పెద్ద హీరోని పక్కన పెట్టి యువహీరోకి ఐకానిక్ రోల్
బర్జాత్యా ఈసారి సీనియర్ నటుడిని కాకుండా ఐకానిక్ పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాని ఎంపిక చేసుకోవడం చర్చగా మారింది.
By: Tupaki Desk | 26 Dec 2024 4:44 AM GMTప్రేమ్ అనే పేరు సల్మాన్ ఖాన్ కు పర్యాయపదం. సూరజ్ బర్జాత్యా సినిమాల్లో ఈ పేరుతో అతడు ఆకట్టుకునే పాత్రల్లో అలరించాడు. హమ్ సాథ్ సాథ్ హై నుండి ప్రేమ్ రతన్ ధన్ పాయో వరకు సల్మాన్ బర్జాత్యా సినిమాలలో ప్రేమ్ గా కనిపించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజా సమాచారం మేరకు.. బర్జాత్యా తెరకెక్కించే తదుపరి చిత్రంలో ప్రేమ్ పాత్రలో నటించేందుకు సల్మాన్ లాంటి ఒక ఇన్ సైడర్ ని కాకుండా, ఔట్ సైడర్ ని ఎంపిక చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. బర్జాత్యా ఈసారి సీనియర్ నటుడిని కాకుండా ఐకానిక్ పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాని ఎంపిక చేసుకోవడం చర్చగా మారింది.
సూరజ్ బర్జాత్యా కొత్త ప్రేమ్ - ఆయుష్మాన్ ఖురానా. అతడిలో బర్జాత్యా కొత్త ప్రేమ్‌ను కనుగొన్నాడు అన్న వార్త వైరల్ అవుతోంది. ఫ్యామిలీ ఆడియెన్ కోసం అద్బుతమైన వంటకం అందించే సూరజ్ ఈసారి ఔట్ సైడర్ ని ఎంపిక చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. సల్మాన్ వంటి పెద్ద హీరో ఇన్ సైడర్ గా పరిశ్రమను శాసిస్తున్నా కానీ, పరిశ్రమ వెలుపలి నుంచి వచ్చి ప్రతిభావంతుడికి అగ్రదర్శకుడు అవకాశం కల్పించడం ఆసక్తిని కలిగిస్తోంది.
అయితే ఫ్యామిలీ ఆడియెన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయుష్మాన్ సరైన ఎంపిక. అతడు పెద్ద తెరపై నవతరం ప్రేమ్ పాత్రను పోషించడం అందరికీ నచ్చుతుందన్న పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. ఈ జోడీ ఇప్పటికే కథపై చర్చించారు. ప్రేమ్‌గా నటించడానికి ఆయుష్మాన్‌లో అమాయకత్వం, ఆకర్షణ ఉన్నాయని సూరజ్ జీ భావిస్తున్నారని సమాచారం. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం 2025 వేసవిలో సెట్స్‌పైకి వెళుతుంది.
ఆయుష్మాన్ ఖురానా సరసన కథానాయికగా నటించడానికి ప్రస్తుతం ప్రతిభావంతురాలైన యువనటి కోసం వెతుకుతున్నారని సమాచారం. అయితే అతడి సరసన యానిమల్ ఫేం ట్రిప్తి దిమ్రీ లాక్ అయిందని కూడా కథనాలొస్తున్నాయి. నిర్మాణ సంస్థ ఇంకా దీనిని అధికారికంగా ప్రకటించకపోయినా ప్రేమ్ సరసన ట్రిప్తి ఎంపికైతే దానిపై విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ట్రిప్తి బోల్డ్ పెర్ఫామర్ గా పాపులరైంది. యానిమల్ లో కేవలం అతిథి పాత్రలో నటించిన ఈ బ్యూటీ బ్యాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో బోల్డ్ పాత్రల్లో నటించింది. అలాగే ఫ్యామిలీ డ్రామాలు, ప్రేమకథా చిత్రాలకు ఈ బ్యూటీ ఎక్స్ ప్రెషన్స్ ఎబ్బెట్టుగా ఉంటాయని కూడా కొందరు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.
ఇంకా ట్రిప్తి ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం 2026లో థియేటర్లలోకి రానుంది. బర్జాత్య విశ్వంలో ప్రేమ్ ని చాలా సంవత్సరాల తర్వాత చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతోంది. అయితే కొత్త ప్రేమ్ ని ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి. ఆయుష్మాన్ ప్రస్తుతం 'థమా' అనే చిత్రంతో మాడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్‌లో చేరాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయుష్ ఒక రక్త పిశాచిగా నటిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.