Begin typing your search above and press return to search.

'పుష్ప 2'.. అల్లు అర్జున్ పై టీడీపీ ఎంపీ సెటైరికల్ పోస్ట్!

'పుష్ప-2'ని ఉద్దేశించి టీడీపీ ఎంపీ పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   2 Dec 2024 5:36 AM GMT
పుష్ప 2.. అల్లు అర్జున్ పై టీడీపీ ఎంపీ సెటైరికల్ పోస్ట్!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పుష సీక్వెల్ హడావిడే కనిపిస్తోంది. టికెట్ రేట్లు, ఫస్ట్ డే వసూళ్ల అంచనాలు, బాక్సాఫీస్ రికార్డులు.. అంటూ అందరూ ఈ సినిమా గురించే చర్చలు సాగిస్తున్నారు. ఏపీలో టికెట్ ధరల పెంపు కోసం మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. 'పుష్ప-2'ని ఉద్దేశించి టీడీపీ ఎంపీ పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కు ముందు తన మిత్రుడైన నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్రా కిశోర్ రెడ్డి ఇంటికి హీరో అల్లు అర్జున్ వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇది ప్రత్యర్థి కూటమికి, జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులకు మింగుడు పడలేదు. అయితే ఇప్పుడు టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి తాజాగా బన్నీ నంద్యాల పర్యటన ప్రస్తావన తీసుకొస్తూ.. 'పుష్ప 2: ది రూల్' సినిమాకి లింక్ చేస్తూ ఎక్స్ లో కీలక పోస్ట్ పెట్టారు.

"అల్లు అర్జున్ గారు, నంద్యాలలో మీరు చేసిన ఎన్నికల ప్రచారాన్ని మా ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. నంద్యాలలో మీరు 'ప్రీ ఎలక్షన్' ఈవెంట్ నిర్వహించినట్టుగానే, నంద్యాలలో 'ప్రీ రిలీజ్' ఈవెంట్ కూడా ఏర్పాటు చేస్తారని భావిస్తున్నాం. నంద్యాల వెళ్ళాలనే మీ సెంటిమెంట్ మాకు మాత్రం బాగా పని చేసింది. ఇప్పుడు మీ సెంటిమెంటే మా సెంటిమెంటు అల్లు అర్జున్ గారూ. మీ 'పుష్ప-2' చిత్రం పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం" అంటూ బైరెడ్డి శబరి పోస్ట్ చేశారు.

అల్లు అర్జున్ పై బైరెడ్డి శబరి చేసిన సెటైరికల్ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే కాసేపటికే తన పోస్ట్‌ను ఎడిట్ చేసిన శబరి.. చివరకు తన పోస్ట్‌ను తన ఎక్స్ ఖాతా నుంచి డిలీట్ చేసింది. కానీ అప్పటికే స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అయిపోయాయి. కాకపోతే ఇది టీడీపీ ఎంపీకి తెలియకుండా జరిగిందని, అడ్మిన్ టీమ్ లో ఎవరో కావాలని పోస్ట్ చేశారనే వార్తలు వస్తున్నాయి. అసలు శబరి అలాంటి పోస్ట్ పెట్టలేదని, ఎవరో ఎడిట్ చేసి పోస్ట్ చేశారని మరో వార్త కూడా వినిపిస్తోంది. ఏదేమైనా టీడీపీ ఎంపీ పేరు మీదుగా ఇలాంటి పోస్టు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.