అదే డేట్‌న 'బచ్చల మల్లి' కూడా..!
ఇన్ని సినిమాలు ఉన్న అదే తేదీన అల్లరి నరేష్ బచ్చల మల్లి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.
By: Tupaki Desk | 19 Nov 2024 9:46 AM GMTఅల్లరి నరేష్ కామెడీ సినిమాలతో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు దక్కించుకున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన నుంచి వచ్చిన కామెడీ సినిమాలు ఫ్లాప్ కావడంతో చేసేది లేక తన పంథా మార్చుకున్నాడు. నాంది వంటి సీరియస్ సినిమా చేయడంతో హిట్ దక్కించుకున్నాడు. తన నుంచి ప్రేక్షకులు కామెడీ కంటే సీరియస్ సినిమాలు ఆశిస్తున్నారని అర్థం చేసుకున్న అల్లరోడు మరోసారి సీరియస్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న సుబ్బు మంగదేవి దర్శకత్వంలో అల్లరి నరేష్ ఒక సినిమాను చేస్తున్నాడు.
విభిన్న చిత్రాలను నిర్మించి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు సొంతం చేసుకున్న రాజేష్ దండా నిర్మాణంలో సుబ్బు మంగదేవి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న 'బచ్చల మల్లి' సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. సినిమా విడుదల తేదీ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి నుంచి సమ్మర్ వరకు వరుసగా సినిమాలు ఉన్న కారణంగా డిసెంబర్‌లోనే సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి బచ్చల మల్లి మేకర్స్ వచ్చారని తెలుస్తోంది. డిసెంబర్ 20వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
బచ్చల మల్లి సినిమాలో అల్లరి నరేష్ లుక్ ఎలా ఉంటుంది అనే విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అల్లరోడు మాస్ లుక్ లో, చాలా పవర్ ఫుల్‌గా కనిపించబోతున్నాడు అంటూ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకి మంచి బజ్ ఉంది. అల్లరి నరేష్‌ని కామెడీ సినిమాలతో పాటు ఇలాంటి సినిమాలతో చూడాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను చాలా పోటీ ఉన్న సమయంలో విడుదల చేయడంతో ఫలితం ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తం అవుతోంది.
డిసెంబర్ 20వ తారీకున బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన భైరవం సినిమాను విడుదల చేయబోతున్నారు. మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక నితిన్ హీరోగా రూపొందిన రాబిన్ హుడ్ సినిమాను సైతం డిసెంబర్ 20వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేశారు. ఈ రెండు సినిమాలు కాకుండా మరో రెండు మూడు సినిమలు డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్నాయి. ఇన్ని సినిమాలు ఉన్న అదే తేదీన అల్లరి నరేష్ బచ్చల మల్లి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.