Begin typing your search above and press return to search.

క్రేజీ మల్టీస్టారర్.. బిగ్గెస్ట్ డిజాస్టర్

ఐతే రిలీజ్ తర్వాత ఈ సినిమా అనుకున్న దాని కంటే దారుణమైన ఫలితాన్ని అందుకుంది.

By:  Tupaki Desk   |   16 April 2024 5:30 PM GMT
క్రేజీ మల్టీస్టారర్.. బిగ్గెస్ట్ డిజాస్టర్
X

అక్షయ్ కుమార్ అంటే కొన్నేళ్ల ముందు వరకు ఖాన్ త్రయానికి దీటుగా నిలిచిన సూపర్ స్టార్. ఇక టైగర్ ష్రాఫ్ గత దశాబ్ద కాలంలో చాలా వేగంగా ఎదిగిన స్టార్. ఇలాంటి కాంబినేషన్లో సినిమా అంటే ఉండే క్రేజే వేరు. పైగా ‘సుల్తాన్’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన అబ్బాస్ అలీ జాఫర్ డైరెక్టర్ అంటే ఇంకా ఆసక్తి ఉంటుంది. ఇలాంటి కలయికలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందితే బాక్సాఫీస్ షేక్ అయిపోవాలి. వందల కోట్ల వసూళ్లు రావాలి. కానీ ‘బడేమియా చోటేమియా’ ఫుల్ రన్లో ఒక్క వంద కోట్లు కూడా వసూళ్లు రాబట్టలేని పరిస్థితి. దీని ట్రైలర్ చూస్తేనే జనాలకు రిజల్ట్ అర్థం అయిపోయింది. సినిమా ఆడడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. యాక్షన్ మోత మినహాయిస్తే ఆకర్షణలేమీ కనిపించలేదు. ఐతే రిలీజ్ తర్వాత ఈ సినిమా అనుకున్న దాని కంటే దారుణమైన ఫలితాన్ని అందుకుంది.

‘బడేమియా చోటేమియా’ ఫుల్ రన్ ఇండియా వసూళ్లు రూ.60 కోట్లకు మించే అవకాశం లేదన్నది ట్రేడ్ వర్గాల మాట. వీకెండ్ వరకు ఏదో అలా నెట్టుకొచ్చిన సినిమా.. ఆ తర్వాత దారుణమైన డ్రాప్ చూసింది. సోమవారం ఇండియా మొత్తంలో వచ్చిన వసూళ్లు కేవలం రూ.2 కోట్లు. విదేశాల్లో కూడా సినిమాకు పూర్ రెస్పాన్స్ కనిపిస్తోంది. అతి కష్టం మీద ఈ సినిమా రూ.50 కోట్ల వసూళ్ల మార్కును దాటింది. ఇక సినిమా పుంజుకుంటుందనే ఆశలు ఎంతమాత్రం కనిపించడం లేదు. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.300 కోట్లు కావడం గమనార్హం. కానీ అందులో మూడో వంతు కూడా థియేటర్ల నుంచి వెనక్కి రావడం లేదు. బాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలవబోతోంది ‘బడేమియా చోటేమియా’. అసలు డబుల్ డిజిట్ డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్న అక్షయ్ కుమార్‌కిది ఇది పెద్ద షాకే.