బాలయ్యను చూసి గర్వపడుతున్నా: చంద్రబాబు నాయుడు
ఈ పార్టీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయడు, బాలకృష్ణను పొగడ్తలతో ముంచెత్తుతూ, బాలయ్యతో తన అనుబంధాన్ని వెల్లడించాడు.
By: Tupaki Desk | 2 Feb 2025 8:34 AM GMTటాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా తన అన్నయ్య బాలయ్యకు అభినందనలు తెలుపుతూ నారా భువనేశ్వరి ఓ ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి కుటుంబ సభ్యులతో పాటూ సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయడు, బాలకృష్ణను పొగడ్తలతో ముంచెత్తుతూ, బాలయ్యతో తన అనుబంధాన్ని వెల్లడించాడు.
ఓ వైపు బాలయ్య, మరో వైపు భూ(భువనేశ్వరి) ఉన్నారు. వీరిద్దరూ ఎంతో పవర్‌ఫుల్. వీరి మధ్య ఉండటం చాలా ప్రమాదమని, నిన్నటి వరకు అల్లరి బాలయ్యగా ఉన్న ఈయన ఇప్పుడు పద్మభూషణ్ బాలయ్యగా మారాడు. ఇప్పుడు బాలయ్య దేశం గర్వించదగ్గ గొప్ప బిడ్డ అని తమ కుటుంబంలో ఇలాంటి అవార్డు రావడం ఇదే మొదటిసారి అని ఈ విషయంలో అందరం ఎంతో గర్వపడుతున్నట్టు చంద్రబాబు తెలిపాడు.
అయితే ఇదంతా జస్ట్ బిగినింగ్ మాత్రమేనని, బాలయ్యది అన్‌స్టాపబుల్ జర్నీ అని, అందరూ ఒకే రంగంలో రాణిస్తుంటారు కానీ బాలయ్య వివిధ రంగాల్లో తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడని, నేను 1978లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యా, బాలయ్య 1974లోనే మొదటి సినిమా తీశాడు. ఆ విధంగా తనకంటే బాలయ్యనే నాలుగేళ్ల సీనియర్ అని బాబు తెలిపాడు.
బాలయ్య పైకి అల్లరిగా కనిపించినా లోపల ఎంతో క్రమశిక్షణ ఉంటుందని, ఒక్కోసారి ఉదయం మూడు గంటలకే నిద్ర లేచి రెండు గంటల పాటూ పూజ చేస్తాడని, అలాంటివి తన వల్ల కావని, 50 ఏళ్లుగా సినిమాల్లో ఎవర్ గ్రీన్ హీరోగా కొనసాగుతూనే, క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు తీసుకుని దేశంలోని గొప్ప క్యాన్సర్ హాస్పిటల్స్ లో ఒకటిగా దాన్ని నిలబెట్టినందుకు బాలయ్యను చూసి ఎంతో గర్వపడుతున్నానని, రాజకీయాల పరంగా కూడా ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అయ్యాడని, ఎంతో మంచి మనిషి బాలయ్యని, అంతటి అద్భుతమైన బావమరిది దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు పేర్కొన్నాడు. ఈ పార్టీలో బాలయ్యపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇదే పార్టీలో బాలయ్యను తన సోదరి భువనేశ్వరి నీకు మ్యాన్షన్ హౌస్ కు సంబంధమేంటి? వసుంధర కంటే నీకు మ్యాన్షన్ హౌసే ఎక్కువైపోయిందని అడగ్గా, తన జీవితంలో యాదృచ్ఛికంగా జరిగిన వాటిలో మ్యాన్షన్ హౌస్ కూడా ఒకటని, అదే నన్ను ప్రేమించిందని, తనకు మ్యాన్షన్ హౌస్, వసుంధర రెండు కళ్లని ఈ సందర్భంగా బాలయ్య సరదాగా సమాధానమిచ్చాడు.