Begin typing your search above and press return to search.

అయోధ్య ఉత్స‌వానికి చిరు-చ‌ర‌ణ్‌ల‌కు ఆహ్వానం

జనవరి 22న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న నేపథ్యంలో దేశమంతా గొప్ప భావోద్వేగ స్థితిలో ఉంది

By:  Tupaki Desk   |   13 Jan 2024 6:58 PM
అయోధ్య ఉత్స‌వానికి చిరు-చ‌ర‌ణ్‌ల‌కు ఆహ్వానం
X

జనవరి 22న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న నేపథ్యంలో దేశమంతా గొప్ప భావోద్వేగ స్థితిలో ఉంది. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ కార్యక్రమానికి హాజరు కావలసినదిగా దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన రెండు వేల మంది ప్రముఖులకు ఆహ్వాన పత్రాలను పంపింది శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్. ఈ ఆహ్వాన పత్రాలను ఆయా ప్రముఖులకు స్వయంగా అందజేసే బాధ్యతను విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు గుర్రం సంజీవ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ శశిధర్ రావినూతల బృందానికి అప్పగించగా వారు ఆహ్వాన పత్రాన్ని మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. ఇంత‌కుముందే రామ్ చ‌ర‌ణ్ కి ఆహ్వానం అందింది. జాతీయ నాయకులు సునీల్ అంబేకర్ రామ్ చరణ్ ఉపాసన దంపతులను రామ విగ్రహ స్థాపన లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ ఇన్విటేష‌న్ ని అందించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ''అయోధ్యలో రామాలయ నిర్మాణం, రామ విగ్రహ ప్రతిష్టాపన అన్నవి వందల సంవత్సరాల నిరీక్షణకు కార్యరూపంగా భావిస్తున్నాను. ఇలాంటి ఒక చారిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకోవడం గొప్ప అదృష్టం. ఈ ఆహ్వానాన్ని నాకు అందజేసిన రామ జన్మభూమి ట్రస్టు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత గొప్ప కార్యక్రమానికి నేను సతీసమేతంగా హాజరు అవుతున్నాను'' అన్నారు .

విశ్వహిందూ పరిషత్తు నాయకులు గుర్రం సంజీవ రెడ్డి మాట్లాడుతూ-''తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి ఆహ్వానాన్ని ప‌ద్మ‌భూష‌ణుడు, మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారికి వారి స్వగృహానికి వెళ్లి రాష్ట్రం నుంచి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరాము. ఈ సందర్భంగా ఆయన ఆదరంగా రిసీవ్ చేసుకోవటమే కాకుండా ఆలయ నిర్మాణ విశేషాలతో పాటు అందుకు జరిగిన సుదీర్ఘ న్యాయపోరాట వివరాలను కూడా చెప్తుంటే మాకే ఆశ్చర్యంగా అనిపించింది. స్వయంగా ఆహ్వానం అందిస్తూ చిరంజీవి గారితో మేము గడిపిన అరగంట సమయం మాకొక ఉద్విగ్న భరిత అనుభవంగా నిలిచిపోతుంది'' అన్నారు.

చిరుకు ఆహ్వానం అందిన స‌మ‌యంలో ఆ రోజు రామ్ చరణ్ ఊరిలో లేని కారణంగా నిన్న ముంబై నుండి ప్రత్యేకంగా విచ్చేసిన జాతీయ నాయకులు సునీల్ అంబేకర్ రామ్ చరణ్ ఉపాసన దంపతులను రామ విగ్రహ స్థాపన లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ కార్డు అందజేసారు. రాంచరణ్ కూడా ఈ కార్యక్రమానికి సతీసమేతంగా హాజరవుతారు.