Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ Vs బచ్చన్: క్లాష్ కు కారణమిదే!

తన గురువు పూరీ జగన్నాధ్ సినిమాతో పోటీ పడటం గురించి 'మిస్టర్ బచ్చన్' టీజర్ లాంచ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడారు.

By:  Tupaki Desk   |   29 July 2024 5:38 AM GMT
ఇస్మార్ట్ Vs బచ్చన్: క్లాష్ కు కారణమిదే!
X

ఇండిపెండ్స్ డే స్పెషల్ గా ఆగస్టు 15వ తారీఖున చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిల్లో 'డబుల్ ఇస్మార్ట్', 'మిస్టర్ బచ్చన్' చిత్రాలు కూడా ఉన్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన సినిమా ఒకటైతే, మరొకటి హీరో రవితేజ - డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మూవీ. 'పుష్ప 2' వాయిదా పడిన వెంటనే 'ఇస్మార్ట్ శంకర్' కోసం రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారు. కానీ దానికి పోటీగా బచ్చన్ ను దించుతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో, ఫ్యాన్స్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. దీనికి తోడు నిర్మాత ఛార్మీ కౌర్ సోషల్ మీడియా మాధ్యమాల్లో హరీశ్ శంకర్, రవితేజలను అన్ ఫాలో చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్లాష్ కు గల కారణాలను హరీశ్ వివరించారు.

తన గురువు పూరీ జగన్నాధ్ సినిమాతో పోటీ పడటం గురించి 'మిస్టర్ బచ్చన్' టీజర్ లాంచ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడారు. ''డైరెక్టర్ గా ఎదుగుతున్న రోజుల నుంచీ పూరీ జగన్నాథ్, రాజమౌళి, వినాయక్ లాంటి దర్శకులు విపరీతంగా నన్ను ఎంకరేజ్ చేసారు. సినిమాలో డైలాగ్స్, పాటలు నచ్చినా ఫోన్ చేసి మాట్లాడేవారు. పూరీతో నేను ఎక్కువ వర్క్ చేశాను. ఆయనతో నాకు రిలేషన్ ఎక్కువ. ఏ రోజూ పూరీతో కంపేర్ చేసుకునే స్థాయి నాదు కాదు. ఆయనకొక లెజండరీ డైరెక్టర్. మాకున్న కొన్ని ఫైనాన్సియల్ వ్యవహారాలు, ఓటీటీ ఇష్యూస్ ని అడ్రెస్ చేయడం వల్ల కావొచ్చు అనుకోకుండా ఈ డేట్ క్లాష్ అవుతోంది.'' అని హరీష్ అన్నారు.

''డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్నే ముందుగా అనౌన్స్ చేసారు. మాకు అసలు ఆ డేట్ ను వచ్చే ఉద్దేశ్యమే లేదు. ఆగస్టు 15కి రండి అని మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ అధినేత శశి చెవిలో జోరీగలాగా మాకు చెబుతూ వచ్చాడు. నిజంగా మేము ఆ డేట్ కు రావాలని ముందు ప్రిపేర్ అవ్వలేదు. కొంచం రిలాక్స్ గానే వద్దాం అనుకున్నాం. కానీ 'పుష్ప 2' పోస్ట్ పోన్ అవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మేం రావాల్సి వస్తోంది. పూరీతో చాలా ఏళ్లుగా నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఒక్క సినిమా క్లాష్ అయినంత మాత్రాన మేమిద్దరం మాట్లాడుకోమనో, ఎడమొహం పెడమొహంలా ఉంటామనే నేను అనుకోను. ఎందుకంటే పూరీ నాకంటే చాలా చాలా మెచూర్డ్ క్యాండిడేట్'' అని హరీష్ శంకర్ తెలిపారు.

ఛార్మీ కౌర్ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంపై స్పందిస్తూ.. ''ఆమె ఆ సినిమాకి ప్రొడ్యూసర్. డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకో సినిమా వస్తే వాళ్ళ ప్లేస్ లో నేనున్నా నాక్కూడా ఇరిటేషన్ గానే ఉంటుంది. అందుకే నేను చార్మీని తప్పుబట్టను. సోషల్ మీడియాలో ఎవరిని కావాలనుంటే ఫాలో అవ్వొచ్చు, అన్ ఫాలో చెయ్యొచ్చు. ఎవరిష్టం వారిది. అన్ ఫాలో అయినట్లు నేనింకా కంఫర్మ్ చేసుకోలేదు. ఎవరో నాకు ఒక మీమ్ పంపించారు. చాలా మీమ్స్ వస్తుంటాయి కాబట్టి అంత సీరియస్ గా తీసుకోను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. రామ్ తో నేను సినిమా చేయబోతున్నాను. నేను సినిమా చేయబోయే హీరోతో కావాలని నేను క్లాష్ కి వెళ్లడం లేదు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో మాకు తప్పడం లేదు. మనస్ఫూర్తిగా అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. 'డబుల్ ఇస్మార్ట్', 'మిస్టర్ బచ్చన్' సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని హరీష్ చెప్పుకొచ్చారు.

ఇక నిర్మాత విశ్వప్రసాద్ ఆగస్ట్ 15కి రావడం గురించి మాట్లాడుతూ.. ''ఐదు రోజుల హాలీడేస్ కి రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి. మరో తమిళ్ సినిమా, చిన్న సినిమా కూడా వస్తున్నాయి. మన థియేటర్ సిస్టం అన్ని సినిమాలని సపోర్ట్ చేయగలదు'' అని అన్నారు. ఏదేమైనా 'డబుల్ ఇస్మార్ట్', 'మిస్టర్ బచ్చన్' లాంటి రెండు భారీ చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినీ అభిమానులకు బాగానే ఉన్నప్పటికీ, ఓపెనింగ్స్ పై ప్రభావం చూపుతుందేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి పూరీ జగన్నాథ్ దీనిపై ఎలా స్పదిస్తారో? బాక్సాఫీస్ వద్ద ఈ క్లాష్ ఎలా ఉంటుందో చూడాలి.