మూవీ రివ్యూ : బచ్చల మల్లి
By: Tupaki Desk | 20 Dec 2024 4:06 AM GMT'బచ్చల మల్లి' మూవీ రివ్యూ
నటీనటులు: అల్లరి నరేష్-అమృత అయ్యర్-రావు రమేష్-రోహిణి-హరిప్రియ-జయరాం-హర్ష చెముడు-ప్రసాద్ బెహరా-ప్రవీణ్-అచ్యుత్ కుమార్-అంకిత్ కొయ్య తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఛాయాగ్రహణం: రిచర్డ్ ఎం.నాథన్
స్క్రీన్ ప్లే: విప్పర్తి మధు
నిర్మాతలు: రాజేష్ దండ-బాలాజి గుట్ట
కథ-మాటలు-దర్శకత్వం: సుబ్బు మంగాదేవి
ఒకప్పుడు కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్.. కొన్నేళ్ల నుంచి ఎక్కువగా సీరియస్ పాత్రలే చేస్తున్నాడు. 'నాంది'లో ఇంటెన్స్ పాత్రతో ఆకట్టుకున్న అతను.. ఇప్పుడు 'బచ్చల మల్లి' అనే మరో సీరియస్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుబ్బు మంగాదేవి ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
గోదావరి ప్రాంతంలోని తుని మండలంలో సురవరం అనే ఊరిలో బచ్చలమల్లి (అల్లరి నరేష్) అనే కుర్రాడుంటాడు. అతను చిన్నప్పుడు తెలివైన విద్యార్థి. పదో తరగతిలో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలుస్తాడు. అతడికి తండ్రంటే చాలా ఇష్టం. తండ్రికీ అతనంటే ప్రాణం. ఐతే తనెంతో ప్రేమించే తండ్రి చేసిన ఒక తప్పుతో అతణ్ని అసహ్యించుకుంటాడు. తండ్రి మీద ద్వేషం పెంచుకుని.. చదువు మీద ధ్యాస తగ్గిస్తాడు మల్లి. ఈ క్రమంలోనే చెడు వ్యసనాలకు కూడా బానిస అయిపోతాడు. తండ్రి ఎంత సర్దిచెప్పాలని చూసినా అతడిలో మార్పు రాదు. రోజు రోజుకూ మూర్ఖంగా తయారవుతున్న మల్లిలో కావేరి (అమృత అయ్యర్) పరిచయంతో మార్పు వస్తుంది. అతను వ్యసనాలు వదిలేసి ప్రయోజకుడయ్యే ప్రయత్నం చేస్తాడు. కానీ కావేరితో పెళ్లి దగ్గర సమస్య తలెత్తి మళ్లీ మల్లిలోని మూర్ఖుడు బయటికి వస్తాడు. ఈ క్రమంలో తన జీవితం ఎలాంటి మలుపు తిరిగింది.. ఇంతకీ కావేరిని అతను పెళ్లి చేసుకున్నాడా లేదా.. తండ్రితో అతడి గొడవ ఎక్కడిదాకా వెళ్లింది.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెర మీదే చూసి తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
ఇప్పుడు హీరో అంటే రాముడు మంచి బాలుడు అంటే ఎంతమాత్రం కాదు. ఎంతగా నెగెటివ్ షేడ్స్ ఉంటే అది జనాలకు అంత ఎక్కేస్తోంది. పుష్ప-2 రూపంలో తాజా ఉదాహరణ కళ్ల ముందు కనిపిస్తోంది. ఐతే హీరోలో ఎంత నెగెటివ్ టచ్ ఉన్నా సరే.. అందులో ఎక్కడో హ్యూమన్ యాంగిల్ కనిపించాలి. అతను ఎంత యాటిట్యూడ్ చూపించినా.. ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా.. అందులో ఒక హీరోయిజం కనిపించాలి. అది ఎలివేషన్ కు ఉపయోగపడాలి. అప్పుడే ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారు. అలా కాని పక్షంలో ప్రేక్షకులకు అసహనమే కలుగుతుంది.
'బచ్చలమల్లి'తో ఉన్న ప్రాబ్లం ఇదే. పట్టువిడుపులు లేకపోతే.. మరీ మూర్ఖత్వానికి పోతే.. జరిగే నష్టం పూడ్చలేనిది.. చివరికి మిగిలేది ఏమీ లేదు.. అనే సందేశం ఇవ్వదలుచుకున్నాడు 'బచ్చల మల్లి' ద్వారా దర్శకుడు సుబ్బు మంగాదేవి. అతడి ఆలోచన బాగుంది. అలాగే పరమ మూర్ఖుడైన పాత్రలో అల్లరి నరేష్ పెర్ఫామెన్స్ కూడా అదిరిపోయింది. కానీ కథగా బాగానే అనిపించినా.. ఎగ్జిక్యూషన్లో పట్టు లేకపపోవడం.. పైన చెప్పుకున్నట్లు హీరో పాత్ర అసహనం కలిగించడమే తప్ప.. వినోదాన్ని పంచకపోవడం.. అవసరం లేని సన్నివేశాలతో సాగతీతగా అనిపించడం 'బచ్చల మల్లి'కి మైనస్ అయ్యాయి. కొన్ని స్టాండౌట్ ఎపిసోడ్లు.. మంచి పెర్ఫామెన్సులు ఎంగేజ్ చేసినా.. పూర్తి స్థాయిలో మాత్రం మెప్పించలేకపోయింది 'బచ్చల మల్లి'.
బచ్చల మల్లి నిజ జీవిత గాథే కావడం విశేషం. ఆ పేరుతో ఓ మనిషి నిజంగానే ఉన్నాడు. అతడి కథకే కొన్ని కల్పితాలు జోడించి.. సినిమాగా మలిచాడు సుబ్బు మంగాదేవి. తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘటనలను ప్రభావవంతంగా తెరపై చూపించడంలో సుబ్బు విజయవంతం అయ్యాడు. ఆ ఘటనల్ని బట్టి చూస్తే.. సినిమా తీయడానికి అవసరమైన సరకు తన కథలో ఉన్నట్లే అనిపిస్తుంది. ఐతే నిజ జీవితాన్ని ఉన్నదున్నట్లు చూపిస్తే ప్రేక్షకులు ఎంటర్టైన్ కావడం కష్టం. ఎందుకంటే వాస్తవ కథల్లో కొన్ని సంఘటనల వరకు ప్రత్యేకంగా అనిపించొచ్చు కానీ.. సినిమాకు అవసరమైన డ్రామా అందులో ఉండకపోవచ్చు. అలాంటపుడు వాస్తవ కథకు 'సినిమా' టచ్ ఇవ్వడంలోనే రచయితలు.. దర్శకుల నేర్పు ఉంటుంది. ఐతే ఈ పనిని సంతృప్తికర స్థాయిలో చేయలేకపోయింది సుబ్బు అండ్ టీం. హీరో అంత మూర్ఖుడిగా తయారవడానికి దారి తీసే పరిస్థితులను.. అలాగే తన మూర్ఖత్వంతో జరిగిన విషాద ఘటనలకు సంబంధించిన ఎపిసోడ్లను మాత్రం సుబ్బు చాలా బాగా తీశాడు. అవి హార్డ్ హిట్టింగ్ గా అనిపిస్తాయి. ప్రేక్షకులను కదిలిస్తాయి. కానీ ఈ ఘటనల మధ్య ఆసక్తికర సన్నివేశాలతో సినిమాను ఎంగేజింగ్ గా నడిపించడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. అక్కడే 'బచ్చల మల్లి' పట్టు కోల్పోయింది.
'బచ్చలమల్లి'లో తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని.. వారి మధ్య వైరాన్ని తక్కువ సన్నివేశాల్లోనే బలంగా చూపించాడు దర్శకుడు. దీనికి సంబంధించిన ఆరంభ సన్నివేశాలు సినిమా మీద మంచి అంచనాలు రేకెత్తిస్తాయి. కానీ ఆ తర్వాత మాత్రం సాధారణ సన్నివేశాలతో మామూలుగా సాగిపోతుందీ చిత్రం. హీరో ప్రేమకథ కానీ.. కుటుంబ సన్నివేశాలు కానీ ఏమంత ఆసక్తి రేకెత్తించవు. ఎప్పుతూ తాగుతూ.. మూర్ఖంగా ప్రవర్తిస్తూ.. బాధ్యత లేకుండా తిరిగే హీరోను మంచి కుటుంబంలో పెరుగుతూ చక్కగా చదువుకుంటున్న అందమైన అమ్మాయి అయిన హీరోయిన్ ప్రేమించడానికి బలమైన కారణం కనిపించదు. ఐతే హీరోను హీరోయిన్ పరీక్షించే ఒక్క సన్నివేశం మాత్రం ప్రత్యేకంగా అనిపిస్తుంది. అది ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది. హీరో తన తండ్రితో మరీ కర్కశంగా ప్రవర్తించే ఓ ఎపిసోడ్ కూడా బాగానే ఎంగేజ్ చేస్తుంది.
ప్రథమార్ధం వరకు ఓ మోస్తరుగా అనిపించే 'బచ్చలమల్లి' రెండో అర్ధంలో కథ పరంగా అసలు కదలికే లేక భారంగా తయారవుతుంది. హీరో-విలన్ మధ్య వైరం ఏమాత్రం ఆసక్తి రేకెత్తించదు. అందులో బలమైన కాన్ఫ్లిక్ట్ ఏమీ కనిపించదు. విలన్ పాత్ర నామమాత్రంగా అనిపిస్తుంది. హీరోయిన్ని దూరం చేసుకోవడంలో హీరో చూపించే మూర్ఖత్వం మరీ అసహజంగా అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో చాలాసేపు ఈ అసహనమే కొనసాగుతుంది. దారీ తెన్నూ లేకుండా సాగే కథ విసుగెత్తిస్తుంది. అనవసర సన్నివేశాలతో రాను రాను 'బచ్చల మల్లి' గ్రాఫ్ పడిపోతూ వెళ్తుంది. ఐతే ప్రి క్లైమాక్స్ నుంచి పుంజుకునే సినిమా.. మంచి ముగింపుతో పర్వాలేదనిపిస్తుంది. కానీ అంతకుముందు జరిగిన నష్టాన్ని భర్తీ చేసే స్థాయిలో మాత్రం పతాక సన్నివేశాలు లేవు. 'బచ్చల మల్లి' రెండు మూడు బలమైన ఎపిసోడ్లు.. అల్లరి నరేష్ పెర్ఫామెన్స్ మీద ఎక్కువ ఆధారపడ్డ సినిమా. కానీ రెండున్నర గంటల్లో ఆ కొన్ని ఎపిసోడ్లు.. హీరోె పెర్ఫామెన్స్ మాత్రమే సినిమాను సేవ్ చేస్తాయా అన్నది ప్రశ్న.
నటీనటులు:
కామెడీ పాత్రలు చేస్తున్నపుడు తెలియలేదు కానీ.. అల్లరి నరేష్ ఎంత మంచి నటుడో అతను సీరియస్ పాత్రలు చేస్తున్నపుడే బాగా తెలుస్తోంది. బచ్చల మల్లి పాత్రలో అతను జీవించేశాడు. ఒక దశ దాటాక నరేష్ కాకుండా చూసేవాళ్లకు మల్లినే కనిపిస్తాడు. తనను పట్టుకుని కొట్టాలనిపించే ఫీలింగ్ తీసుకువస్తాడంటే అతను ఆ పాత్రలో ఎంతగా ఒదిగిపోయాడో అర్థం చేసుకోవచ్చు. పతాక సన్నివేశాల్లో తన నటన మరింత బాగుంది. నరేష్ తర్వాత ఎక్కువ మెప్పించేది రావు రమేష్. చాలా తక్కువ సన్నివేశాల్లోనే ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హీరో హీరోయిన్ని అడగడానికి తన ఇంటికి వచ్చిన సీన్లో.. అలాగే క్లైమాక్సులో రావు రమేష్ భలేగా చేశాడు. హీరోయిన్ అమృత అయ్యర్ ఓకే. ఆమె పాత్రకు తగ్గట్లుగా నటించి మెప్పించింది. రోహిణి తల్లి పాత్రలో మరోసారి అద్భుతంగా నటించింది. తల్లి పాత్రల్లో ఇంత సహజంగా ఒదిగిపోయే నటి ఈ రోజుల్లో ఇంకొకరు కనిపించరు. తండ్రి పాత్రలో బలగం నటుడు జయరాం కూడా బాగా చేశాడు. హరిప్రియ.. ప్రవీణ్.. హర్ష చెముడు.. వీళ్లంతా సహాయ పాత్రల్లో చక్కగా నటించారు. విలన్ పాత్రలో కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ కూడా ఓకే.
సాంకేతిక వర్గం:
విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఓకే. పాటల్లో చార్ట్ బస్టర్ అనిపించే సాంగ్ ఏదీ లేకపోవడం మైనస్సే కానీ.. తీసిపడేసేలా మాత్రం లేవు. తెర మీద అలా అలా సాగిపోతాయి. నేపథ్య సంగీతం బాగుంది. రిచర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణం నీట్ గా సాగింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు బాగానే కుదిరాయి. కథకుడు-దర్శకుడు సుబ్బు మంగాదేవి 'బచ్చలమల్లి' కథను సిన్సియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఐతే అతను కొన్ని ఎపిసోడ్లను నమ్ముకుని సినిమాను నడిపించేశాడు కానీ.. వాటిని మినహాయిస్తే చాలా వరకు కథ ఫ్లాట్ గా సాగిపోయింది. ఆరంభ.. చివరి ఎపిసోడ్ల మధ్య కథనం ఇంకా ఆసక్తికరంగా ఉండేలా చూసుకోవాల్సింది. స్క్రీన్ ప్లే ఎగుడుదిగుడుగా సాగి ఇబ్బంది పెట్టింది. ఎమోషనల్ సీన్లను మాత్రం సుబ్బు బాగా డీల్ చేశాడు. డైలాగులు కూడా బాగున్నాయి.
చివరగా: బచ్చల మల్లి.. కొంచెం బలంగా.. కొంచెం భారంగా
రేటింగ్- 2.5/5