మెగా హీరోల్ని బ్యాడ్ టైమ్ బంతాడేస్తోందా?
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు.
By: Tupaki Desk | 19 March 2024 1:30 PM GMTమెగా ఫ్యామిలీని బ్యాడ్ టైమ్ బంతాడేస్తోందా? హీరోలంతా వరుస వైఫల్యాల్లోనే కనిపిస్తున్నారా? ఒకరి వెంట ఒకరు ప్లాప్ తప్ప సక్సస్ కనిపించడం లేదా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. 'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్- సాయితేజ్ నటించిన సంగతి తెలిసిందే. అందులో పవన్ దేవుడైతే...మేనల్లుడు భక్తుడి పాత్రల్లోనూ నటించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు.
విజయాల్లో ఉన్న ఇద్దరు బాక్సాఫీస్ వద్ద భారీగానే కాసులు రాబడతారు అనుకుంటే ట్రేడ్ అంచనాలు తప్పయ్యాయి. ఆ తర్వాత పవన్ సెట్స్ కి తీసుకెళ్లిన సినిమాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇక సాయితేజ్ `గాంజా శంకర్` కూడా ఆగిపోయింది. ఇంతవరకూ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించింది లేదు. `విరూపాక్ష`తో వంద కోట్ల హీరో అయినా ధైర్యంగా ముందుకెళ్లలేని పరిస్థితి.
ఇక `వాల్తేరు వీరయ్య`తో మెగాస్టార్ చిరంజీవి భారీ విజయం అందుకున్నా ఆ సంతోషం ఎంతో కాలం ఉండలేదు. `భోళా శంకర్` రూపంలో భారీ ప్లాప్ పడింది. దీంతో హిట్ మేకర్ విషయంలో ఆచితూచి చివరికి `వషిష్ట`తో 156వ సినిమా పట్లాలెక్కించారు. 157 ని పక్కనబెట్టేసారు. ఇక మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ `ఆది కేశవ` దెబ్బతో ఇంకా కోలుకోలేదు. అందకు ముందు చేసిన రెండు సినిమాలు కూడా సరైన ఫలితాలు సాధించలేదు.
దీంతో కొత్త ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇక మరో వారసుడు వరుణ్ తేజ్ `ఆపరేషన్ వాలెంటైన్` తో పాన్ ఇండియాలో ఫేమస్ అవుతాడు అనుకుంటే చతికిల పట్టాడు. భారీ అంచ నాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ గా తేలింది. ఎప్పుడు రిలీజ్ అయిందో? పోయిందో కూడా తెలియని పరిస్థితి.
అంతకు ముందు రిలీజ్ చేసిన `గాండీవధారి అర్జున` కూడా అలాంటి ఫలితమే సాధించింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న `గేమ్ ఛేంజర్` ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. అదిగో పులి ..ఇదిగో తోక అన్న చందంగా ప్రచారం తప్ప రిలీజ్ అవ్వడం లేదు. ఇలా మెగా హీరోలంతా హిట్ రేసుకి దూరంగా ఉన్నారు.