Begin typing your search above and press return to search.

'బేబీ జాన్' : కీర్తి సురేశ్ హిందీ సినిమా ఎలా ఉందంటే?

వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ''బేబీ జాన్''. కాలీస్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను డైరెక్టర్ అట్లీ నిర్మించారు

By:  Tupaki Desk   |   25 Dec 2024 7:08 AM GMT
బేబీ జాన్ : కీర్తి సురేశ్ హిందీ సినిమా ఎలా ఉందంటే?
X

వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ''బేబీ జాన్''. కాలీస్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను డైరెక్టర్ అట్లీ నిర్మించారు. ఇది 2016లో అట్లీ తమిళ్ లో తీసిన 'తేరి' (తెలుగులో 'పోలీసోడు') చిత్రానికి హిందీ రీమేక్. మహానటి కీర్తికి బాలీవుడ్ డెబ్యూ. ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్న ఈ సినిమా.. క్రిస్మస్ స్పెషల్ గా ఈరోజు (డిసెంబర్ 25) థియేటర్లలోకి వచ్చింది. దీనికి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో 'ఎక్స్' లో ట్వీట్స్ చూసి తెలుసుకుందాం.

ఏదైనా ఒక భాషలో హిట్టయిన సినిమాని మరో భాషలోకి రీమేక్ చేసినప్పుడు, కచ్చితంగా పోలికలు వస్తాయి. ఒరిజినల్ కంటే బెటర్ గా తీసారా లేదా? అనే చర్చ నడుస్తుంది. 'బేబీ జాన్' టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచే ఈ కంపేరిజన్స్ వచ్చాయి. అయితే దర్శక నిర్మాతలు మాతృక కథలో పెద్దగా మార్పులు చేయకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తేరి కంటే చాలా గ్రాండ్ గా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దడానికి ట్రై చేసారు. అలానే కొత్తగా అనిపించాలనే ఉద్దేశంతో స్క్రీన్ ప్లే మార్చే ప్రయత్నం జరిగింది.

యాక్షన్, డ్రామా, ఎమోషన్స్, రొమాన్స్, కామెడీ.. ఇలా అన్ని అంశాల కలయికగా 2 గంటల 40 నిమిషాల హార్డ్‌కోర్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా 'బేబీ జాన్' సినిమా తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ, కొన్ని సన్నివేశాలు మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుందని టాక్ ని బట్టి తెలుస్తోంది. ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం చాలా హార్డ్ హిట్టింగ్ ఉందని అంటున్నారు. సెకండాఫ్ ని యాక్షన్ సీన్స్ తో నింపేసారని, క్లైమాక్స్ బాగుందని, రేసీ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయని ఆడియన్స్ చెబుతున్నారు.

ఎస్.థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో అతని బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిందని అంటున్నారు. అదే సమయంలో కొన్ని చోట్ల సౌండ్ మిక్సింగ్ ఇష్యూస్ ఉన్నాయనే మాట కూడా వినిపిస్తోంది. అలానే పాటలు ఇంకాస్త బెటర్ గా ఉండాల్సిందనే కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుందని చెబుతున్నారు కానీ, ఎడిటింగ్ మరింత స్పష్టంగా ఉండాల్సిందని అభిపాయ పడుతున్నారు. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని తెలుస్తోంది.

వరుణ్ ధావన్ రెండు వేరియేషన్స్ పాత్రలో మెప్పించాడు. ఓవైపు కూతురిని కాపాడుకునే తండ్రిగా, మరోవైపు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ లో తనలోని మాస్ మోడ్ ని చూపించాడు. కాకపోతే 'తేరి'లో విజయ్ ను మ్యాచ్ చేయలేకపోయాడనే కామెంట్స్ వస్తున్నాయి. కీర్తి సురేష్ డెబ్యూతోనే హిందీ ఆడియన్స్ దృష్టిలో పడింది. ఆమె పాత్ర పరిమితంగా ఉన్నప్పటికీ సన్నివేశాలకు ప్రధాన ఆకర్షణ తీసుకొచ్చింది.. ఫ్రెష్ నెస్ ని జోడించింది. వామికా గబ్బి తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంది. కానీ ఆమె పాత్రను ఇంకా బాగా డెవెలప్ చేసి ఉండవచ్చు. గ్లామర్ విషయంలో కీర్తి కంటే వామికా ఎక్కువ మార్కులు కొట్టేసిందని అంటున్నారు.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ ‘బేబీ జాన్’ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చింది. ఏజెంట్ బాయ్‌ జాన్‌గా సల్లూ భాయ్ ఎంట్రీకి విజిల్స్ పడుతున్నాయి. 'పుష్ప' లెవెల్ లో ఆయన మీద తీసిన యాక్షన్ సీన్ ఫ్యాన్స్‌కి తెగ నచ్చేస్తోంది. విలన్ క్యారక్టర్ ను ఒరిజినల్ కంటే మరింత పవర్ ఫుల్ గా చూపించారు. భయానకమైన విలన్ పాత్రలో జాకీ ష్రాఫ్ అదిరిపోయే పెరఫార్మన్స్ ఇచ్చారు. అలానే రాజ్‌పాల్ యాదవ్‌ అలరించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ జారా జియన్నా క్యూట్ గా నటించింది.

ఓవరాల్ గా 'బేబీ జాన్' అనేది మాస్ ఆడియన్స్ ను అలరించే యాక్షన్ ప్యాకేజ్డ్ ఎంటర్‌టైనర్. మెయిన్ ప్లాట్ లో కొత్తదనం లేనప్పటికీ, ఊహించిన విధంగానే కథనం ముందుకు సాగుతున్నప్పటికీ.. ప్రేక్షకులకు ఆసక్తి సన్నగిల్లకుండా క్రమం తప్పకుండా యాక్షన్ బ్లాక్‌లను, హై పాయింట్స్ తో ఎంగేజ్ చేయడానికి దర్శకుడు ప్రయతించారు. కామెడీ, యాక్షన్‌ బాగున్నప్పటికీ, ఎమోషనల్ సీన్స్ పెద్దగా వర్కవుట్ కాలేదని అంటున్నారు. ముఖ్యంగా ఒరిజినల్‌ చూసిన వాళ్ళు మాత్రం ఏదో లోటుగా అనిపిస్తుందని చెబుతున్నారు. కానీ మాస్ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా తప్పకుండా అలరిస్తుందని టాక్ ని బట్టి తెలుస్తోంది.