. మునుపటి భాగాల కంటే అత్యంత భారీ యాక్షన్ తో అవతార్ 3 రక్తి కట్టిస్తుందని వెల్లడించారు. ఈ ప్రకటనతో సర్వత్రా ఉత్కంఠ మొదలైంది.
`అవతార్ 3` చిత్రం 2025 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 19న విడుదలవుతోంది. ఈసారి అవతార్ 3లో కొత్త రకం పాత్రలను చూస్తారని కామెరూన్ హింట్ ఇచ్చారు గనుక.. ఈ మూవీ కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మునుపటి భాగాల కంటే రెట్టింపు కాన్వాస్‌తో రూపొందిస్తున్నందున, మూడో భాగం కోసం మేకర్స్ లైట్‌స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ టిఎస్‌జి ఎంటర్‌టైన్‌మెంట్, ట్వంటీయత్ సెంచరీ స్టూడియోస్ (పంపిణీ) అత్యంత భారీ బడ్జెట్ ని వెచ్చించాయన్న టాక్ కూడా ఉంది.
అయితే ఈసారి క్రిస్మస్ బరిలోనే బాలీవుడ్ నుంచి పలు క్రేజీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో అమీర్ ఖాన్ నటించి నిర్మంచిన `సితారే జమీన్ పర్` ఒకటి. గత బ్లాక్ బస్టర్ మూవీ `తారే జమీన్ పర్`కి ఇది సీక్వెల్. ఈ మూవీపై అమీర్ ఖాన్ చాలా అంచనాలు పెట్టుకున్నాడు. డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా `తారే జమీన్ పర్`ని విడుదల చేస్తామని అమీర్ ఖాన్ ప్రకటించారు. అయితే ఇది ప్రధానంగా మాస్ ని ఆకర్షించే కంటెంట్ తో తెరకెక్కుతున్న మూవీ కాదు. పూర్తిగా ప్రయోగాత్మక కంటెంట్ తో వస్తోంది. అందువల్ల మాస్ ఫాలోయింగ్ ఉన్న అవతార్ 3 ముందు నిలబడడం కష్టమని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
ఇదే క్రిస్మస్ సీజన్‌లో బాలీవుడ్ నుంచి ఆలియా - శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన `ఆల్ఫా` విడుదలవుతోంది. డిసెంబర్ 25న ఈ స్పై థ్రిల్లర్ ను విడుదల చేస్తున్నామని యష్ రాజ్ ఫిలింస్ ప్రకటించింది. ఆల్ఫా కూడా భారీ క్రేజ్ తో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా. మొదటి సారి ఫ్రాంఛైజీలో లేడీ స్పై పాత్రలతో ఆలియా లాంటి క్రేజ్ ఉన్న స్టార్ తో ఈ సినిమాని తెరకెక్కించడంతో దీనిపైనా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అందువల్ల సితారే జమీన్ పర్ కి క్రిస్మస్ సీజన్ లో స్కోప్ లేదని కూడా విశ్లేషిస్తున్నారు. రెండు భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ సినిమాల తో ఇలాంటి క్లాసిక్ పోటీపడటం సరికాదని కూడా ట్రేడ్ భావిస్తోంది. అమీర్ ఖాన్ బాగా ఆలోచించి క్రిస్మస్ తర్వాత లేదా ముందు కనీసం 2,3 వారాల గ్యాప్ తో రిలీజ్ చేయడం సరైన నిర్ణయం అవుతుందని కూడా విశ్లేషిస్తున్నారు. కానీ అమీర్ ఖాన్ తన సినిమాని వాయిదా వేస్తారా లేదా? అన్నది వేచి చూడాలి. డిసెంబర్ నెల అంతా భారీ సినిమాలు విడుదలవుతున్నందున అమీర్ ఖాన్ ఆలోచన ఏమిటన్నది కూడా కాస్త ఆగి చూడాలి.