'దంగల్' 2070కోట్లు తెస్తే.. హక్కులకు కోటి ఇచ్చి వదిలించుకున్నారు: బబితా పోగత్
ఈ యువ అథ్లెట్ స్టోరితో అమీర్ ఖాన్ బృందం దంగల్ సినిమాని తెరకెక్కించింది.
By: Tupaki Desk | 23 Oct 2024 1:28 PM GMT2070 కోట్లు వసూలు చేసిన సినిమాకు ఆమె స్ఫూర్తివంతమైన నిజ జీవిత కథ ఆధారం. కానీ ఆమెకు నిర్మాతల నుంచి దక్కింది కేవలం 1 కోటి మాత్రమే. ఇంకా కావాలని అడిగితే అసలు నీ పేరే సినిమాలో లేకుండా తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారట. ఇంతకీ ఈ ఎపిసోడ్ లో ఆమె ఎవరు? అంటే .. ప్రఖ్యాత అథ్లెట్ బబితా పోగత్. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మేటి మహిళా రెజ్లర్ పోగత్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ యువ అథ్లెట్ స్టోరితో అమీర్ ఖాన్ బృందం దంగల్ సినిమాని తెరకెక్కించింది. నితీష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
అమీర్ ఖాన్ - నితీష్ తివారీల చిత్రం దంగల్ సెల్యులాయిడ్ పై అద్భుతమైన మ్యాజిక్ చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేసింది. సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 2070 కోట్లను వసూలు చేసింది. అయితే షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే...? అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, యుటివి మోషన్ పిక్చర్స్, వాల్ట్ డిస్నీ పిక్చర్స్ ఇండియా (సంయుక్త నిర్మాణం) ఆధ్వర్యంలో ఫోగట్ కుటుంబం తమ కథ హక్కులను చిత్రనిర్మాతలు అమీర్ ఖాన్, కిరణ్ రావ్, సిద్ధార్థ్ రాయ్ కపూర్‌లకు విక్రయించినందుకు కేవలం రూ. 1 కోటి మాత్రమే అందుకుంది. ఇటీవల న్యూస్ 24కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ రెజ్లర్ బబితా పోగత్ ఈ చిత్రం ఎలా సెట్స్ పైకి వెళ్లిందో మాట్లాడారు.
బబిత ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలను షేర్ చేసారు. ``చండీగఢ్‌కు చెందిన ఒక జర్నలిస్ట్ వారి గురించి ఒక కథనాన్ని రాశాడు. అది చదివిన నితీష్ తివారీ బృందం ఒక డాక్యుమెంటరీ చేయాలని భావించింది. దర్శకుడు స్వయంగా వచ్చి మా అందరితో మాట్లాడారు. ఆ సమయంలో అతడు మాపై డాక్యుమెంటరీ తీస్తానని చెప్పాడు. ఇది దాదాపు 2010లో జరిగిన స్టోరి. కానీ మా కథను రాసిన తర్వాత అతడు సినిమా తీయాలనుకుంటున్నట్లు తెలిపాడు. నితేష్ తివారీ మొదట మా అందరికీ కథను వివరించాడు. ఆ సమయంలో ఆ పాత్రలకు ఎవరిని ఎంపిక చేస్తారో కూడా వారికి తెలియదు. నా కుటుంబం మొత్తం నిశ్శబ్దంగా భావోద్వేగంతో ఉంది. మొదటి సారి సినిమా చూసినప్పుడు మళ్లీ బాల్యంలోకి వెళ్లినట్లు అనిపించింది. నేను భావోద్వేగానికి గురయ్యాను``అని తెలిపింది.
కథా హక్కుల కోసం చిత్రనిర్మాతలు ఎంత చెల్లించారని ప్రశ్నించగా, ముఖ్యంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 2070 కోట్లు సంపాదించింది. అయినా తనకు చాలా తక్కువ డబ్బు మాత్రమే వచ్చిందని బబిత చెప్పారు. ``కథ మొత్తం రాసిన తర్వాత, సినిమా నుండి నా పేరును పూర్తిగా తొలగించాలని భావించారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సినిమాలో పాత్ర పేరు మార్చాలనుకున్నారు`` అని చెప్పింది. అమీర్ ఖాన్ `సత్యమేవ జయతే` షోలో కనిపించడానికి ముందు వారు కథను రాసి మా కుటుంబ సభ్యులతో ఆ విషయాన్ని షేర్ చేసారు. దీని తర్వాత, అమీర్ ఖాన్ బృందం మాకు కాల్ చేసి, పాత్రల పేర్లను మార్చాలనుకుంటున్నట్లు చెప్పారు. కానీ అప్పుడు మా నాన్న ఫర్వాలేదు.. మీరు సినిమా తీయాలనుకుంటే మా అసలు పేర్లే అవుతాయి కదా అని అన్నారు. కథ రాయడానికి ముందే హక్కులకు సంబంధించిన రుసుము నిర్ణయించారు. ఇది దాని మొత్తం సంపాదనలో 1 శాతం కూడా కాదు`` అని బబిత వెల్లడించారు. సుమారు రూ. 1 కోటి హక్కుల కోసం అందుకున్నామని బబిత వెల్లడించింది.
సినిమా విజయం సాధించిన తర్వాత హర్యానాలో రెజ్లింగ్ అకాడమీని ప్రారంభించడంలో సహాయం కోసం తన తండ్రి అమీర్ బృందాన్ని అడిగారని, అయితే వారు ఆ అభ్యర్థనను పట్టించుకోలేదని బబిత చెప్పారు. నాన్నగారు వారి బృందాన్ని హర్యానాలో అకాడమీని ప్రారంభించడంలో సహాయం చేయమని అభ్యర్థించారు.. కానీ వారు విస్మరించారు. మంచి అకాడమీని తెరవడానికి దాదాపు రూ. 5-6 కోట్లు కావాలి... అని కూడా బబిత వెల్లడించారు.