Begin typing your search above and press return to search.

కేన్స్‌లో చంద్ర‌బోస్ చ‌ల్ల‌గ‌రిగ‌కు అవార్డ్

2ఏప్రిల్ 2023న చంద్రబోస్ ఆస్కార్ అవార్డుతో తన గ్రామానికి వెళ్లినప్పుడు గ్రామం మొత్తం ఆనందడోలిక‌ల్లో మునిగిపోయింది

By:  Tupaki Desk   |   27 Dec 2023 6:28 PM GMT
కేన్స్‌లో చంద్ర‌బోస్ చ‌ల్ల‌గ‌రిగ‌కు అవార్డ్
X

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు చెందిన డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ చిల్కూరి సుశీల్ రావు నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం `ఆస్కార్ చల్లగరిగ`. గీత రచయిత కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ స్వస్థలమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చల్లగరిగ గ్రామంలో జరిగిన ఆస్కార్ విన్నింగ్ వేడుకలను ఈ డాక్యుమెంటరీలో ఆవిష్క‌రించారు.


ఈ సంవత్సరం 12 మార్చి 2023న అమెరికాలాస్ ఏంజిల్స్‌లోని హాలీవుడ్‌లోని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అందించే ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా లిరిసిస్ట్ చంద్రబోస్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని `నాటు నాటు` పాటకు చంద్రబోస్‌, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలకు అవార్డును అందజేశారు.

2ఏప్రిల్ 2023న చంద్రబోస్ ఆస్కార్ అవార్డుతో తన గ్రామానికి వెళ్లినప్పుడు గ్రామం మొత్తం ఆనందడోలిక‌ల్లో మునిగిపోయింది. వేడుకల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు నృత్యాలు చేశారు. పల్లెటూరి నుంచి ఆస్కార్ వేదిక వరకు తన ప్రయాణాన్ని ఈ సందర్భంగా చంద్రబోస్ గుర్తు చేసుకున్నారు. ఈ మొత్తం వేడుక‌ల జ్ఞాపిక‌గా ఆస్కార్ చ‌ల్ల‌గ‌రిగ ల‌ఘుచిత్రాన్ని రూపొందించారు.

కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌గా `ఆస్కార్ చల్లగరిగ` గెలుపొందడం గ‌ర్వ‌కార‌ణం. భారతదేశంలోని ఓ కుగ్రామంలో జరిగిన వేడుక ప్రపంచ దృష్టిని ఆకర్షించడం అద్భుతమైన విషయం. ఈ అవార్డు కేవలం చంద్రబోస్‌కే కాకుండా ఆయన గ్రామమైన చల్లగరిగకు దక్కిన నివాళి అని ద‌ర్శ‌కుడు చిల్కూరి సుశీల్‌రావు అన్నారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బోస్ స్పందిస్తూ.. భారతదేశం నుండి వచ్చిన డాక్యుమెంటరీ ఆస్కార్ చ‌ల్ల‌గ‌రిగ‌, యునైటెడ్ స్టేట్స్ నుండి వ‌చ్చిన మ‌రో రెండు సహా నామినీలతో పోటీప‌డుతూ విజేతగా నిలిచింది.

`ఆస్కార్ చల్లగరిగ` అనే డాక్యుమెంటరీకి కేన్స్ పుర‌స్కారం ద‌క్క‌డం అమితానందాన్నిచ్చింది. నేను ఆస్కార్ అవార్డును గెలుచుకున్నానని మా గ్రామం చల్లగరిగ ఎలా జరుపుకుందో తెలియజేసేందుకు నేను సంతోషిస్తున్నాను! అని గీత రచయిత చంద్రబోస్ అన్నారు. అవార్డు గెలుచుకోవ‌డంపై ఆయ‌న ఆనందం వ్య‌క్తం చేసారు.

తెలుగు డాక్యుమెంటరీ ఫ్రాన్స్‌లోని కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విజేతగా నిల‌వ‌డం అరుదైన ఘ‌న‌త‌. డిసెంబరు 27న వివిధ విభాగాల్లో ఫలితాలు ప్రకటించారు. `ఆస్కార్ చల్లగరిగ` ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌గా ఎంపికైంది.